
ప్రజాశక్తి-వన్‌టౌన్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం దుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవి రూపంలో యాత్రికులకు దర్శనమిచ్చారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు యాత్రికులకు అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనానికి ప్రముఖులు తరలివస్తున్నారు. యాత్రికుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. దుర్గమ్మను దర్శించుకునేందుకు నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుండి యాత్రికులు తరలివచ్చారు. సుమారు 60 వేల మందికి పైగా శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించుకున్నట్లు దేవస్థాన అధికారులు చెబుతున్నారు. ఇక రానున్న రోజుల్లో భారీ సంఖ్యలో యాత్రికులు దుర్గమ్మ ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 20వ తేదీ శుక్రవారం మూలానక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు లక్షలాది మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉండటంతో దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహామండపం వైపున గల ఖాళీ స్థలంలో ఏర్పాటుచేసిన కళావేదికపై నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్యాలతో కళాకారులు ఆకట్టుకుంటున్నారు. అలాగే దేవాలయంలో ఉత్సవాల నేపధ్యంలో డప్పు కళాకారులు వాయిద్యాలతో ఆకట్టుకుంటున్నారు.
అన్నదానం పరిశీలన
ప్రజాశక్తి-విజయవాడ అర్బన్, భవానీపురం: శరన్నవరాత్రి ఉత్సవాలకు వస్తున్న వేలాది మంది యాత్రికులకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదానంలో భాగంగా అందిస్తున్న ఆహార పదార్థాలు అత్యంత రుచికరంగా, మహాద్భుతంగా ఉన్నాయని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నిత్యాన్నదాన కేంద్రంలో భోజనం చేసి మరీ ప్రశంసించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, ఆలయ కార్య నిర్వహణ అధికారి కె.ఎస్.రామరావులతో కలిసి నిత్యాన్నదాన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. యాత్రికులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో అన్న ప్రసాద కేంద్రంలో అత్యవసరంగా ఫ్యానులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 20 నుంచి 25 వేల మంది వరకు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని, మూలా నక్షత్రం రోజున మరింత మంది వచ్చే అవకాశాలు ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 20వ తేదీన దేవస్థానానికి రానున్న సందర్భంగా సాధారణ యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. వికలాంగులు, వృద్ధులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాలక మండలి సూచించిన సమయాల్లో దర్శనానికి రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉదయం 8 నుండి 10 గంటల మధ్యలో, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో, వికలాంగులు, వృద్ధులు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో పాలక మండలి అవకాశం ఇస్తుందన్నారు.
ఇంద్రకీలాద్రిపై ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్ అన్నారు. బుధవారం అంతరాలయంలో దర్శనం చేసుకున్న అనంతరం మంత్రి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆయురారోగ్యాలు అందించాలని.. సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ దుర్గమ్మను దర్శించుకున్నారు.