ప్రజాశక్తి - మక్కువ : జగనన్న ఆరోగ్య సురక్ష ( జెఎఎస్) కార్యక్రమంలో భాగంగా ఇంటి వద్దనే ఏడు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బగాది జగన్నాధరావు అన్నారు. మండలంలోని వెంకటభైరిపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే, ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలను శుక్రవారం తనిఖీ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇంటింటికీ ఆరోగ్య సర్వేలో ప్రతి గ్రామ, వార్డు సచివాయంలో ఎఎన్‌ఎం, ఆశాలు ఒక బృందంగా, సిహెచ్‌ఒలు, ఆశా కార్యకర్తలు బృందంగా ఏర్పడి ప్రతి ఇంటినీ సర్వే నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఇంటి వద్ద 7 రకాల వైద్య పరీక్షలు - బిపి, మధుమేహం, రక్తహీనత, మూత్రం, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను తనిఖీ చేసి పేర్ల జాబితా తయారు చేయాలని సూచించారు. ఈ మేరకు గ్రామంలో నిర్వహించిన సర్వేలో ఆయా కుటుంబాలతో ముఖాముఖి మాట్లాడి చేసిన పరీక్షల వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న వైద్య శిబిరాలకు ఒపి చీటీలను అవసరమైన అందరికీ అందించాలని ఆదేశించారు.
ఫ్రై డే డ్రై డే పాటించాలి
ప్రతి శుక్రవారం ఇంట్టో ఉన్న నీటి పాత్రలను ఖాళీ చేసి శుభ్ర పరచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గ్రామస్తులకు పిలుపునిచ్చారు. గ్రామంలో పరిశుభ్రత పాటించాలని తద్వారా దోమలు వృద్ధి వ్యాప్తి చెందకుండా ఉంటాయని చెప్పారు. అనంతరం పిహెచ్‌సిలో మందులు, పరికరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం టౌన్ : ప్రజలకు అత్యుత్తమమైన వైద్యమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ జె.రామ అప్పలనాయుడు అన్నారు. పట్టణంలో పలు వార్డుల్లో హెల్త్ సెక్రటరీలు, ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రజలకు కావాల్సిన ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. అనంతరం కమిషనర్ జగన్నాధపురంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్‌లో స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వైద్యుల పర్యవేక్షణలో ప్రజలకు అన్ని విధాలా వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. హెల్త్ సెక్రటరీలు, వైద్య సిబ్బంది ప్రజలకు పారిశుధ్యం, రక్తదానం, అవయవ దానాలపై అవగాహన కల్పించాలని అన్నారు.
కురుపాం : మండలంలోని మొండెంఖల్ పిహెచ్‌సి పరిధిలో గల ఉదయపురంలో వైద్యాధికారి బి.ప్రజ్ఞ ఆధ్వర్యంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని 15 రోజుల ముందు నుండి ఆరోగ్య కార్యకర్త , సిహెచ్‌ఒ, వాలంటీర్ ముందస్తు గృహ సందర్శన చేస్తూ దీర్ఘకాలిక రోగులను గుర్తించి ప్రత్యేక వైద్య అధికారుల సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు నాగేశ్వరరావు, భారతి, ఆరోగ్య సహాయకులు జె. తిరుపతిరావు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపురం రూరల్ : మండలంలోని బాలగోడబలో నిర్వహించే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బందలుప్పి పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ పి శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు స్థానిక పంచాయతీ కార్యాలయంలో సిహెచ్‌ఒ, ఆశా, సచివాలయ వాలంటీర్లు, ఎఎన్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. అనంతరం స్థానిక ఎంపీపీ స్కూల్లో అక్టోబర్ 10న జరిగే వైద్య శిబిరంలో రోగులు పాల్గొనేటట్లు చేసి మందులు అందించాలని కోరారు. కార్యక్రమంలో సిహెచ్‌ఒ వి.జగదీష్, ఎఎన్‌ఎం రామలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మలేరియా నివారణ అధికారి శ్యాం కుమార్ కోరారు. మండలంలోని ఇరిడి గ్రామ సచివాలయం పరిధి కన్నయ్యగూడలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సర్వేలో భాగంగా ప్రతి కుటుంబాన్ని ఆరోగ్య సిబ్బందితో పాటు గ్రామ వాలంటీర్లు కలసి సందర్శన చేసి వ్యాధులతో బాధపడుతున్నట్లయినా గుర్తించి వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటారని అన్నారు. అలాగే అక్టోబర్ 5న ఇరిడి సచివాలయంలోఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సర్వేలో హెచ్‌వి యర్రాయమ్మ, ఆరోగ్య కార్యకర్తలు ఎస్వీ ప్రకాష్, ఏవి అర్చన, కె.దీపిక, ఎన్.కన్యాకుమారి, ఆశా కార్యకర్త చంద్రావతి, వాలంటీర్లు పాల్గొన్నారు.
జెఎఎస్ సర్వే శత శాతం పూర్తి చేయాలి
ప్రజాశక్తి - బెలగాం
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సర్వే శత శాతం పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహణపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శుక్ర వారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సర్వే శత శాతం జరగాలని, ఏడు పరీక్షలు నిర్వహించాలని అన్నారు. వైద్య నిపుణులు, శిబిరాలు మ్యాపింగ్ పక్కాగా చేయాలని ఆయన ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఎంహెచ్‌ఒ డాక్టర్ బగాది జగన్నాథ రావు, ఆర్‌బిఎస్‌కె ప్రాజెక్టు అధికారి డాక్టర్ ధవళ భాస్కరరావు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఐఎంఒతో సమావేశం
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులతో స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఒ జగన్నాధరావు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, దీన్ని విజవయంతం చేసేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఐఎంఎ జిల్లా అధ్యక్షులు యాళ్ల వివేక్, ఆర్‌బిఎస్‌కె ప్రాజెక్టు అధికారి డాక్టర్ ధవళ భాస్కరరావు, ప్రోగ్రాం అధికారి డా.నవీన్ కుమార్, వైద్యులు పాల్గొన్నారు.










