ఇంజినీరింగ్‌తో అవకాశాలు మెండు:ఎన్.ఎన్.మూర్తి
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)
నేడు సాంకేతికతకు ఆదరణ, అవకాశాలు బాగున్నాయని, ఇంజినీరింగ్ విద్యతో భవిష్యత్తులో అవకాశాలు మెండుగా ఉన్నాయని తిరుపతి ఐఐటి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎన్.ఎన్.మూర్తి అన్నారు. బుదవారం తిరుపతి-కరకంబాడి మార్గంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఈసిఈ విభాగంలో చేరిన మొదటి సంవత్సరం విద్యార్ధులకు కళాశాల యాజమాన్యం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ ఎన్.ఎన్.మూర్తి మాట్లాడుతూ కరోనా మునుపు ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, చిప్స్ వంటి వాటి కోసం చైనా దేశంపై ఆధారపడాల్సి వచ్చేదన్నారు. కాని నేడు మన భారతదేశంలోనే తయారు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో భవిష్యత్తులో ఈసిఈ విద్యార్ధులకు మంచి ఉఫాది అవకాశాలు ఉంటాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యకు ఏపిలోనే కేరాఫ్‌గా ఎస్వీసిఈ నిలుస్తోందన్నారు. కళాశాల యాజమాన్యం విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. కళాశాల ఛైర్మన్ గంగిరెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రకాష్ అంబవరం, ప్రదీప్ అంబవవరం పాల్గొన్నారు.










