Apr 16,2023 01:59
వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు

ప్రజాశక్తి-వేటపాలెం: సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ అఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, చీరాలలో ఎంబిఎ, ఎంసిఎ చదువుతున్న విద్యార్థులకు అల్ఫా ఎం వేడుకలను నిర్వహించినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు మోయిద వేణుగోపాలరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ శక్తియుక్తులను సరియైన రీతిలో ఉపయోగిం చుకొని తమ విలువను పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. ఆధునిక యువత చేయలేనిది ఏమీ లేదని, అందుబాటులోని వస్తు సేవలను ఉపయోగించుకొని అద్భుతాలను సృష్టించవచ్చు నని అన్నారు. సృజనాత్మక విలువలను వస్తు సేవలకు జోడించినట్లయితే మార్కెట్లో ఉన్నత స్థాయిలో నిలదొక్కుకోవచ్చు నని తెలిపారు. విద్యార్థులు దృఢ సంకల్పం, కృషి, పట్టుదలతో ఉన్నత స్థాయిని అధిరోహించవచ్చునని తెలిపారు. విద్యార్థులు తమ సమయాన్ని వృథా చేయకుండా, ఆధునిక టెక్నాలజీలను నేర్చుకొని ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జరిగిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఎంబిఎ విభాగాధిపతి డాక్టర్‌ ఆర్‌ ఇమ్మానియేల్‌, ఎంసిఎ విభాగాధిపతి సి హరికిషన్‌ మాట్లాడుతూ విద్యార్థులు ఆధునిక సబ్జెక్టులపై పట్టు సాధించి ఎక్కువ వార్షిక వేతనంతో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు.