Nov 01,2023 01:17

మాట్లాడుతున్న ఆస్ట్రేలియన్‌ కౌన్సిల్‌ జనరల్‌ సారా కిర్లూ

ప్రజాశక్తి - ఎఎన్‌యు : భారతదేశం లాగానే ఆస్ట్రేలియా కూడా భిన్న సంస్కృతుల గల దేశమని, వలస దేశమేనని ఆస్ట్రేలియన్‌ కౌన్సిల్‌ జనరల్‌ సారా కిర్లూ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యా లయాన్ని ఆమె మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సారా కిర్లు మాట్లాడుతూ ఇండియా - ఆస్ట్రేలియాల మధ్య విద్య, పర్యాటక రంగానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఇండియా నుండి ఆస్ట్రేలియాకు పెద్దయెత్తున ఇండియన్‌ ఉత్పత్తులు అందుతు న్నాయని చెప్పారు. ఆస్ట్రేలియాలో స్థిరపడు తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. ప్రపంచంలో మొదటి 100 విశ్వ విద్యలయాల్లో ఆస్ట్రేలియా నుండి 7 ఉన్నాయని, దాదాపుగా ఒక లక్ష మంది భారతీయులు ఆస్ట్రేలియాలో చదువు కోసం వస్తున్నా వెల్లడించారు. వీరికి చాలా ఫెలోషిప్‌లు, స్కాలర్‌షిప్‌లు తామిస్తున్నట్లు చెప్పారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రేలియన్‌ స్టడీస్‌లో పరిశోధనలపై సంతృప్తి వ్యక్తం చేశారు. వీసీ పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియాతో కలిసి భారతదేశం అనేక రంగాల్లో పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధి చెందుతు న్నాయని చెప్పారు. యూనివర్సిటీలో సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రేలియన్‌ స్టడీస్‌ 2020లో ప్రారంభించామని, అప్పటి ఆస్ట్రేలియన్‌ కౌన్సిల్‌ నుండి వచ్చిన ప్రతినిధి ఈ సెంటర్‌కు అనేక ప్రోత్సాహకాలు అందించారని గుర్తు చేశారు. పరిశోధనలను విస్తృతం చేసేందుకు ఆస్ట్రేలియా స్టడీస్‌ సెంటర్లో హిమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ విభాగాలను మిళితం చేయనున్నట్లు ప్రకటించారు. సెంటర్‌ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని సారా కీర్లును కోరారు. కార్యక్రమంలో వైస్‌ కౌన్సిల్‌ శామ్యూల్‌ మేయర్స్‌, వర్సిటీ రెక్టార్‌ పి.వరప్రసాద్‌మూర్తి, రిజిస్ట్రార్‌ బి.కరుణ, ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ సెల్‌ డైరెక్టర్‌ జి.చెన్నారెడ్డి పాల్గొన్నారు.