
- అవనిలో సగం.. అవకాశాల్లో సగం.. అన్నట్లు మహిళలు అన్ని రంగాల్లో పనిచేస్తున్నారన్నది ఎంత నిజమో.. ఏ రంగంలో పనిచేసినా ఇప్పటికీ ఇంటి చాకిరీని ఆమె మాత్రమే చేస్తోందన్నది అంతే సత్యం. ఇంటిపనిలో ఆమె వేతనం లేని పనిమనిషే. భార్య ఉద్యోగి అయినా ఇంటిపనిలో భాగస్వామ్యం పంచుకునే భర్తలు అత్యల్పం. ఆధిపత్య భావజాల ప్రపంచంలో ఇంటిచాకిరీ ఆమెదే.. పిల్లల బాధ్యత అయినా.. కరోనా కాలంలో అయినా.. అధికభారం భరిస్తోంది ఆమే. ఇది 'స్నేహ' జరిపిన సర్వేలో వెల్లడైన విచాకరమైన వాస్తవం. ''అంతర్జాతీయ మహిళా దినోత్సవం'' సందర్భంగా సర్వేలో పాల్గొన్న మహిళల మనోభావాలను వెల్లడించేదే ఈ ప్రత్యేక కథనం..
ఇంటెడు చాకిరీని తానొక్కతే చేస్తూ ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకూ నడిచే యంత్రం ఆమె. అంతలా కష్టపడుతుండటం కుటుంబ అభివృద్ధికే అనుకుంటే పొరపాటు. ఆమె శ్రమ సమాజాభివృద్ధికీ తోడ్పడుతుంది. అందుకే ఆమె శ్రమకు విలువ కట్టాలనేదీ చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని న్యాయమూర్తులు ప్రస్తావించినా.. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రణాళికల్లో ఇంటిపనికి వేతనం చెల్లిస్తామని పేర్కొన్నా.. వాస్తవమైన విషయమే అన్నది సర్వేలో వెల్లడైంది. ఇంటిదగ్గర ఉండే మహిళలు మాత్రమే కాదు.. ఉత్పత్తిలో నేరుగా భాగస్వామ్యం అవుతున్న మహిళలు సైతం అత్యధికులు ఇంటిచాకిరీ చేస్తున్నారు. వీళ్లు మరింత శ్రమ దోపిడీకి గురవుతున్నారు. 'స్నేహా' సర్వేలో ఇదే విషయం వెల్లడైంది.
- సర్వేలో ఎవరెవరు.. ఎలా..
సర్వేలో మొత్తం 754 మంది పాల్గొన్నారు. వీరిలో అత్యధికంగా 59.5 శాతం మంది ఉద్యోగినులు ఉన్నారు. 9.2 % మంది హౌస్ మేకర్స్ (గృహిణులు) పాల్గొన్నారు. 17.2 శాతం మంది అసంఘటితరంగాల్లో పనిచేస్తున్నారు. వ్యవసాయ కూలీలు ఎనిమిది శాతం మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. అత్యధికంగా పశ్చిమగోదావరి, చిత్తూరు, కడప, కృష్ణా, నెల్లూరు జిల్లాల వారు పాల్గొన్నారు. ఆ తర్వాత తూర్పు గోదావరి, విశాఖపట్టణం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల వారు ఉన్నారు. అత్యల్పంగా శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం జిల్లాల నుండి పాల్గొన్నారు. వయస్సు రీత్యా చూసినప్పుడు 36-50 ఏళ్ల వాళ్లు 45 శాతం మంది పాల్గొన్నారు. 42.4 శాతం మంది 18-35 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారు ఉన్నారు. పై రెండు కేటగిరీల వయస్సు వారే సర్వేలో అత్యధికంగా పాల్గొన్నారు. 51-65 మధ్య వయస్సు వారు 12.6 శాతం మంది పాల్గొన్నారు.
