
ఇతరుల ఇళ్లు ఊడ్చి, నేల కడిగి, వంటచేసి జీవనం సాగించే ఇంటి పనివారి బతుకంటే ఎలాగుంటుంది? ఇంటి యజమానుల దయ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్లు ఉండమంటే ఉండాలి. పొమ్మంటే పోవాలి. ఇచ్చే జీతానికి వెట్టి చేయించేవారు కొందరైతే.. తిట్లు పెట్టి పంపించేవారు ఇంకొందరు. జీతం పెంచమంటే రేపటి నుంచి రావాల్సిన పనిలేదంటూ మొహం మీదే చెప్పేవారు మరికొందరు. అలాంటిది కరోనా వారి కష్టాలని రెట్టింపు చేసింది. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న ఇంటి పనివారి జీవితాలు ఎలా ఉన్నాయో తెలిపేదే ఈ కథనం..
భారతదేశం ఎంతగానో అభివృద్ధి చెందింది. అందులో ఎత్తైన అపార్టుమెంట్లు, స్మార్ట్ సిటీలు ఉన్నాయి అంటూ పదేపదే మాట్లాడతాం. కానీ విస్తారమైన బస్తీలు, మురికివాడల గురించి ఎక్కడా ప్రస్తావించం. ముఖ్యంగా అందులో నివసించే మిలియన్ల ఇంటి పనివారి జీవితాల గురించి మనలో ఎందరికి వాస్తవాలు తెలుసు ?
వీరి కష్టాలు తీరేనా ?
ఏడాదిన్నరగా ఇంటి పనివారికి కష్టాలు మొదలయ్యాయి. కోవిడ్-19 కారణంగా పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ పాజిటివ్ కేసులు పెరిగాయి. కరోనా భయంతో చాలామంది ఒకరినొకరు కలవడమే మానేశారు. అలాగే ఎవరినీ తమ ఇళ్లకు ఆహ్వానించడం లేదు. ఈ నేపథ్యంలో ఇంటి పనివారిని యజమానులు పనికి రానివ్వడం లేదు. దీంతో వారిని తాత్కాలికంగా పని నుంచి తొలగించారు. అధికశాతం యజమానులే మానిపించగా, కొద్దిశాతం వారే భయపడి పనులను మానుకున్నారు. సాధారణంగా శ్రామిక వర్గాలకు చెందిన కుటుంబాలలోని మహిళలు ఇంటి పనివార్లుగా సేవలందిస్తారు. ఈ మధ్య కాలంలో కరోనా, కర్ఫ్యూ కష్టాలతో భర్తలకు పనులు లేకపోవడం, మరోవైపు ఇంటిపని దొరక్కపోవడంతో దేశవ్యాప్తంగా ఇంటి పనివారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరోనా పూర్తిగా తొలగేవరకూ వీరి కష్టాలు తీరేట్టు లేవు.
శ్రమకు గుర్తింపేది ?
ఇంటి పనివారు ముఖ్యంగా ఇంటిని శుభ్రపరచడం, పాత్రలు కడగడం, వంట, పిల్లల, వృద్ధుల సంరక్షణలాంటి పనులను చేస్తుంటారు. వీరిలో ఎక్కువగా మహిళలే ఉంటారు. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల నుంచి కుటుంబపోషణ కోసం పట్టణాలకు వలస వచ్చిన అట్టడుగు వర్గాలకు చెందినవారే అధికం. వారు రోజంతా కష్టపడినా పనికి తగిన గుర్తింపు లేదు. మన దేశంలో ఇంటి పనివారి సంఖ్య కచ్చితంగా అందుబాటులో లేదు. ప్రభుత్వ అంచనాలు (ఎన్‌ఎస్‌ఎస్ 2005) ప్రకారం సుమారు 4.75 మిలియన్లు, కానీ WIEGO (Women in Informal Employment: Globalizing and Organizing) 2014 ప్రకారం ఇంటి పనివారు సుమారు 50 మిలియన్లు ఉంటారని అంచనా.
ఇదెక్కడి న్యాయం ?
