Jan 07,2021 06:44

విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులను చూస్తే దిగ్భ్రాంతి కలుగుతోంది. ఉన్నత విద్యారంగంలో ఈ మార్పులు మరింత ప్రస్పుటంగా కనపడుతున్నాయి. మార్పు మంచికోసమో, అభివృద్ధి కోసమో అయితే కచ్చితంగా స్వాగతించాల్సిందే! కానీ, నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలుచేయ తలపెట్టిన విధ్వంసకర విధానపు తానులోకి ముక్కయైతే ఎలా ఆహ్వానించగలం? నిజానికి మోడీ సర్కారు రూపొందించిన నూతన విద్యావిధానం పట్ల వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ వైఖరి రాజు కన్నా ఎక్కువ రాజభక్తిని ప్రదర్శించినట్టుగా ఉంది. తీవ్ర స్థాయిలో విమర్శలకు గురైన ఈ విధానం అమలులో బిజెపి నేతృత్వంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి అడుగులేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం అంగలు, బారలతో ఎగబాకడానికి ప్రయత్నిస్తోంది. ఆంగ్ల మాధ్యమంతో ప్రాధమిక స్థాయిలోనే పరాయీకరణను ప్రారంభించిన జగన్‌ సర్కారు ఉన్నత విద్యలో కార్పొరేట్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేయడం ద్వారా మోడీ సర్కారు లక్ష్యాన్ని పరిపూర్ణం చేస్తోంది.


విశ్వవిద్యాలయాల్లో పరిశోధన బోర్డుల ఏర్పాటుతో పాటు, ఉన్నత విద్యలో అనేక సంస్కరణలను ప్రారంభిస్తున్నామంటూ రాష్ట్ర విద్మాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చేసిన ప్రకటనను ఈ కోవలోనే చూడాలి! ఇప్పటివరకు పరిశోధనాంశాలను దేశ ప్రయోజనాలు, విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా అధ్యాపకుల చొరవతో విశ్వవిద్యాలయాలే నిర్దేశిస్తున్నాయి. లోటుపాట్లు ఎన్ని ఉన్నప్పటికీ, ఈ విధానం మెరుగైన ఫలితాలనే సాధిస్తోంది. దాతృత్వ వనరుల పేరిట ఉన్నత విద్యాసంస్థలను కార్పొరేట్లకు అప్పగించి, సదుపాయాలు కల్పించే పాత్రకు ప్రభుత్వాన్ని పరిమితం చేయడానికి మోడీ సర్కారు సిద్ధమైన వేళ రాష్ట్ర ప్రభుత్వం బోర్డుల ప్రతిపాదనను ముందుకు తీసుకురావడంలో అర్ధమేమిటి? విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే వ్యవస్థీకృతమైన విధానాన్ని బద్దలు కొట్టడమే కదా! ఇది కేంద్రం ప్రతిపాదించిన విధానాన్ని ముందుకు తీసుకుపోవడం కాక మరేమిటి? ఉన్నత విద్యలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'తేలికైన.. పటిష్టమైన' (లైట్‌ అండ్‌ టైట్‌) రెగ్యులేటరీ వ్యవస్థ అర్ధం కార్పొరేట్లకు కొమ్ముకాయడమే కదా! ప్రతి ఉన్నత విద్యాసంస్థ బోర్డు ఆఫ్‌ గవర్నెన్స్‌ను స్వతంత్రంగా చూసుకోవాలని, ఆ తరువాత యూనివర్శిటీ వ్యవహారాలను పూర్తిగా చేజిక్కించుకోవచ్చని నూతన విద్యావిధానంలో పేర్కొనడం ప్రయివేటీకరణ, వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ కాక మరేమిటి? విశ్వవిద్యాలయాలు కార్పొరేట్‌ సంస్థలుగా మారిపోయిన తరువాత అక్కడ జరిగే పరిశోధనలకు, రూపొందే పత్రాలకు వ్యాపార విలువ కాకమరేముంటుంది? కార్పొరేట్ల కాసుల కక్కుర్తికి వాటి స్వయం ప్రత్తిపత్తి కాస్తా కనుమరుగుకాదా?


నూతన విద్యావిధానంలో విదేశీ విశ్వ విద్యాలయాలు, కార్పొరేట్‌ తరహా నిర్వహణ, మార్కెట్‌ అనుకూల కోర్సుల వంటి వాటికి లభించిన ప్రాధాన్యత రాష్ట్ర విశ్వ విద్యాలయాలకు, రాష్ట్ర ఉన్నత విద్యాసంస్థలకు లభించలేదు. వీటిని పూర్తిగా విస్మరించడంతో దేశంలోని ఉన్నత విద్యాసంస్థలన్నింటినీ ఒకే కేంద్ర సంస్థ పరిధిలోకి తీసుకురానున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే, వేయి ఆలోచనలు సంఘర్షించాల్సిన చోట ఒకదానికే పరిమితం చేయడం! అది కూడా పైనుండి రుద్దడం! దీంతో స్థానిక ప్రయోజనాలు, వాటి కేంద్రంగా జరిగే పరిశోధనలు మాయమైపోతాయి. ఈ ప్రమాదాన్ని ప్రతిఘటించకుండా కొత్త విశ్వవిద్యాలయాలు పెట్టినందువల్ల ప్రయోజనమేమిటి? నాలుగేళ్ల బిఇడి కోర్సుతో ఇప్పటికే నిరుద్యోగులుగా ఉన్న లక్షలాది మంది బిఇడి విద్యార్థుల భవిష్యత్తు ఏం కానుంది? నాన్‌- బిఇడి ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటి? డైట్‌ వంటి ఉపాధ్యాయ కోర్సులు ఏం కానున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కసరత్తు చేసిందా? కేంద్రం చెప్పిందని తలూపుతోందా? ఐదేళ్ల పిజి కోర్సులు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల పేరుతో ఏటా సర్టిఫికేట్లు జారీ చేయడం బడుగు, బలహీన వర్గాలను విద్యాసంస్థలనుండి అర్ధంతరంగా బయటకు నెట్టడానికి మినహా మరిదేనికి ఉపయోగపడదు. అయినా ఈ తొందర దేనికి? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా చాపకింద నీరులాగా నూతన విద్యా విధానంలోని అంశాలను ప్రజలపై రుద్దడం మానుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలకు, భావి తరాల ప్రయోజనాలకు భిన్నంగా రూపొందించిన ఆ విద్యావిధానాన్ని తిరస్కరించాలి. విద్యారంగ పరిరక్షణకోసం పోరాడుతున్న మేధావులతో కలిసిరావాలి.