
ప్రజాశక్తి - వీరఘట్టం : బోర్డుపైన జిల్లా పేరు మార్చడానికి ఇంత నిర్లక్ష్యమా? అంటూ అధికారుల తీరుపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. మండలంలోని హుస్సేన్‌పురం సచివాలయ కార్యాలయానికి ఏర్పాటు చేసిన నేమ్ బోర్డులో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 2022 ఏప్రిల్ 4న జిల్లాలను విభజించిన విషయం తెలిసినదే. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా నుంచి పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పాటైంది. జిల్లాలను విస్తరింప చేసి దాదాపుగా 19 నెలలు కావస్తున్నప్పటికీ జిల్లా పేరు మార్పు చేసేందుకు సచివాలయ అధికారికి తీరుకు లేదా అంటూ స్థానికులు పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు. మండల స్థాయి అధికారులకు సచివాలయానికి ఆకస్మిక తనిఖీలకు వెళ్లినప్పుడు నేమ్ బోర్డు కూడా కనిపించలేదంటూ ఎద్దేవా చేస్తున్నారు. అలాగే వీరఘట్టంలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమం బాలురు వసతిగృహం బోర్డుపైన కూడా జిల్లా పేరు మార్చలేదు. పార్వతిపురం మన్యం జిల్లా బదులు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాగానే బోర్డులు దర్శనమిస్తున్నాయి. వీటిని చూస్తే అధికారులు పనితీరు ఏవిధంగా ఉందో స్పష్టంగా అర్థం చేసుకో వచ్చును.