ఒక ఇంటిలో ఇంటి పనివారిగా చేరాలంటే ముందుగా స్థానిక పోలీసుస్టేషన్‌లో వారి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వారి పేరు, ఇంటి అడ్రస్, స్థానికంగా వారికున్న పరిచయాలు, వేలి ముద్రలు, గత చరిత్ర తెలపాల్సి ఉంటుంది. కానీ యజమానికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు మాత్రం ఇంటి పనివారికి తెలపరు. ఇదెక్కడి న్యాయం? అంతేకాదు యజమాని ఇంటిలో ఏదైనా వస్తువు పోతే ముందుగా అనుమానించబడే వ్యక్తులు ఇంటి పనివారే. వెంటనే వారిపై 'దొంగ' అనే ముద్ర పడిపోతుంది. ఒక్కోసారి యజమాని చేసే తప్పులను తమపై వేసుకుని, చట్టపరమైన శిక్షలూ అనుభవించిన ఘటనలూ ఉన్నాయి. దీనంతటికీ కారణం వారు అట్టడుగువారు కావడం.. కార్మికులుగా గుర్తింపు లేకపోవడం.
అతలాకుతలం చేసింది
'కోవిడ్- 19 మొదటి వేవ్‌కన్నా రెండో వేవ్ ఇంటి పనివారి జీవితాలను అతలాకుతలం చేసింది. దీనంతటికి ప్రభుత్వాలు, యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం ఒక కారణం. జూన్ 2020లో ఇంటి పనివారి హక్కుల సంఘం (DWRU), బ్రూహత్ బెంగళూరు ఇంటి పనివారి సంఘం ( BBGS ), మనేగెలాస కర్మీకారా యూనియన్ అధ్యయనం చేసి, ఫలితాలను విడుదల చేశాయి. అందులో నాలుగు లక్షల మంది ఇంటి పనివారు బెంగళూరులో పనిచేస్తున్నారని, వారిలో ఎక్కువ శాతం మంది మహిళలే అని చెప్పారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వాలు అనేక ఆంక్షలు పెట్టినా కొందరు యజమానులు వీరిని తప్పనిసరిగా పనిలోకి రావాల్సిందే అని పట్టుబట్టారు. ఆ సమయంలో యజమాని ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే అది వారి ద్వారా ఇంటి పనివారికి సంక్రమించి, ప్రాణాలు కోల్పోయిన వారూ ఉన్నారు. ఈ అధ్యయనం ప్రకారం సర్వేలో పాల్గొన్న 2,084 మంది (సుమారు 87%) కార్మికులకు 2020 మార్చిలో లాక్డౌన్ అయిన తర్వాత పనిలోకి రమ్మని యజమానులు చెప్పారు. కానీ వారెప్పుడు పిలుస్తారో తెలియదు. మనేగెలాస కర్మీకారా యూనియన్ సర్వే చేసిన ప్రాంతాలలో 150 మంది కార్మికులు లాక్డౌన్ సమయంలో పూర్తిగా ఉద్యోగాలు కోల్పోయారు. ఏప్రిల్ నెలలో సుమారు 91% మంది కార్మికులు తమ జీతాలను కోల్పోగా, 50 ఏళ్లు పైబడిన కార్మికులలో 50% మంది లాక్డౌన్ సమయంలో ఉద్యోగాలు కోల్పోయారు. కోవిడ్ ఇప్పటిలో తగ్గే అవకాశాలు లేవని పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. తమ సిబ్బందిని సుమారు రెండు, మూడేళ్లు ఇంటి నుంచే పనిచేయాలని చెప్పాయి. దీంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఎన్నో అపార్టుమెంట్లు ఖాళీ అయిపోయాయి. ఇంకా బ్యాచిలర్స్, విద్యార్థులు ఇంటిముఖం పట్టడంతో ఎంతోమంది ఇంటి పనివారు పనిని కోల్పోయారు' అంటూ బెంగళూరు ఇంటిపని వారి హక్కుల సంఘానికి చెందిన గీతా మీనన్ వివరించారు.
