* ఆశ్చర్యపోయిన ఆహార భద్రతా కమిషన్ సభ్యులు బి.కాంతారావు
* మధ్యాహ్న భోజనం నిర్వహణపై సంతృప్తి
ప్రజాశక్తి - టెక్కలి: టమాట ధర పెరిగి ఇళ్లలో వండుకోవడానికే ఆలోచిస్తున్న సమయంలో, జగనన్న గోరుముద్దలో భాగంగా పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వండి పెట్టడంపై రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ సభ్యులు బి.కాంతారావు ఆశ్చర్యపోయారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలని గురువారం ఆయన సందర్శించారు. గోరుముద్ద పథకం అమలు తీరును పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. విద్యతోనే ఉన్నత భవిష్యత్ ఉంటుందని, విద్యార్థులందరూ బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. పేదరికంతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కారాదని, బాల కార్మికులుగా మారకూడదని ప్రభుత్వం అమ్మఒడితో పాటు పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చి, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిద్దేందుకు కృషి చేస్తోందని చెప్పారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో గోరుముద్ద పేరుతో రోజుకో మెనూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పోటీ ప్రపంచంలో రాణించేందుకు ఆంగ్ల విద్య అవసరమని, పాఠశాల స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గతంలో తొలి పది ర్యాంకుల్లో కార్పొరేట్ విద్యార్థులు ఉండేవారని, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో ఆ ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులూ ఉంటున్నారని తెలిపారు. విద్యార్థులకు ఆహార సమస్యలు ఏమైనా ఉంటే 9966242414 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. తొలుత ఆదిఆంధ్రావీధి, గొల్లవీధిలోని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. చిన్నబజారులో చౌకధరల దుకాణాన్ని సందర్శించి సరుకుల పంపిణీని పరిశీలించారు. బియ్యం బస్తాలో తరుగు ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేసి తరుగుకు గల కారణాలను తెలుసుకోవాలని జిల్లా పౌర సరఫరాల ఆధికారి రమణను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎండిఎం అధికారి ఎం.శ్రీనివాసరావు, తహశీల్దార్ ప్రవళ్లికా ప్రియ, ఐసిడిఎస్ సిడిపిిఒ పి.శోభారాణి, పౌరసరఫరాల సంస్థ సహాయ మేనేజర్ ఎ.దామోదర్, ఎంఇఒ డి.తులసీరావు రెడ్డి, ఇన్‌ఛార్జి హెచ్‌ఎం ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










