Oct 05,2023 21:59

ఎంపిడిఒ కార్యాలయంలో ఉన్న బియ్యం పంపిణీ వాహనం

ప్రజాశక్తి-చిట్వేలి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ బియ్యం పంపిణీ మండలంలో రెండు నెలల నుంచి పాత పద్ధతిలోనే చేపట్టారు. మండల పరిధిలో సుమారు చౌక దుకాణం నెంబర్‌ 1 నుండి 7 వరకు గల సుమారు 13 గ్రామాల ప్రజలు గతంలో ఉన్న రేషన్‌ డీలర్ల వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గ్రామాల్లో బియ్యం పంపిణీ వాహనాల ద్వారా చేసే వారు. వాహనదారులు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తూ వెళ్తుంటే తిరిగి ఆ వాహనాలకు ఎవరు రాక పోవడంతో వాహనంతో బియ్యం పంపిణీ పాత పద్ధతులకే దారి తీసింది. బియ్యం కోసం చౌక దుకాణాలు దగ్గరికి వెళ్లిన నెట్‌వర్క్‌ సరిగా రాకపోవడం వలన గంటల కొలది వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే గతంలో నడవలేని వద్ధులకు ఇంటి దగ్గర బియ్యం పంపిణీ వలన ఎలాంటి ఇబ్బందులు ఉండకపోగా, ఇప్పుడు ఆ వద్ధుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం అందరికీ అందించేందుకు కొత్త వాహనదారులను నియమించేందుకు వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.
ఇంటి వద్దకే పంపిణీ చేస్తాం
మండలంలోని ప్రజలకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. బియ్యం పంపిణీ చేసేందుకు ఆసక్తి కలిగిన వారు వస్తే వారికి వాహనం ఇచ్చి ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
- శిరీష, తహశీల్దార్‌, చిట్వేలి.