- ఇవ్వాల్సింది రూ.15లక్షలు బిల్లు చేసింది రూ.4లక్షలు
- బిల్లలు చేయడంలో ఇబ్బందులు పెడుతున్న అధికారులు
- పర్సెంటేజీల కోసమే అధికారుల వేధింపులు
- సిఎం, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్ అర్జునరావు
ప్రజాశక్తి - వేటపాలెం
రాష్ట్రవ్యాప్తంగా సిఎం జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన సచివాలయాల నిర్మాణాలు నత్త నడకన నడుస్తున్నాయి. కానీ వేటపాలెంలో మాత్రం వేగంగా నిర్మాణాలు జరిగాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాని ఎవరు ముందుకు రాని సమయంలో ఓ యువ కాంట్రాక్టర్ ముందుకు వచ్చాడు. సచివాలయ భవనాల నిర్మాణ పనులు ప్రారంభించారు. 90శాతం పనులు సైతం పూర్తి చేశాడు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించేందుకు పూనుకుంది. ఈ నేపథ్యంలో మండలంలోని రామన్నపేట పంచాయితీలో రామన్నపేట సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాలను కాంట్రాక్టర్ చుండూరు అర్జునరావు నిర్మించారు. అతనికి రూ.15లక్షల బిల్లులు ప్రభుత్వం నుండి రావాల్సి ఉండగా కేవలం రూ.4.32లక్షలు మాత్రమే ఇచ్చారని కాంట్రాక్టర్ అర్జునరావు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులకు రూ.3లక్షలు ముడుపులు ఇస్తేనే పెంచిన రేట్ల ప్రకారం బిల్లు పెడతామంటూ అసిస్టెంట్ ఇంజనీర్ రఘురాం ద్వారా డిఈ స్వర్ణ శేషయ్య అడిగిచ్చారని బాధితుడు చుండూరి అర్జునరావు చేసిన ఆరోపణలు ఇప్పుడు మండలంలో హాట్ టాపిక్ అయ్యింది. సిఎం జగన్మోహన్ రెడ్డి, కలెక్టర్ రంజిత్ భాషాకు తాను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాంట్రాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం ప్రైవేటు కాంట్రాక్ట్ పనులు చేసుకునే తాను 2021నుండి సచివాలయం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టాలని అడిగితే కాదనకుండా నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. అసిస్టెంట్ ఇంజనీరు రఘురాం ఇప్పటివరకు ఎంత ఖర్చయినదని తనను వివరాలు అడిగారని అన్నారు. ఖర్చు నేను రాసుకోలేదని బదులు ఇవ్వంగానే రూ.3లక్షలు ఇస్తే పెంచిన రేట్లతో బిల్లులు పెడతామనీ డిఈ చెప్పమన్నాడని చెప్పారు. ముందు బిల్లు పెట్టండని బ్రతిమిలాడకొనన్నట్లు తెలిపారు. అసిస్టెంట్ ఇంజనీర్ రఘురాంకి రూ.25వేలు ఫోన్‌పే చేసి డిఇ ఇంటికెళ్ళి రూ.లక్ష ఇస్తే ఎలాంటి దయ దక్షిణ్యాలు లేకుండా రూ.15లక్షల పెట్టాల్సిన బిల్లు కేవలం రూ.4లక్షల80వేలకు బిల్లు పెడితే తన చేతికి వచ్చింది రూ.4లక్షల32వేలని వాపోయాడు. డిఈ శేషయ్య, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రఘురాం అడిగిన రూ.3లక్షలు ఇవ్వలేదనే అక్కస్సుతో తనకు ఇవ్వాల్సిన మొత్తం రూ.15లక్షల బిల్లు పెట్టకుండా తన కడుపు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయానని అన్నారు. మండలంలోని చల్లారెడ్డిపాలెం, వేటపాలెం పంచాయితీలో నిర్మిస్తున్న సచివాలయాలకు పెంచిన రేట్లతో బిల్లులు పెట్టి అడిగినంత ఇవ్వలేదనే కారణంతో తనకు బిల్లు పెట్టకుండా దిక్కున్న చోట చెప్పుకోమంటూ దుర్భాషలాడటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికైనా సిఎం, ఉన్నతాధికారులు కలుగజేసుకొని తనకు న్యాయం చేయాలని కాంట్రాక్టర్ అర్జునరావు వేడుకున్నారు.
డబ్బు అడిగాననడం అవాస్తవం
తాను ఎలాంటి కమిషన్లు అడగలేదని, తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పిఆర్‌ఐ డిఇ ఎస్ శేషయ్య తెలిపారు. పెంచిన బిల్లులు పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ పాలసీ అని చెప్పారు. తన చేతుల్లో ఏమీలేదని అన్నారు.










