ప్రజాశక్తి- మధురవాడ : యానిమేషన్ సాయంతో ఇంజినీరింగ్ విద్యాబోధన ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యే అవకాశంఉందని గీతం రిజిస్ట్రార్ ఆచార్య డి.గుణశేఖరన్ అన్నారు. ఈ సరికొత్త విధానంలో అవసరమైన యానిమేషన్ వీడియోల తయారీకి స్మార్ట్‌జెన్ సంస్థతో గీతం డీమ్డ్ వర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం గీతం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.గుణశేఖరన్, స్మార్ట్ జెన్ సిఇఒ నవీన్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఈ ఆలోచన విజయవంతం కావాలని ఆకాంక్షవ్యక్తం చేశారు.
గీతం రీసెర్చి అండ్ కన్సల్టెన్సీ డైరక్టర్ డాక్టర్ రాజా ఫణిపప్పు మాట్లాడుతూ యానిమేషన్ తయారీకి అవసరమైన విధంగా ఇంజనీరింగ్ సిలబస్‌ను అందుబాటులోకి తేవాలన్నది ఉద్దేశ్యమన్నారు. స్మార్ట్ జెన్ సంస్థ నిపుణులతో గీతం ఫ్యాకల్టీ సభ్యులు కలిసి పనిచేస్తారన్నారు. గీతం పారిశ్రామిక సంబంధాల విభాగం అధిపతి సోమ్ భట్ మాట్లాడుతూ నూతన పద్దతిలో ఇంజనీరింగ్ విద్య సులభంగా అవగాహనకు యానిమేషన్ వీడియోలు దోహదపడతాయన్నారు. స్మార్ట్ జెన్ సిఇఒ నవీన్ మాట్లాడుతూ ఇంజనీరింగ్‌లో డిజిటల్ బోధనకు తమ యానిమేషన్ వీడియోలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో గీతం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ శిరీష పాల్గొన్నారు.










