Oct 05,2023 22:53

ముసునూరులో వాసులకు కేటాయించని ఇళ్లస్థలాలు
గుడిసెల్లో నివాసం ఉంటున్న వైనం
సౌకర్యాలు లేవని ఆవేదన
పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి - ముసునూరు

             వైసిపి అధికారంలోకొచ్చి నాలుగున్నరేళ్లు అవుతున్నా.. మరో కొన్ని నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నా.. ఇప్పటివరకు ముసునూరులో ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో పేదలకు ఇళ్లస్థలాలు కేటాయిస్తే నేటికీ కూడా ఇంటిస్థలం లేక నిరుపేద కుటుంబాలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కూడా అదే పరిస్థితి ఉందని ప్రజలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో స్థలంతో పాటు గృహ నిర్మాణం కూడా చేపడతామని హామీ ఇచ్చిన నాయకులు మాట మార్చారని ముసునూరు మండలంలో ఇళ్ల స్థలాల విషయంలో పక్కాగా కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ఇళ్లస్థలాలు ఇప్పటిస్తానని ఇప్పటి ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు హామీ ఇచ్చారు. ఆ హామీ అప్పుడు, ఇప్పుడు కూడా అమలు కాలేదు.
వైసిపి అధికారం లోకొచ్చాక ఎంతో ప్రతిష్టా త్మకంగా ప్రతి పేద కుటంబానికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో గృహ నిర్మాణం కూడా చేపట్టారు. కాని ముసునూరు మండల కేంద్రమైన ముసునూరుతో పాటు మరికొన్ని గ్రామాల్లో జగనన్న ఇళ్ల స్థలాలు చూపకపోవడం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమా, అధికారుల అలసత్యమా అనేది చెప్పలేని పరిస్థితి ఉంది.
అప్పు చేసి డబ్బులు కట్టాం
నక్కా రామయమ్మ
మాది పేద కుటంబం. స్థలం ఇస్తామంటే అప్పుచేసి మరీ రూ.రెండు వేలు కట్టాము. నేటికీ స్థలం ఇవ్వలేదు.
సౌకర్యాలు లేవు
వేల్పూరి ఏసు
మేము సుమారు 15 ఏళ్ల నుంచి ఇక్కడే గుడిసెలు వేసుకుని ఉంటున్నాం. కరెంట్‌, తాగునీరు లేవు. నాయకులు, అధికారులు పట్టించుకోవడంలేదు. ఎంఎల్‌ఎ కూడా పట్టించుకోవడంలేదు.
ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నాం
పోట్రు చిట్టిమ్మ
మా ప్రాంతంలో కరెంట్‌, తాగునీరు సౌకర్యాలు లేవు. దోమలు, పాములతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. ఇంటి స్థలం లేదు. అద్దె ఇంట్లో ఉండే స్తోమత లేదు. రెక్కాడితే గాని డొక్కడని మా బతుకులు ఏ నాయకుడు మారుస్తాడో.
పట్టాలు ఇచ్చారు కాని స్థలాలు చూపలేదు
నక్కా వీరయ్య
సిపిఎం వారు అండగా ఉన్నారు. తహశీల్దార్‌, నూజివీడు సబ్‌ కలెక్టర్‌, మచిలీపట్నం జిల్లా కార్యాలయాల వద్ద నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ఫలితం లేదు. వైసిపి అధికారంలోచ్చింది. సిఎం జగన్‌ ఇంటి స్థలం ఇచ్చి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. పట్టాలు ఇచ్చారు కాని స్థలాలు ఇప్పటికీ చూపించలేదు.