ప్రాణాలు కోల్పోయారు

చెన్నై నగరంలో 80 శాతం మంది ఇంటి పనివారు కోవిడ్ వల్ల ప్రభావితమయ్యారని, చాలామంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ ఇంటి పనివారి సంఘ నాయకురాలు (NDWM) జోసెఫిన్ వలర్మతి అన్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) కన్వెన్షన్ పదేళ్ల క్రితం ఇంటి పనివారి కార్మిక హక్కులను ధృవీకరించింది. అయితే మన దేశం ఇంకా ఈ సమావేశాన్ని ఆమోదించలేదని ఆమె చెప్పారు. 'ఈ సమావేశాన్ని ఆమోదించడానికి, ఇంటి పనివారి కోసం సమగ్రమైన చట్టాన్ని రూపొందించాలని ఎన్‌డిడబ్ల్యుఎం ప్రధానమంత్రికి లేఖ రాసింది. అయినప్పటికీ వారి హక్కులను పరిరక్షించడానికి, వివక్ష నుంచి వారిని రక్షించడానికి ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంటి పనివారికి ప్రభుత్వాలు సహాయం అందించాలి. గంటకు కనీస వేతనాన్ని రూ.80 నుంచి రూ.100కు సవరించాలి. వారి కుటుంబాల్లో చాలామంది అనారోగ్యంతో ఉన్నారు. ఈ సంక్షోభ సమయంలో కొందరు కుటుంబసభ్యులను కోల్పోయారు. అలాంటివారికి ప్రభుత్వాలు పరిహారం ఇస్తే బాగుంటుంది. అంతేకాదు ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్న కారణంగా వారి పిల్లలు సెల్‌ఫోన్‌లు అందుబాటులో లేక విద్యకు దూరమవుతున్నారు. వీరిలో ఎక్కువమంది ఒంటరి మహిళలు. కాబట్టి వారికి జీవనోపాధి కల్పించే ఏకైక పని ఇది. ప్రభుత్వాలు వీరందరినీ కార్మిక శాఖ సహాయంతో నమోదు చేసుకొని, పనిలేని రోజులను గుర్తించాలి. ఆ రోజులకుగాను రూ.7,500లను పరిహారం అందించాలి' అని డిమాండ్ చేస్తున్నారు వలర్మతి.
స్త్రీల సంపాదనే కీలకం
ఇటీవల ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో 400 మంది ఇంటిపని వారల మాటలను బట్టి వారి కుటుంబాల్లో స్త్రీల సంపాదన ఎంతో కీలకం. ఈ సంపాదనకు గండి పడితే కుటుంబ అవసరాలు తీరవని 86% మంది మహిళలు చెప్పారు. ఇక కుటుంబం సజావుగా గడవడానికి నెల జీతమే ప్రధానపాత్ర వహిస్తుందని 69% మహిళలు అన్నారు. వీరి విషయంలో లాక్‌డౌన్ వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఎందుకంటే వాళ్ల ఇళ్లు చాలా ఇరుకు ప్రాంతాల్లో ఉంటాయి. ముంబయిలాంటి నగరాల్లోని మురికివాడల్లో అందరూ కలిసి మరుగుదొడ్లను వాడుతుంటారు. ఎక్కువమంది నీటి వనరుల్ని కలిసి పంచుకుంటారు. అలాంటి చోట్ల భౌతికదూరం పాటించడం చాలా కష్టం. అలాగే వారు రేషన్, ఇతరత్రా పనుల కోసం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కనుక వారికి వైరస్ సోకే అవకాశం లేకపోలేదు. ఈ మహిళల్లో పోషకాహార లోపం ఎక్కువగా, రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాధి బారిన పడే అవకాశమూ ఎక్కువే.
వ్యభిచార కూపంలోకి ..
ఇంటి పనివారి శ్రమ దుర్వినియోగం అవుతోంది. వీరి నుంచి బలవంతంగా శ్రమను దోచుకుంటున్నారు. కొందరు యజమానులు వారిపై లైంగికదాడికి పాల్పడి, చిత్రహింసలు పెడుతున్నారు. అంతేకాదు ఏజెంట్‌లు వీరిని అక్రమ రవాణా ద్వారా విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. ముఖ్యంగా అరబ్ దేశాలకు. అక్కడకు వెళ్లిన తర్వాత వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్నారు.
అభద్రతలో ఇంకెన్నాళ్లు ?!

