రామారావు మాస్టారు తరగతి గదిలో తెలుగు పాఠం బోధిస్తున్నారు. అందరు విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. క్లాస్‌లో మూడవ బెంచీలో కూర్చున్న గోపి మాత్రం విచారంగా కూర్చుని ఉన్నాడు. మాస్టారు పాఠాన్ని ఆపి గోపి దగ్గరికి వెళ్లి, 'ఎందుకలా విచారంగా ఉన్నావు? ఏమైంది?' అని అడిగారు.
'అమ్మ తిట్టింది సార్' అన్నాడు గోపి.
'అమ్మేగా తిట్టింది ఏడవకు' అంటూ సముదాయించారు మాస్టారు.
'నాకు ఇంగిత జ్ఞానం లేదని అమ్మ తిట్టింది. అసలు ఇంగిత జ్ఞానం అంటే ఏమిటి మాస్టారు?' అని అడిగాడు గోపి.
'ఈ ప్రశ్నకు జవాబు చెబితే అర్థం కాదు. అనుభవంతోనే తెలుసుకోవాలి' అని మనస్సులో అనుకున్నారు రామారావు మాస్టారు. వెంటనే ఒక విద్యార్థి చేత ఆఫీసు రూము నుంచి మంచినీళ్ల బాటిల్ తెప్పించారు. 'పిల్లలూ... ఈ తరగతి గదిలో 12 బెంచీలు ఉన్నాయి. ఒక్కో బెంచీకి ముగ్గురు విద్యార్థులు కూర్చున్నారు కదా! నేను బెంచీకి ఒక్క మంచినీళ్ల బాటిల్ తెచ్చి తాగమని మీకు ఇచ్చాననుకోండి. మీరేమి చేస్తారు?' అని అడిగారు.
వెంటనే మొదటి బెంచీలో కూర్చున్న ఒక విద్యార్థి 'మేము ముగ్గురం ఒకరి తర్వాత ఒకరు తాగుతాము సార్' అని చెప్పాడు. వెంటనే మాస్టారు 'అలాకాకుండా ముగ్గురికి చెందవలసిన నీటిని ఒక్కడే తాగాడనుకో! అతనికి ఇంగిత జ్ఞానం లేదు అంటాము' అని చెప్పారు. అయినా గోపీకి ఇంకా అర్థం కానట్లు చూస్తూనే ఉన్నాడు.
'చూడు గోపీ! నీరు మీ ముగ్గురికీ అవసరం అనుకో. అందరికీ దాహాన్ని తీర్చే నీటిని ముందుగా నువ్వు ఒక్కడివే తాగితే, మిగతా ఇద్దరి దాహం ఎలా తీరుతుంది? ఆ విషయాన్ని తెలుసుకోకపోవడమే ఇంగితజ్ఞాన లోపం అంటారు. ఇప్పుడైనా అర్థమైందా?' అని అడిగారు మాస్టారు.
వెంటనే గోపి పెద్దగా ఏడ్చేశాడు. మాస్టారు గోపిని ఓదార్చారు.
విచారంగా తరగతి గదిలో కూర్చుని ఉన్న గోపిని భోజన విరామం తర్వాత స్టాఫ్‌రూమ్‌కు పిలిపించారు మాస్టారు. 'అమ్మకు కోపమొచ్చే పని ఏమి చేశావు?' అని అడిగారు.
'ఉదయం అమ్మ అన్నకు రెండు దోశలు, నాకు రెండు దోశలు ఇచ్చింది సార్.. !' అని చెప్పడం ఆపేశాడు గోపి. 'ఇద్దరికీ సమానంగానే ఇచ్చింది కదా? మరి ఇక్కడ సమస్య ఏమిటి?' అని మాస్టారు అడిగారు. 'నేను అన్నయ్య దోశ ఒకటి తీసుకున్నాను సార్' మెల్లగా చెప్పాడు గోపి.
'నీవు చేసింది తప్పు కదా! అందుకే అమ్మ నిన్ను తిట్టింది' అని చెప్పారు మాస్టారు.
'అప్పుడు నాకు తెలియదు సార్, నేను ఎంత తప్పు చేశాను అనేది ఇప్పుడే తెలిసింది' అని బాధపడ్డాడు గోపి.
తన విద్యార్థిలో కలిగిన మార్పును చూసి రామారావు మాస్టారు చాలా సంతోషించారు.
దుర్గమ్ భైతి
9959007914