ప్రజాశక్తి - భట్టిప్రోలు
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సంపూర్ణ పోషణ ఆహారాన్ని గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మెరుగు నాగార్జున కోరారు. ఇంటివద్దకే పౌష్టికాహారం పథకంను స్థానిక మార్కెట్ యార్డులో ఆయన ప్రారంభించరు. వేమూరు నియోజకవర్గ స్థాయిలో అమతలూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిడిపిఓ గన్నవరం విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి పౌష్టికాహారం తీసుకోలేక పోతున్నారని గమనించిన సిఎం జగన్మోహన్‌రెడ్డి ఇంటివద్దకే వెళ్లి అందించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఐసిడిఎస్‌ను బలోపేతం చేసేందుకు సిఎం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. అహర్నిశలు ప్రజా సంక్షేమం కోసం సిఎం శ్రమిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఏది అవసరమోనని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేసే సిఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రతి పక్షాలు చెప్పే అబద్దపు మాటలు నమ్మవద్దని అన్నారు. ప్రభుత్వం చేసే పనులను వారికి వివరించి మరోమారు గెలిపించేందుకు కషి చెయ్యలని కోరారు. అనంతరం పలువురు గర్భిణీలు, బాలింతలకు పది రకాల పోషకాలు కలిగిన కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దారా రవికిరణ్మయి, జెడ్పిటిసి ఉదరు భాస్కరి, వేమూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉప్పు శిరీషా, ఉప సర్పంచ్ బుర్లే రాంప్రసాద్, సీడీపీఓ అరుణకుమారి, ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపరవైజర్లు, నాయకులు చిన బుజ్జి, సలీమ్, చెన్నయ్య, చిన్నారి, కె శ్రీనివాసరావు, వి నాగేశ్వరరావు ఉన్నారు.
కొల్లూరు : తోకలవనిపాలెం పంచాయతీ పరిధిలోని తురకపాలెంకు చెందిన గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను తోకలవానిపాలెం సర్పంచ్ టి కష్ణమోహన్, అంగన్వాడి టీచర్, వార్డు నెంబర్లు, సచివాలయం సిబ్బంది చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచి టి కష్ణమోహన్ మాట్లాడుతూ ఆరోగ్య జాగ్రత్తలు ఈ వర్షాకాలంలో తీసుకోవాలని కోరారు. గర్భిణీలు, బాలింతలు బలహీనంగా ఉంటే అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. మంచి ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం పేదలకు ఖరీదుగా ఉందని అన్నారు. అందరూ ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చూపించుకోవాలని కోరారు. చిన్న పిల్లలను అంగన్వాడి సెంటర్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు నెంబరు కే శ్యామల, గ్రామ పోలీస్ పి దేవీ నాగమణి, అంగన్వాడి టీచర్ కె భాగ్యమ్మ, జి శారద, సచివాలయం ఏఎన్‌ఎం కె జియా పాల్గొన్నారు.
రేపల్లె : మహిళా అభివద్ధి, శిశు సంక్షేమ శాఖచే సీఎం జగన్ ప్రవేశ పెట్టిన టేక్ హౌమ్ రేషన్ అనే కార్యక్రమం ద్వారా గర్భిణీలు, బాలింతలకు అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే బలవర్ధకమైన పోషక బియ్యం, అను బంద పోషకాల కిట్‌లను రాజ్య సభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు చేతుల పంపిణీ చెశారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ అర్హతగల వారికి టేక్ హౌమ్ రేషన్ కిట్లును పంపిణీ చేస్తారని తెలిపారు. రక్త హీనత నివారణకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐసిడిఎస్ కేంద్రాల ద్వారా చిన్నారులకు మెరుగైన విద్యను, పోషకాహారాన్ని సక్రమంగా అమలు చేయాలని కోరారు. బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత చిన్నారుల్లో పౌష్టికాహార లోపం వంటి వాటిని నివారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ ఎం పార్ధసారథి, తహశీల్దారు డి మల్లికార్జునరావు, పల్లపట్ల ప్రాజెక్ట్ అధికారిని ఎం అనసూయ, రేపల్లె ప్రాజెక్ట్ అధికారిని డి మాణిక్యం, సూపర్ వ్జైర్స్, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.