భద్రత లేని ఈ పరిస్థితుల్లో ఉన్న వీరు ఆర్థిక నష్టాన్ని భరించాలి. అలాగే వైరస్ సోకే ప్రమాదమూ ఉంది. వారి కుటుంబాల్లో పిల్లలు, వృద్ధులు ఉంటారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యతా ఉంటుంది. ఎన్నో ఏళ్లగా కార్మికులుగా గుర్తింపు, కనీస వేతనాలు, పని గంటలను నియంత్రించడం, సాధారణ సెలవులను తప్పనిసరి చేయడం కోసం పోరాడుతున్నారు. కొన్ని సాధించుకున్నా ఆచరణలో అమలుకావడం లేదు. కాబట్టి యజమాని యొక్క మంచితనం మీదే వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కొంతమంది యజమానులు కోవిడ్ తగ్గేవరకూ వారింటికి వెళ్లకూడదని, ప్రతిరోజూ ఇంటిని మరింత శుభ్రంగా ఉండేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇంటి పనివారి కోసం ఒక జాతీయ పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉంది. దశాబ్దాలుగా ఇలాంటి పనుల్లో ఉండి, ఎలాంటి వృద్ధికీ నోచుకోని వీరికి ఆ పాలసీ ఊతమివ్వాలి. అంతేకాదు వీరిని అసంఘటిత కార్మికుల్లా గుర్తించే రోజు అతి త్వరలో రావాలి. ప్రతి ఒక్కరూ వారిని పనిమనిషిగా కాకుండా మనిషిగా గుర్తించాలని కోరుకుందాం.
మనసున్న యజమానులు..

ఇంటి పనివారిని సొంత మనుషుల్లా ఆదరించే యజమానులూ లేకపోలేదు. అలాంటి వారిలో ప్రొఫెసర్ ప్రభోద్‌కుమార్ ఒకరు. 'బేబీ హల్దార్' అత్యంత జనాదరణ పొందిన రచయిత్రిగా భారతీయ సాహిత్య వినీలాకాశంలో మెరుస్తోంది అంటే ఆ ప్రొఫెసరే కారణం.
హల్దార్ ముగ్గురు పిల్లల తల్లి. ప్రొఫెసర్ ఇంట్లో ఇతర పనులు చేసేటప్పుడు చకచకా చేయగలదు. కానీ షెల్ప్‌లోని పుస్తకాలను ప్రత్యేకించి బెంగాలీ పుస్తకాల దుమ్ము దులుపుతున్నప్పుడు మాత్రం నెమ్మదిగా చేసేది. ఇది యజమాని గమనించారు.
ఒకరోజు ఆమెను నేరుగా 'నువ్వు చదువుతావా?' అని అడిగారు. షెల్ప్‌లో ఉన్న రచనలను చదువుకోవడానికి అనుమతిచ్చారు. కొంతకాలం తర్వాత ఓ కాపీ పుస్తకాన్ని, కలాన్ని అందించి, ''రాయి'' అంటూ ఆజ్ఞాపించారు. అది ఒకే ఒకమాట, కేవలం రెండక్షరాలు, ఒక్కసారిగా ఆమె ఏడ్చేసింది. నిరాశతో, నిస్పృహతో ఏం రాయాలి? రాయడానికేముంది? మూడు దశాబ్దాల అజ్ఞానం, చిమ్మ చీకటి రోజులు, కర్కశమైన జీవితానుభవాలు అనుకుంటూనే మొదలెట్టింది.
ఆమె రాసింది చదువుతూ, తప్పులు దిద్దుతూ, ఫోటో కాపీలు తీస్తూ ఎంతో ప్రోత్సాహం ఇచ్చారాయన. ఇలా నెలల తరబడి రాస్తూ పోయింది. తన గురించి తను రాసుకున్న 'ఎ లైఫ్ లెస్ ఆర్డినరీ' కథ 2004 నుంచి ప్రపంచమంతా తన కథగా గానం చేస్తోంది.

