Jun 29,2023 01:03

ఆందోళననుద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం కార్పొరేటర్‌ గంగారావు

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద ఎంవిపి కాలనీలోని ఎఎస్‌ రాజా కాలేజీ గ్రౌండ్‌ పక్కన 1.10 ఎకరాల విస్తీర్ణంలో రూ.25 కోట్లతో జివిఎంసి నిర్మించిన మల్టీ ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనాను సహానీ ప్రయివేటు సంస్థకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యాన బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ, ప్రజల ఆస్తులను ప్రయివేటు సంస్థలకు దోచిపెట్టే నిర్ణయాలను జివిఎంసి ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇండోర్‌ స్పోర్ట్స్‌ను ప్రయివేటు సంస్థకు ఇవ్వకుండా, దీని నిర్వహణ బాధ్యతను జివిఎంసి చూడాలని, భారీగా విధించిన ఫీజులు రద్దుచేయాలని కోరారు. ఎరీనాను గత నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. సెంట్రల్‌ ఎసితో కూడిన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నాలుగు బ్యాడ్మింటన్‌ కోర్టులు, 2 స్విమ్మింగ్‌ పూల్స్‌, బాస్కెట్‌బాల్‌ కోర్టులు, వాలీబాల్‌ కోర్టు, 2 టేబుల్‌ టెన్నిస్‌ కోర్టులు, వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌, డార్మెటరీస్‌ తదితర అనేక రకాల క్రీడా సదుపాయాలున్నాయని, ఇన్ని సదుపాయాలు ఉన్న ఎరీనాను ప్రజలు వినియోగించుకొనే అవకాశంలేకుండా, ప్రయివేటు సంస్థకు జివిఎంసి, ప్రభుత్వం అప్పగించడం తగదన్నారు. స్విమ్మింగ్‌పూల్‌కు నెలకు రూ.5000, బాడ్మింటిన్‌కు రూ.5000, వాలీబాల్‌కు రూ.6000, టేబుల్‌ టెన్నిస్‌కు రూ.2,500, చెస్‌కు రూ.1500, యోగాకు రూ.2000, ఆదివారం రోజున బ్యాడ్మింటిన్‌కు ప్రతి గంటకూ రూ.1000, జిమ్‌క్రాస్‌ ఫిట్‌ ట్రైనింగ్‌కు రూ.8000 చొప్పున ప్రయివేటు సంస్థ వసూలు చేస్తోందన్నారు. అదనంగా 18 శాతం జిఎస్‌టి చెల్లించాలని తెలిపారు. రాబోయే కాలంలో ఈ ధరలు మరింత పెంచే అవకాశముందని చెప్పారు. ఈ ఫీజులు నిర్ణయంలోనూ, ధరల నియంత్రణలోనూ జివిఎంసికి అధికారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. విచ్చలవిడిగా డబ్బులు దోచుకొనే అవకాశం ప్రయివేటు సంస్థకు కల్పించిందని విమర్శించారు. నామమాత్రంగా ఏడాదికి కేవలం రూ.1.04 కోట్లు మాత్రమే చెల్లించి, స్పోర్ట్స్‌ కాంపెక్స్‌లో క్రీడా శిక్షణ పేర అనేక వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకొనే అవకాశమిచ్చిందని విమర్శించారు. ప్రజల సొమ్ముతో నిర్మించి కాంట్రాక్టర్లకు లాభాలు చేకూర్చడం, డబ్బున్న కొద్దిమందికే పరిమితం చేయడం సరికాదన్నారు. తక్షణమే ప్రయివేటీకరణ చర్యలు వీడకపోతే ప్రజాఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సిపిఎం మద్దిలపాలెం జోన్‌ కార్యదర్శి వి.కృష్ణారావు, నాయకులు కె.కుమారి, పి.వెంకటరావు, కోదండ, అప్పారావు, తులసీరాం, నాయుడు తదితరులు పాల్గొన్నారు.