ప్రజాశక్తి - ఏలూరు టౌన్
పెరుగుతున్న గృహ నిర్మాణ సామగ్రి ధరలకు అనుగుణంగా జగనన్న గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించి లబ్ధిదారులను ఆదుకోవాలని, శిథిలావస్థకు చేరుకున్న టిడ్కో గృహాలు లబ్ధిదారులకు తక్షణం అందించాలని పలువురు డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయం స్ఫూర్తి భవనంలో సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షతన బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్పొరేషన్, మున్సిపాలిటీ, పట్టణ, మండల ప్రాంతాల్లో ప్రచార జాతయాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉగాది నాటికి జగనన్న కాలనీ ఇల్లు గృహప్రవేశాలు కల్పించి లబ్ధిదారులకు అందిస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య, ఎఐటియుసి నాయకులు పుప్పాల కన్నబాబు, మహిళా సమాఖ్య జిల్లా కోశాధికారి మావూరి విజయ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పొటేలు పెంటయ్య, సిపిఐ కార్యకర్తలు బళ్ల కనకదుర్గారావు, రెడ్డి శ్రీనివాస్ డాంగే, గేదెల నాగేశ్వరరావు, యర్రా వెంకటేశ్వర్లు, కనకం జగన్, బుగ్గల ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నుండి దండు బోయిన చంద్రశేఖర్ పాల్గొన్నారు.










