Mar 27,2023 22:56

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్శిటీ
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రతి పేదవానికి మెరుగైన కార్పొరేట్‌ వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని 104 వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో గడపవద్దకే వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. జిల్లాకు కేటాయించిన ఏడు నూతన 104 వాహనాలను కలెక్టరేట్‌ ఆవరణలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, నగర మేయర్‌ రాయనభాగ్యలక్ష్మి, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్‌ సోమవారం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఫ్యామిలీ ఫిజిషియన్‌ కార్యక్రమం ద్వారా గ్రామాలలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఆసుపత్రులలో చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయిన రోగులను పరీక్షించి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుని ఎప్పటికప్పడు తగు సూచనలు అందించేందుకు 104 వాహనం వైద్య బృందం కృషి చేస్తుందన్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్‌ ద్వారా తొమ్మిది రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరాన్ని బట్టి మందులను అందజేస్తున్నామన్నారు. కిశోర బాలికలలో రక్తహీనత ఉన్నవారిని గుర్తించి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్‌ అవుతు శైలజారెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్లు టి. శ్రీకాంత్‌, యం.శివరామకృష్ణ, కె.గీతాంజలిదేవి, డియంహెచ్‌వో డా. యం సుహానిసి, జిల్లా టిబి కంట్రోల్‌ అధికారి డా.జె.ఉషారాణి పాల్గొన్నారు.