వీరిలో ఆర్థిక తరగతిని పరిశీలిస్తే మధ్యతరగతి మహిళలు 62.1 శాతం మంది పాల్గొన్నారు. ఆ తర్వాత 29.4 శాతం మధ్య పేదలు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరి సామాజిక తరగతులను పరిశీలిస్తే అత్యధికంగా 28 శాతం బిసి (జనరల్) వాళ్లు పాల్గొన్నారు. ఆ తర్వాత 27.6 శాతం దళితులు, 21.9 శాతం ఓ.సి. తరగతికి చెందిన వారు పాల్గొన్నారు. ఇంటిచాకిరీలోనే 99 శాతం మహిళలు ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. అయితే దీనిలో 23.9 శాతం మంది మాత్రమే చాకిరీగా భావించడం గమనించాల్సిన విషయం. అత్యధికులు ఇంటిపనే లోకంగా భావిస్తున్నారు. దీనిలో మార్పు రావాల్సి ఉంది. బట్టలు ఉతికే పనిని నేటికీ 64.2 శాతం మంది మహిళలే చేస్తున్నారు. 27.1 శాతం మంది మహిళలు మాత్రం వాషింగ్‌మిషన్ ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
- పిల్లల పెంపకంలో..
ప్రతి ఇంట్లో పిల్లల పెంపకం అనగానే అదేదో ఆడవాళ్ల పనే అన్నట్లు.. వారికే ఆ బాధ్యత బాగా తెలిసినట్లు వ్యవహరిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నా.. చిన్నపిల్లల్ని కేరింగ్ చేయడం దగ్గర నుండి స్కూలుకు వెళ్లే పిల్లల్ని రెడీ చేయడం వరకూ మహిళలే చేస్తున్నారు. పిల్లలతో హోమ్‌వర్క్ చేయించాలన్నా, పరీక్షలకు సిద్ధం చేయించాలన్నా ఆమెదే బాధ్యత. పిల్లల్ని నిద్ర పుచ్చడం దగ్గర నుంచి.. పేచీలు పెట్టినా ఆ బాధ్యత అత్యధికంగా మహిళలే తీసుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది. 50.1 శాతం మంది మహిళలే ఈ పనులన్నీ నిర్వహిస్తున్నారు. అయితే కొంతమార్పు కూడా ఉంది. 28.4 శాతం మంది పురుషులూ నిర్వహిస్తుంటే, ఇతర కుటుంబసభ్యులు 21.5% బాధ్యత తీసుకుంటున్నారని సర్వేలో పేర్కొన్నారు. ఇక పిల్లలకు ఆరోగ్యాలు బాగోకపోతే అవసరమైతే ముందుగా సెలవు పెట్టడానికి మహిళలే సిద్ధపడుతున్నారు. ఈ సర్వేలో అదే వెల్లడైంది. అత్యధికంగా 86.7 శాతం మంది మహిళలే పిల్లల కోసం సెలవు పెడుతున్నారు. అయితే 13.3 శాతం మంది పురుషులూ పిల్లల కోసం సెలవు పెడుతున్నారు.
- కరోనా కాలంలో..
