May 24,2023 19:22

బీరువాలోని వస్తువులు చిందర వందరగా పాడేసిన దుండగులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణంలో ఇంటికి తాళం వేశారంటే మీ ఇంటికి దొంగలు కన్నం వేసినట్లేనని పలువురు చర్చించుకుంటున్నారు. పట్టణంలోని గుడికల్‌ రోడ్డులో ఉన్న మునెప్ప నగర్‌, రాధాకృష్ణ కాలనీకి ఆనుకుని ఉన్న శ్రీనగర్‌ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి రెండు ఇళ్లలో దొంగతనాలకు ప్రయత్నం చేశారు. శ్రీనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయులు ప్రసాద్‌, బావిగడ్డ నల్లారెడ్డి ఇళ్లలో తాళాలు పగులగొట్టి దొంగతనానికి ప్రయత్నం చేశారు. ఇద్దరూ ఉపాధ్యాయులు ఊరికి వెళ్లడంతో రాత్రి ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న వీధి కుక్కలు మొరగకుండా మత్తుమందు కలిపిన బిస్కెట్లను వేసినట్లు అక్కడి వారు తెలిపారు. రెండు మెయిన్‌ డోర్ల సిలుకలను పగులగొట్టి లోపలకు ప్రవేశించి బీరువాలోని వస్తువులను చిందరవందరగా పడేశారు. అలాగే ఇతర రూములో కూడా సోదా చేశారు. నగదు, బంగారు దొరకకపోవడంతో దొంగలు జారుకున్నారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.