Aug 04,2023 22:50

పనులను పరిశీలిస్తున్న ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్‌

- ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
ప్రజలకు ఒకేచోట పాలనా సేవలు అందించేందుకు వీలుగా రూపుదిద్దుకున్న ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపడుతున్న నిర్మాణ పనులు పూర్తి దశకు చేరినట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ఆర్థిక మంత్రికి వివరించారు. మౌలిక సదుపాయాల పనుల పూర్తికి మరో ఐదు నెలలు పడుతుందని కాంట్రాక్టర్‌ తెలిపారు. మొత్తం భవన సముదాయంలో ఆర్థిక మంత్రి కలియ తిరుగుతూ మిగిలిపోయిన పనులకు సంబంధించి ఏ పనులను ఎలా చేయాలో దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ.145 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌తో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోటకు రానున్నాయని తెలిపారు. పెండింగ్‌ బిల్లులు అన్నీ పూర్తి చేశామని, త్వరలోనే మిగిలిన స్వల్ప మొత్తాన్ని కూడా విడుదల చేస్తామన్నారు. సీలింగ్‌, ఫ్లోరింగ్‌, ఎలక్ట్రికల్‌ పనులు, ఎసిల ఏర్పాటు వంటి పనులు అనుభవజ్ఞులైన అధికారుల సమక్షంలో జాగ్రత్తగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఆర్థికశాఖ కార్యదర్శి ఎస్‌.ఎస్‌ రావత్‌, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.