కరోనా వైరస్ ప్రపంచాన్నే ఓ కుదుపు కుదిపేసింది.. ఇంకా అది అనేక రూపాలు మార్చుకుంటూ మనల్ని ఇబ్బందిపెడుతూనే ఉంది. ఈ సవాల్‌ను ఫ్రంట్ వారియర్స్‌గా వైద్య, పోలీస్, పారిశుధ్య రంగాలనే గుర్తిస్తున్నారు. కానీ అందరికన్నా ఎక్కువగా ఈ వైరస్‌ను అన్నిరకాలుగా ఎదుర్కొన్నది మహిళలే. ఆ వైరస్ బారిన పడకుండా కుటుంబాన్ని కాపాడటంలో ఆమె పాత్ర అత్యున్నతమైనది. అందరికీ పోషకాహారం అందించడమే కాదు.. మాస్క్‌ల దగ్గర నుండి అందరి పరిశుభ్రత కోసం ఆమె అహరహం కృషి చేసింది. ఈ నేపథ్యంలో ఆమెపై పనిభారమూ అధికమైంది. ఈ కరోనా వచ్చాక అత్యధికంగా వర్క్ ఫ్రం హోమ్ నిర్వహించారు. ఈ పరిస్థితి మహిళలకు మరింత భారం పెంచిందనేది సర్వేలో వెల్లడైంది. వర్క్‌ఫ్రమ్ హోమ్‌తో 76.8 శాతం మంది మహిళలు పనిభారం పెరిగిందని చెప్పారు. అదే సందర్భంలో 23.2 శాతం మంది మహిళలు భర్త, పిల్లల సహకారంతో పనిభారం తగ్గిందని పేర్కొన్నారు. ఏదేమైనా మహిళలపై ఈ కాలంలో పనిభారం అధికమైందనేది సర్వేలో వెల్లడైంది.
ఈ మొత్తం సర్వేలో తేటతెల్లమైందేమంటే.. ఉద్యోగాలు చేస్తున్నా మహిళలకు ఇంటిచాకిరీ మాత్రం తప్పడం లేదు. ఇంటిచాకిరీ నుంచి విముక్తికీ లింగ సమానతతో ముడిపడి ఉందనేది వాస్తవం. ఇంటిపని అనేది స్త్రీలకు మాత్రమే సంబంధించిన పని అనే భావన మనందరిలో బాగా నాటుకుపోయింది. ఇది ప్రస్తుత వ్యవస్థ ఆధిపత్య భావజాలం ప్రభావమే. ఇంటిచాకిరీ నుంచి విముక్తి కావాలంటే ఈ భావజాలంలో మార్పు రావాలి. అందుకు సమాజ విముక్తి కూడా జరగాలి. సమాజ విముక్తితోనే స్త్రీకి విముక్తి సాధ్యపడేది. అందుకే మహిళలంతా సమాజమార్పుకు తమవంతుగా కృషి చేయాల్సిన ఆవశ్యకత మరింత పెరిగిందనేది ఈ సర్వేతో మరింత స్పష్టమవుతోంది.
- ఈ ఏడాది నినాదం.. ''లింగ సమానత్వం'' అంటే కేవలం స్త్రీ-పురుష వివక్ష పోవాలనే ఒక్కమాట అనేస్తే సరిపోదు.. ఇంటిచాకిరీలో ఆడవాళ్ల పనులు, మగవాళ్ల పనులు అన్న తేడా చూపించకుండా ఉండాలి.. అందరం కలిసి అన్నిపనులూ చేసుకోవాలి.. అందరం ఈ సవాల్‌ను స్వీకరిద్దాం.. మార్పుకు శ్రీకారం చుడదాం.. ఆ విధంగా లింగ సమానతను చాటుదాం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. వారం ముందు నుండే వివిధ వాణిజ్య ప్రకటనలు ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి.. మీ వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు మెసేజ్‌లూ కుప్పలు తెప్పలుగా వచ్చేస్తాయి. ఇది నిజంగా వేడుకలు చేసుకునే రోజా? నిరసనలు తెలిపే రోజా? అంటే..
దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా మార్చి 8వ తేదీని మహిళలకు ప్రత్యేక రోజుగా గుర్తిస్తున్నారు. అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్యసమితి గుర్తించి, ప్రతి ఏటా నిర్వహిస్తోంది.
దీనికి బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని, అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909లో 'జాతీయ మహిళా దినోత్సవా'న్ని ప్రకటించింది.
ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారాజెట్కిన్ అనే ఒక మహిళా నేతది. కోపెన్‌హెగెన్ నగరంలో 1910లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్' సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారాజెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు.
