May 07,2022 06:56

       'దేశద్రోహం' చట్టంపై 'మీ వైఖరి ఏమిటో చెప్పండి' అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం గురువారం మరో మారు నిలదీయడంతో ఈ అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. బ్రిటిష్‌ వలసవాద కాలం నాటి ఈ చట్టానికి సంబంధించిన భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 124ఎ పదేపదే దుర్వినియోగం అవుతోందని, అందువల్ల దానిని రద్దు చేయాలని కోరుతూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరుపుతున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కూడా 'దేశద్రోహం' చట్టం దుర్వినియోగం అవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఇంకా ఈ వలస పాలన నాటి చట్టాన్ని కొనసాగించడం అవసరమా? అనే ప్రశ్నను లేవనెత్తి.. దీనిపై మీ వైఖరేంటో చెప్పండి అంటూ కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. కానీ మోడీ సర్కార్‌ మిన్నుకుండిపోయింది. దీంతో మరో మారు సర్వోన్నత న్యాయస్థానం నిలదీయాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఖరికి సంబంధించిన ముసాయిదాను న్యాయవాదులు సిద్ధం చేశారనీ, అయితే అధీకృత ఆమోదం కోసం మరికొంత సమయం కావాలని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనాన్ని కోరారు. ఇదే సందర్భంగా భారత అటార్నీ జనరల్‌ స్పందిస్తూ 'దేశంలో హనుమాన్‌ చాలీసా చదువుతామని చెప్పినా దేశద్రోహం కేసులు బనాయిస్తున్నారు' అని ఆందోళన వ్యక్తం చేస్తూనే చట్టం దుర్వినియోగం కాకుండా తాము అదుపులోకి తీసుకొచ్చామని గొప్పలు చెప్పారు. సాంకేతిక సాకులు చెబుతూ న్యాయస్థానం ఎదుట కేంద్రం తన వైఖరిని చెప్పకుండా నాన్చుడు ధోరణితో నెట్టుకురావాలని చూడటం దారుణం.
      వాస్తవానికి కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 'దేశద్రోహం' కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. అసమ్మతి గళాలను అణిచేసేందుకు, రాజకీయంగా విమర్శించే ప్రత్యర్థులను వేధించేందుకు జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడం బిజెపి వ్యూహాల్లో నిత్యకృత్యమైంది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) సమయంలోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ పౌర రిజిస్టర్‌ సమయంలోనూ ఎగిసిపడ్డ ఆందోళనలను అణిచేసేందుకు కూడా 'దేశద్రోహ' చట్టమే ప్రధాన అస్త్రమైంది. 2014-19 మధ్య ఆరేళ్ల కాలంలో 'దేశద్రోహం' చట్టం కింద 326 కేసులు నమోదయ్యాయి. అయితే ఇన్ని కేసుల్లో నేర నిరూపణ చేసింది కేవలం ఆరుగురి పైనే. అదే కాలంలో అస్సాంలో 54 కేసులు నమోదు కాగా వాటిలో 26 కేసుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేసి 25 కేసుల్లో విచారణ పూర్తి చేశారు. కానీ వీటిలో ఏ కేసులోనూ నేర నిరూపణ జరగలేదు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటమే 'దేశద్రోహం'గా పేర్కొంటూ 149 కేసులు, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా మాట్లాడారంటూ 144 కేసులు బనాయించారంటే 'దేశద్రోహం' చట్టం ఎంతగా దుర్వినియోగమవుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అక్రమ కేసులే బనాయించి 84 ఏళ్ల ఆదివాసీ హక్కుల కార్యకర్త స్టాన్‌ స్వామికి బెయిల్‌ నిరాకరించి.. నీరు తాగలేని పరిస్థితిలో ఆయనకు 'స్ట్రా' కూడా ఇవ్వకుండా కస్టడీలోనే ప్రాణాలు తోడేసిన ఘటన మానవ హక్కుల చరిత్రలోనే ఒక మాయని మచ్చ.
    గాంధీజీ, బాలగంగాధర్‌ తిలక్‌ వంటి వారిపై నాటి బ్రిటిష్‌ సర్కార్‌ ఈ చట్టాన్ని దుర్వినియోగపర్చింది. 'పౌరుడి స్వేచ్ఛను అణిచివేయడానికి తీసుకొచ్చిన చట్టం ఇది' అని గాంధీజీ అప్పట్లోనే ఈ చట్టాన్ని అభివర్ణించారు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సైతం 'అత్యంత అనుచితమైన, గర్హనీయమైన ఈ సెక్షన్‌ను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది' అని ఉద్ఘాటించారు. మన దేశంలో ఈ చట్టాన్ని రుద్దిన బ్రిటిష్‌ ప్రభుత్వం బ్రిటన్‌లో 'దేశద్రోహం' చట్టాన్ని 2009 లోనే రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో కొనసాగింపు భావ్యమా అనేది ఇప్పుడు ధర్మాసనం ముందు నిలిచిన ప్రశ్న. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను సైతం నీరుగార్చేలా ఉందన్న న్యాయకోవిదుల ఆందోళనలను, పౌరుల స్వేచ్ఛను పరిగణ లోకి తీసుకొని సర్వోన్నత న్యాయస్థానం ఈ చీకటి చట్టానికి సముచిత పరిష్కారాన్ని చూపుతుందని ఆశిద్దాం.