Sep 19,2023 21:10

పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- శృంగవరపుకోట : రూ. 65 లక్షల నిధులతో దారపర్తి పంచాయతీ పరిధిలోగల గిరి శిఖర గ్రామాలకు ఇంటింటికి మంచినీటి కొళాయిలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని దారపర్తి సచివాలయం పరిధిలోగల పల్లపు దుంగాడ గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కడుబడి శ్రీనివాసరావు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌కోట పట్టణానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో గిరి శిఖరాన ఉన్న పల్లపు దుంగాడ గ్రామానికి సుమారు 30 ఏళ్ల నుండి రహదారి సౌకర్యం లేక నిత్యం గిరిజనులు ఇబ్బందులు పడేవారని తన దృష్టికి తీసుకురావడంతో రెండేళ్లు పాటు జిల్లా నాయకులతోనూ, అటవీ అధికారులతో పోరాడి దబ్బగుంట నుంచి పల్లపు దుంగాడ వరకు రహదారి సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఆయన మధ్యాహ్నం భోజనాన్ని చేశారు. అనంతరం దారపర్తి సర్పంచ్‌ సన్యాసిరావు, ఉప సర్పంచ్‌ రాజేశ్వరి, మాజీ సర్పంచ్‌ ఎర్రయ్య ఆధ్వర్యంలో గిరిజనులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పంచాయతీలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం వల్ల రూ. 20 లక్షలు మంజూరయ్యాయన్నారు. మరో రూ 45 లక్షలు మంజూరు చేస్తామని వాటితో దారపర్తి పంచాయతీ పరిధిలోగల 12 గ్రామాలకు ఇంటింటికి మంచినీటి కొళాయి సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. పోర్లు, గూనపాడు, కురిడి దారపర్తి గ్రామాలకు రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు వేయాలని పంచాయతీరాజ్‌ అధికారులను ఆయన ఆదేశించారు. పల్లపు దుంగాడలో మినీ అంగన్వాడి సెంటర్‌ కావాలని గిరిజనులు కోరడంతో అందుకు ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు ఎమ్మెల్యేను దుస్సాలువతో సత్కరించి అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ శ్రీనివాసరావు, ఎంపిడిఒ శేషుబాబు, ఆర్‌డబ్ల్యుఎస్‌ జెఇఇ సత్యకిషోర్‌, వైస్‌ ఎంపిపి పినిశెట్టి వెంకటరమణ, స్టేట్‌ డైరెక్టర్‌ వాకాడ రాంబాబు, వైసిపి మండల అధ్యక్షులు మోపాడ కుమార్‌, పోతనపల్లి సర్పంచ్‌ వెంకట్రావు, వీరనారాయణం సర్పంచ్‌ ముమ్ములూరి సోంబాబు, ఎస్‌.కోట తలారి సర్పంచ్‌ అనంత, ఆవాల కృష్ణ్ణ, మోపాడ కోటి, గనివాడ శ్రీను, చేత వీరన్న, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.