'అంతర్జాతీయ మహిళా దినోత్సవా'న్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలూ జరిగాయి. ఈ ఏడాది జరిగేది 109వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
అయితే, 1975లోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది. అంతేకాదు, ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తం(థీమ్)తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 'గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం' అని మొదటి థీమ్‌ను నిర్ణయించింది. ఈ ఏడాది 'సుస్థిరమైన రేపటి కోసం .. లింగ సమానత్వం' అన్నది ఈ ఏడాది నినాదం. సామాజికంగానూ, రాజకీయంగానూ, ఆర్థికంగానూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' మారిపోయింది. వాస్తవంగా.. కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించటం ఈ దినోత్సవం వెనుక ఉన్న రాజకీయ మూలం. దీనికి ఒక నిర్దిష్టమైన తేదీ ఉండాలని క్లారాజెట్కిన్ భావించలేదు.
- మార్చి 8నే ఎందుకు?
రష్యా మహిళలు 1917 యుద్ధ సమయంలో ''ఆహారం - శాంతి'' డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం (అప్పట్లో రష్యాలో ఈ క్యాలెండర్‌నే అనుసరించేవాళ్లు) ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో ఇప్పుడు అమలులో ఉన్నది గ్రెగోరియన్ క్యాలెండర్) అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు.
- ఈ ఏడాది థీమ్..
ఈ ఏడాది (2022) అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా "Gender Equality Today for a Sustainable Tomorrow" అనే నినాదాన్ని ఇతివృత్తంగా నిర్ణయించారు. ''సుస్థిరమైన రేపటి కోసం లింగ సమానత్వం'' అన్నది దాని అర్థం.
- అన్నిరంగాల్లో అడుగుపెట్టాలి.. : గుమ్ములూరి విశాలాక్షి, విజయనగరం
'మానసిక స్థైర్యం, పట్టుదలతోనే మహిళల్లో ఆర్థిక స్వావలంబన సాధ్యమౌతుంది. నేటి సమాజంలో పురుషులు చేసే ప్రతి పనినీ మహిళలూ చేయగలుగుతున్నారు. వంటపని, ఇంటిపనులకు సహకరిస్తున్న పురుషులు ఉన్నట్టే, కుటుంబానికి ఆర్థికంగా చేయూతనందిస్తూ మహిళలు వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి పనులు చేస్తున్నారు. సమాజంలో ఇంకా ఆర్థిక స్వాలంబన సాధించని మహిళలు అధికంగానే ఉన్నారు. మహిళలు ఇంటిపనులు మాత్రమే చేయాలనుకోవడం సరికాదు. స్త్రీలు అన్నిó రంగాల్లోనూ అడుగు పెట్టినప్పుడే సమాజంలో జరుగుతున్న మంచి, చెడులు, బరువు, బాధ్యతలు తెలుస్తాయి. మహిళలు ముందుకు సాగాలంటే భయాన్ని వీడి, బాధ్యతలు మోయడాన్ని సవాల్‌గా తీసుకోవాలి' అంటున్నారు ''నా ఊరు - విజయనగరం'' స్వచ్ఛంద సేవాసంస్థ ఫౌండర్ గుమ్ములూరి విశాలాక్షి.
- గుర్తింపుకార్డు కావాలి.. : చెక్కపల్లి వరలక్ష్మి, ప.గో. జిల్లా.