మహారాష్ట్ర పూణేలో మార్కెటింగ్ జాబ్ చేసే ధనశ్రీ షిండే తన ఇంట్లో పనిచేసే గీతను సొంత అక్కలా భావించేది. ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలిసి చేతినిండా పని కల్పించాలి అనుకుంది. అందుకోసం తనకున్న మార్కెటింగ్ తెలివితేటలను ఉపయోగించి, విజిటింగ్ కార్డును తయారుచేసింది. అందులో బట్టలు ఉతికితే ఎంత? అంట్లు తోమితే ఎంత? ఇలా ప్రతి పనికీ రేటుని నిర్ధారించి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇంకేముంది మా ఇంట్లో పని చేద్దువురా..! మా ఇంటికి రా! అంటూ ఫోన్‌కాల్స్. తన యజమానురాలి ఐడియా గీత జీవితాన్ని మార్చేసింది.

- డొమెస్టిక్ వర్కర్స్ (కండిషన్స్ ఆఫ్ ఎంప్లారుమెంట్) బిల్లు 1959 నుంచి ఉంది. ఈ రంగాన్ని చట్టబద్ధం చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ విజయం పొందలేదు.
- 2009లో పార్లమెంట్ సభ్యులు అర్జున్‌రామ్ మెఘ్వాల్ ఇంటి పనివారి (సేవా నిబంధనలు) కోసం ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టినప్పటికీ ఆమోదం పొందలేదు.
- వీరి కోసం ఒక బోర్డు ఏర్పడాలి. అందులో హెల్ప్‌లైన్, ఫిర్యాదుల కమిటీ ఉండాలి. వీరిపై జరిగే లైంగిక వేధింపుల ఫిర్యాదులను స్వీకరించడానికి అన్ని ప్రాంతాల్లోనూ ఏజెన్సీలను ఏర్పాటుచేయాలి.
- జాతీయ వేదిక జంతర్ మంతర్‌లో 31, జులై 2013న బహిరంగ సభ జరిగింది. అందులో దేశం నలుమూలల నుండి మూడువేల మంది ఇంటి పనివారు హాజరయ్యారు. సమగ్ర చట్టం తీసుకురావాలని కోరుతూ స్థానిక ప్రాంతాల నుంచి వేలాది సంతకాలను సేకరించి, తీసుకువచ్చారు. కానీ ప్రభుత్వం ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు.
అన్నీ కాకిలెక్కలే..
దేశంలో ఇంటి పనివారి సంఖ్యపై ప్రామాణికమైన డేటా అందుబాటులో లేదని 2010లో కార్మిక, ఉపాధి శాఖా మంత్రి హరీష్ రావత్ అంగీకరించారు. నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ, 61వ రౌండ్ 2004-05) ప్రకారం, మనదేశంలో ఇంటి పనివారి సంఖ్య సుమారు 4.2 మిలియన్లు. దీనికి ముందు 2001 జనాభా లెక్కల ప్రకారం ఇది 6.7 మిలియన్లు. జనవరి 2019 నుండి తరువాత వెలువడిన ప్రభుత్వ పత్రికా ప్రకటన (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 68వ రౌండ్ 2011-12 ఆధారంగా) మొత్తం ఇంటి పనివారి సంఖ్య 3.9 మిలియన్లు. నిజానికి ప్రభుత్వం చూపే ఈ లెక్కలు వాస్తవాలు కాదు. వీటిని కొన్ని సర్వేల ఆధారంగా నిర్ధారిస్తూ ఉంటారు. అవన్నీ కాకి లెక్కలు మాత్రమే. వాస్తవానికి వీరి సంఖ్యను ప్రభుత్వాలు దాచిపెడుతూనే ఉన్నాయి. రావత్ తన అంచనా ప్రకారం దేశంలో మొత్తం ఇంటి పనివారి సంఖ్య 15 మిలియన్లు ఉండొచ్చని చెప్పారు. కానీ మీడియా నివేదికలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
అవమానించినా పనికి వెళ్లక తప్పదు

'కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ఇంటి పనివారి జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి. చాలామంది పని కోల్పోయాం. దీంతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయాం. ఒకవైపు కరోనా భయం, మరోవైపు ఆకలి బాధలు మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి' అంటోంది కేరళకు చెందిన నిర్మల. 'కొన్నేళ్లుగా ఢిల్లీలో నాలుగిళ్లల్లో పనిచేస్తున్నాను. లాక్‌డౌన్ సమయంలో ఒకేసారి అందరూ పని నుంచి తొలగించారు. వాస్తవానికి మా సంపాదన ఏ రోజు ఖర్చులకు ఆ రోజు సరిపోతుంది. కనీసం మూడుపూటలా నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లడం కష్టమైంది. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత అతికష్టం మీద మరలా పని సంపాదించగలిగా. కానీ గతంలో పనికి వెళితే యజమానులు ఆప్యాయంగా మాట్లాడేవారు. ప్రస్తుతం వారి దృష్టిలో నేను వైరస్‌ను ఎత్తుకెళ్లే మనిషిని. గేటు బయటే శానిటైజర్ చేసుకొని, ఇంట్లోకి రమ్మంటున్నారు. మేమేదో అంటరానివారిమి అయినట్లు చూస్తున్నారు. వారిలో చాలా మార్పు వచ్చింది. పదేపదే శానిటైజ్ చేసుకుని, చేతులు పుండ్లు పడుతున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పని దొరకడమే పెద్ద విషయం. కాబట్టి వారెంత అవమానించినా వెళ్లక తప్పదు' అంటోంది ప్రతిమ. ఇలాంటి కష్టసమయంలో కేరళలో అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు సభ్యులకు 1000 INR వన్-ఆఫ్ చెల్లింపును అందించింది. ఇలాగే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే బాగుండు.
మైసూరు సమీప గ్రామానికి చెందిన మేరీ మూడు దశాబ్దాల నుంచి ఇంటి పని కార్మికురాలిగా ఉంది. 'మాకు ఇప్పుడు నెలసరి జీతాలు లేవు. అపార్ట్‌మెంట్ వారు మమ్మల్ని అనుమతించడం లేదు. మా యజమానులలో కొందరు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అందుకే వారు భయపడుతున్నారు. నా స్నేహితురాలు పార్వతి ఒక ఇంట్లో వంట చేస్తుంది. ఆమె యజమానికి కరోనా ఉందని వారం రోజులు పనికి వెళ్లలేదు. దాంతో ఆ యజమాని ''నీవు తప్పకుండా రావాల్సిందే లేకపోతే నీ పని పోతుంది!'' అని చెప్పాడు. ఒకవైపు ప్రమాదం పొంచి ఉన్నదని తెలిసినా.. తన కుటుంబాన్ని పస్తులు ఉంచడం ఇష్టంలేక పనికి వెళ్లింది. అంతే రోజుల్లోనే ఆమెకు కోవిడ్ సోకి, మరణించింది' అంటోంది మేరి.
చట్టం ఏమి చెబుతుంది ?
జాతీయ మహిళా కమిషన్ ఇంటి పనివారి (రిజిస్ట్రేషన్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) చట్టాన్ని 2008లో రూపొందించింది.
- ఈ చట్టం జమ్మూ- కాశ్మీర్ మినహా దేశమంతా వర్తిస్తుంది.
- ఇతర దేశాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన వారికి ఈ చట్టం వర్తించదు.
- ఈ చట్టం అమలుచేసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర సలహా కమిటీలతోపాటు జిల్లాబోర్డుకు ఉంటుంది.
- ఈ చట్టం ప్రకారం రిజిష్టర్ చేయబడిన ఇంటి పనివారు ఒకరోజు పనిని ముగించిన తర్వాత కనీసం 10 గంటలు రోజువారీ విశ్రాంతికి అర్హులు. అదే ఇంట్లో నివసించే కార్మికులైతే సెలవులతో పాటు కనీసం 15 రోజుల పాటు వేతనం లభిస్తుంది (సెక్షన్ 22).
- ఇంటి పనివారిని లైంగిక వేధింపులకు గురిచేస్తే 6-7 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా పడే అవకాశం ఉంది.
- ఈ చట్ట ప్రకారం పెన్షన్, ప్రసూతి సెలవులను పొందవచ్చు.
- వీరి రోజువారీ వేతనాలు ఆంధ్రప్రదేశ్- రూ.107 (2007), బీహార్- రూ.132 (2011), కర్ణాటక-149.89 (2011), రాజస్థాన్-రూ.504 (నెలకు) (2011), జార్ఖండ్- 145.54 (2012) నిర్ణయించారు.
- స్వర్ణలత నూకరాజు