
ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్, కడియం సంక్షేమ పథకాలను నేరుగా లబ్దిదారుని ఇంటికే అందిస్తున్న ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. శనివారం స్థానిక లిటరరీ క్లబ్‌లో ఎపికి జగనే ఎందుకు కావాలి? అనే అంశంపై పట్టణ పరిధిలోని ప్రజా ప్రతినిధుల, నాయకుల, కన్వీనర్ల, గహసారథుల, వాలంటీర్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కుల, మత, పార్టీలకు అతీతంగా నవరత్నాల పథకాలను ప్రతిఇంటికీ అందించారన్నారు. జగనన్న పాద యాత్ర సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి కుటుంబానికి నేడు ఆర్థిక చేయూత లభించిందన్నారు. గత ప్రభుత్వానికి, జగనన్న ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలేంటి..? పారదర్శక పాలన, సంక్షేమ పాలన తదితర అంశాలపై నాయకులు, గహసారథులు, వాలంటీర్స్, అంతా కలిసి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. కడియంలో ఎపికి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ వైసిపి కో-ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పాల్గొని మాట్లాడారు. ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందించినందుకు జగనే కావాలని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గిరజాల బాబు, తాడాల చక్రవర్తి, వై.స్టాలిన్, డాక్టర్ వెంకటాచలం, తదితరులు పాల్గొన్నారు.