నేను 45 ఏళ్ల నుంచి లేసు అల్లికల వృత్తిలో జీవనోపాధి పొందుతున్నా. గతంలో ఇంటి వద్ద లేసులు అల్లేదాన్ని. అప్పట్లో మార్కెట్ డిమాండ్ వల్ల డబ్బులు అధికంగా వచ్చేవి. లేనప్పుడు కష్టానికి తగ్గ ఫలితం మాత్రం వచ్చేది. అయితే ఇప్పుడు డిమాండ్ పెరిగినా కంపెనీలూ పెరిగాయి. దీంతో ఇంటివద్ద ఉండి అల్లికలు సాగించే విధానం పోయి, దగ్గరలోనే చిన్న లేసు కంపెనీలో పని చేయాల్సి వచ్చింది.. చేస్తున్నా. ఇక్కడ నాతోపాటు పదిమంది పనిచేస్తున్నారు. ఉదయం 10 గంటలకు పనికెళ్లి, సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి వస్తాను. రోజు కూలీగా రూ.150 ఇస్తారు. గతంలో లేసు అల్లికలకు సన్నదారం ఉపయోగించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. ప్రస్తుతం బొంత దారం ఉపయోగిస్తున్నారు. ఇది కొందరికి పడకపోవడం వల్ల తలనొప్పి, కళ్లు లాగడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పటివరకూ మాకు ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు, సహకారం లేదు. మాకు గుర్తింపు కార్డులు, హెల్త్‌కార్డులు వంటి సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి. 60 ఏళ్లు దాటిన లేసు అల్లికల మహిళలకు ప్రత్యేక పెన్షన్ ఇవ్వాలి.
- గిరిజన గూడెం నుంచి రాష్ట్రపతి భవన్‌కు..
వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో, వంశాంకురం లేకుండా చేశావంటూ భర్త ఆమెను వదిలి వెళ్లిపోయారు. తండ్రి అండతో కూలీ చేయడం మొదలుపెట్టిన ఆమె, తర్వాత గిరిజన ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగారు. చిరుధాన్యాల సాగుకు గిరిజనులను ఒప్పించడం మొదలుకొని, వాటితో తయారుచేసే ఆహార పదార్థాలకు మార్కెటింగ్ కల్పించడం వరకూ ఎన్నో సాధించారు. గిరిజన గూడెం నుంచి ముగ్గురు ఆడపిల్లలతో మొదలైన ఆమె ప్రయాణం రాష్ట్రపతి భవన్ వరకూ సాగింది. ఆ ప్రాంతంలో మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేందుకు చేసిన కృషికిగానూ రాష్ట్రపతి చేతుల మీదుగా 'నారీ శక్తి' పురస్కారం అందుకున్నారు. ఆమే శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడాల భూదేవి. గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న తండ్రి సింగుపురం చిన్నయ్య ఆమెకు అండగా నిలిచారు. గిరిజనులకు ఆర్థిక స్వేచ్ఛ, భూ హక్కులు, పౌష్టికాహారం, వైద్య సదుపాయాల కోసం పోరాడాలన్న ఉద్దేశంతో ఆమె తండ్రి 1996లో 'ఆదివాసీ వికాస్ సంఘ' ప్రారంభించారు. తండ్రి మరణానంతరం ఆ బాధ్యతలు ఆమె చేపట్టారు. ఆ తర్వాత 2007లో 'చిన్మయి ఆదివాసీ సంఘం' అనేది ఆమె ప్రారంభించారు. దీనిద్వారా అటవీ ప్రాంతంలో సాగు చేస్తున్న భూమికి 1600 మంది మహిళా రైతులు పట్టాలు పొందారు. గిరిజనుల హక్కుల కోసం సంఘం పోరాటం ప్రారంభించిన తర్వాత సుమారు నాలుగు వేల ఎకరాలను రైతులకు పంపిణీ చేశారు. సీతంపేటలో 'నీలమ్మ తల్లి' మిల్లెట్ బేకరీని ఆమె ప్రారంభించారు. అలాగే శాస్త్రులపేటలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. తొమ్మిది గ్రామాల నుంచి మొత్తం 42 మంది మహిళలు బేకరీలో, పది మంది మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌లో ఉపాధి పొందుతున్నారు.
- లైంగికదాడులను ఉపేక్షించం.. : వాసిరెడ్డి పద్మ, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్
రాష్ట్రంలో మహిళలపై జరిగే లైంగిక వేధింపులు, దాడులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పలు అంశాలపై స్పందించారు.
