ప్రజాశక్తి - మక్కువ : జగనన్న అమ్మఒడి నాలుగో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గత నెల 28న ప్రారంభించారు. అయితే నేటికీ లబ్ధిదారుల ఖాతాల్లోని నిధులు మంజూరు కాక పోవడంతో విద్యార్థుల తల్లులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మూడు విడతలకు భిన్నంగా నాలుగో విడత అమ్మఒడి నిధులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమవుతూ వస్తున్నాయి. నవరత్నాల హామీలు భాగంగా ప్రారంభంలో విద్యార్థుల తల్లులు ఖాతాల్లో రూ.15వేలు ఒకేసారి జమ చేశారు. ఈసారి నాలుగో విడత విషయానికి వచ్చేసరికి అలాపడిన దాఖలాల్లేవు. ఈ నిధులు కూడా రూ.2వేలు పాతవి మినహాయించి రూ.13వేలే ఆయా తల్లుల ఖాతాలకు జమ చేస్తున్నారు. గతనెల 28వ తేదీన బటన్ నొక్కి తల్లులు ఖాతాలకు జమ చేశానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో ప్రకటించారు. అయితే 25 రోజులు కావస్తున్నా ఇంకా సుమారుగా 30శాతం పైబడి మహిళలకు అమ్మబడి నిధులు జమ కావలసి ఉంది. 25 రోజులుగా అమ్మ ఒడి నగదు కోసం లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన పరిస్థితి. అలాగే వారి ఖాతాలో డబ్బులు పడలేదని తెలియడంతో వాలంటీర్లు వద్ద కూడా తమ గోడు వెళ్లబోసుకునే స్థితి దాపురించిందని వారు వాపుతున్నారు. అలాగే ఈసారి అమ్మ ఒడి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.5వేలు, రూ.6వేలు, రూ.9వేలు చొప్పున జమ కావడం మరో విచిత్రం. ఇప్పటికే చాలామందికి ఇంకా పూర్తిస్థాయి నిధులు వారి ఖాతాల్లోకి జమ కాలేనట్లు తెలుస్తోంది. ఇంకా సమయం ఉందని వాలంటీర్లు చెప్పడంతో విద్యార్థుల తల్లులు ఆశతో ఆత్రంగా బ్యాంకుల వైపు పరుగులు తీస్తున్నారు. ఎందుకిలా చేశారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం చేపట్టిన అమ్మఒడి నిధులు విడుదలలో కొందరి ముఖంలో మోదం మరికొందరు ముఖంలో ఖేదం కన్పిస్తుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రులు దూర ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులు, మినీ బ్యాంకుల వద్దకు పనులు మానుకొని తిరగాల్సి వస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి మిగిలిన లబ్ధిదారులందరికీ అమ్మ ఒడి నిధులు వెంటనే జమచేయాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు.










