Sep 07,2022 23:52

సదస్సులో మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి- కలెక్టరేట్‌, విశాఖ : ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్న ఇంజినీరింగ్‌ కార్మికులకు హెల్త్‌, రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలని, టిఎ, డిఎ చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 15 నుంచి దశలవారీగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌ జెఎసి కన్వీనర్‌ కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. జివిఎంసి ఇంజినీరింగ్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల జిల్లా సదస్సు బుధవారం జగదాంబ సమీపంలోని సిఐటియు కార్యాలయంలో జరిగింది. జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఆందోళనలో భాగంగా ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు కార్మికుల నుంచి సంతకాల సేకరణ, అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాల సమర్పణ, 16వ తేదీ నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు, జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఉంటాయని వివరించారు. 20న చలో కలెక్టరేట్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్‌ కార్మికులందరినీ ఆప్కాస్‌ నుంచి మినహాయించి పర్మనెంట్‌ చేయాలన్నారు. రూ.26 వేలు వేతనం డిఎతో కలిపి చెల్లించాలన్నారు. చేస్తున్న పని ఆధారంగా టర్న్‌ కాక్‌, ఎలక్ట్రికల్‌ హెల్పర్‌, ఫిట్టర్‌ హెల్పర్‌, పార్కులు, క్లాప్‌ డ్రైవర్లకు రూ.18,500 వేతనం చెల్లించాలన్నారు. అన్ని ప్రభుత్వ పథకాలు వీరికి వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ గౌరవాధ్యక్షులు పి.వెంకటరెడ్డి అధ్యక్షతన సాగిన సదస్సులో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎంవి.ప్రసాదరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.నూకరాజు, యు.రాజు, మోహన్‌, కన్నబాబు, సూర్యనారాయణ, ఎం.ఈశ్వరరావు, ఆనంద్‌ కుమార్‌, సతీష్‌, వెంకటరావు, ఇ.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.