- మహిళలు, బాలికలకు కమిషన్ ఎలాంటి భరోసా ఇస్తుంది?
నిందితులను అరెస్టు చేయించడం, బాధితులకు పోలీసుల ద్వారా రక్షణ కల్పించడం, నైతిక ధైర్యాన్ని ఇవ్వడం ద్వారా భరోసా కల్పిస్తుంది.
2. లైంగిక వేధింపులపై వస్తున్న ఫిర్యాదులు?
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జరుగుతున్న లైంగిక వేధింపులపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందిస్తున్నాం. బాధితులు ఫిర్యాదు చేయకపోయినా మీడియా, ఇతర ఏజెన్సీల ద్వారా సమాచారం వచ్చినా సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇస్తున్నాం. వెంటనే వాటిపై విచారణ చేపడుతున్నాం.
3. ఈవ్‌టీజింగ్, ఇతర దాడులపై ఎవరికి ఫిర్యాదు చేయాలి?
''దిశ'' యాప్ బాగా ఉపయోగపడుతుంది. మహిళలు, యువతులు ''దిశ'' యాప్ ఉపయోగించి, బటన్ నొక్కితే నిమిషాల్లో పోలీసులు వచ్చి రక్షిస్తారు.
4. పాఠశాలల్లో కౌన్సెలింగ్ ఎప్పటి నుంచి నిర్వహిస్తారు?
బాలికలకు భరోసా కల్పించేలా కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యాశాఖకు లేఖ రాశాం. స్వచ్ఛంద సంస్థల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే ప్రారంభిస్తాం.
5. వచ్చే ఏడాది కాలంలో ఏయే కార్యక్రమాలు చేపడతారు?
అవగాహన, సామాజిక రుగ్మతలు, సోషల్ మీడియాపై అప్రమత్తత, అత్యాచారాలు, దాడుల నుంచి బయటపడటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తాం.
- సెలవులంటే నాకు తెలియదు.. : పిల్లి బాల చెన్నమ్మ, ప్రకాశం జిల్లా
సహజంగా ఆయాలు పాఠశాల ఉన్న రోజే వెళుతుంటారు. సెలవురోజు అటువైపు కన్నెత్తి కూడా చూడరు. కానీ అందుకు భిన్నంగా యర్రగొండపాలెం మండలం మురారిపల్లి గ్రామానికి చెందిన పిల్లి బాల చెన్నమ్మ పనితీరు ఉంది. ఆమె గ్రామంలోని ప్రభుత్వ డెమో పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్నారు. సొంత ఇంటిలానే పాఠశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతారు. కాబట్టే ఆమె పనితనాన్ని మెచ్చి, ఎంఈవో పి ఆంజనేయులు ఇటీవలే మండల ''ఉత్తమ ఆయా''గా అవార్డును అందజేసి, ఘనంగా సన్మానించారు. 'సెలవులంటే నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకూ పాఠశాల శుభ్రంగా ఉంటేనే విద్యార్థులు శ్రద్ధగా చదువుతారు. పాఠశాలను అప్పుడప్పుడు కొందరు అధికారులు సందర్శించడానికి వస్తుంటారు. అలాగే ఈ మధ్య రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు వచ్చారు. ఆయన నన్నెంతగానో మెచ్చుకోవడం సంతోషాన్ని ఇచ్చింది' అన్నారు పిల్లి బాల చెన్నమ్మ.
