ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఇంట్లో తయారు చేసే ఉత్పత్తులను సైతం విదేశాల్లో విక్రయించేలా తపాలా శాఖ విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని పల్నాడు జిల్లా డివిజన్ తపాలా శాఖ సూపరింటెండెంట్ స్వామి చెప్పారు. చిరు వ్యాపారులతో పాటు పారిశ్రామికవేత్తలు, తయారు చేసే ఉత్పత్తులు విదేశాలకు సులువుగా పంపే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పల్నాడు జిల్లా ప్రధాన తపాలా కేంద్రంలో డాక్‌ఘర్ నిర్యాత్ కేంద్రాన్ని (డిఎన్‌కె) ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, థాయిలాండ్, యూరప్, దుబారు, ఫ్రాన్స్, చైనా తదితర దేశాల్లో తెలుగువారు స్థిరపడ్డారని వారికి ఇక్కడివారు ఇంట్లో తయారు చేసే వస్తువులు, పిండి వంటలు, ఇతర సామగ్రిని పంపించుకునే వీలు కల్పిస్తున్నామని చెప్పారు. గతంలో పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్ (పిబిఇ)ని మ్యాన్యువల్‌గా నియమించిన ఫారిన్ ఫోస్ట్ ఆఫీస్ కౌంటర్లు, అంతర్జాతీయ వ్యాపార కేంద్రాల్లోనే ఫైల్ చేసే వెసులుబాటు ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం పిబిఇని ఆన్‌లైన్ ద్వారా ఇంటివద్దే ఫైల్ చేసి సమీపంలోని డిఎన్‌కె కేంద్రాల ద్వారా ఎగువతి చేసుకోవచ్చని వివరించారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని పోస్టాఫీసులతోపాటు ప్రధాన పోస్టాఫీసుల్లోనూ డిఎన్‌కెలను ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు.