- తల్లితో పాటు తండ్రిదీ బాధ్యత : ఎస్.కవిత, సీనియర్ సివిల్ జడ్జి, కడప
మహిళలు ఇంటిని చక్కదిద్దుకోవడంతో, ఆఫీసు వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించగలరు. పిల్లల ఆలనాపాలనలో తల్లితో పాటు తండ్రీ బాధ్యత తీసుకోవాలి. మహిళాభ్యుదయమే సమసమాజాభివృద్ధికి కొలమానం. మహిళలు తమ సమస్యల పరిష్కారానికి న్యాయవ్యవస్థలోని చట్టాలను, హక్కులను సాధనాలుగా ఉపయోగించుకోవాలి. నిత్యం మహిళలు ఎదుర్కొనే సమస్యలకు ధైర్యమే పరిష్కార మార్గాలను చూపిస్తుంది. మహిళలు సమాజ భీతికి వెరవకూడదు.
- భద్రత కల్పించాలి.. : వరలక్ష్మి, హెడ్‌నర్స్, నెల్లూరు
మదర్‌థెరిస్సా, ప్లోరెన్స్ నైటింగేల్ నర్సింగు వృత్తిలో సమాజానికి చేసిన సేవల్ని ఆదర్శంగా తీసుకొని, నర్సింగ్ వృత్తిని స్వీకరించాను. నాలాగా ఎంతోమంది ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతోనే ఈ వృత్తిని చేపడుతున్నారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల మేరకు సిబ్బంది నియామకం చేపట్టాలి. వాటికి విరుద్ధంగా ప్రస్తుతం నియామకాలు జరుగుతున్నాయి. నిరంతరం రోగుల సేవలో ఉండే నర్సులకు నేడు భద్రత కరువైంది. గ్రామీణ ప్రాంతాల్లో విధి నిర్వహణలో ఉండే నర్సింగ్ సిబ్బందికి తగిన భద్రత కల్పించాలి. ప్రైవేట్ వైద్య సంస్థల్లో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బందికి ఇఎస్‌ఐ, ఇపిఎఫ్ సౌకర్యం ఆయా యాజమాన్యాలే కల్పించాలి.
- సైన్స్ విజ్ఞానం అవసరం.. : మేకా సుస్యత రేఖ, టీచర్, తూ.గో. జిల్లా.
ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మేకా సుస్యత రేఖ. దానవాయిపేటలోని నివేదిత కిషోర్ విహార్ (ఎయిడెడ్) హైస్కూల్లో సైన్స్, మ్యాథ్స్ ఉపాధ్యాయురాలు. 'అంతరిక్షంలో గ్రహ శకలాలను గుర్తించేందుకు నాసా సహకారంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో 2020లో మా బృందం గుర్తించిన గ్రహ శకలాల వివరాలతో నివేదిక పంపించాము. నాసా సైతం వాటిని ధృవీకరించింది. ఇంటర్నేషనల్ పియర్సన్ అవార్డు, అబ్దుల్ కలాం చేతుల మీదుగా బెస్ట్‌సైన్స్ ప్రాజెక్డు అవార్డును భారతరత్న సిఎన్‌ఆర్ రావు చేతుల మీదుగా ''బెస్ట్‌సైన్స్ టీచర్ జాతీయ అవార్డు'' తీసుకోవడం సంతోషంగా ఉంది. ఇకపోతే నేను ఆన్‌లైన్ విధానం, ఆఫ్‌లైన్ పద్ధతి, తరగతిగదిలో బెంచ్ మార్కు వంటి కొత్త పద్ధతులు అనుసరించాను. ఇందుకోసం ఒక వారం ఒక బెంచ్‌లో విద్యార్థులపై శ్రద్ధ చూపుతాం. ఇలా నెల పూర్తయ్యేసరికి తరగతిగదిలోని 60 మందిలో ప్రతి విద్యార్థినీ నాలుగు సార్లయినా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఎవ్వరిని ప్రశ్నిస్తామో తెలియదు. కాబట్టి విద్యార్థులూ ఆసక్తిగా వింటారు. కొంచెం నెమ్మదిగా నేర్చుకునే పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని చెబుతుండటంతో వారూ మిగతావారితో సమానస్థాయికి చేరుకునే అవకాశం కలుగుతోంది' అని ఆమె వివరించారు.