Aug 20,2023 22:40

విద్యుత్‌ స్తంభాలు లేకా కర్రల సహాయంతో ఇంటికి కరెంటు తీసుకున్న దృశ్యం

ప్రజాశక్తి-హిందూపురం : వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హిందూపురం పట్టణానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉండే రూరల్‌ మండలం పూలకుంట పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ కాలనీనిఏర్పాటు చేశారు. దాదాపు 100 మందికి పైగా ఇంటి పట్టాలను ఆ సమయంలో ప్రభుత్వం మంజూరు చేసింది. కాలనీలో సౌకర్యాలు కల్పించక పోయినప్పటికీ ఏదో ఒక రోజు కల్పిస్తారన్న నమ్మకంతో దాదాపు 50 మంది గృహాలను నిర్మాణం చేసుకుని చేసుకుని జీవనం చేస్తున్నారు. ఇప్పటికి 16 సంవత్సరాలు గడిచినా ఇందిరమ్మ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. విధి లేని పరిస్థితుల్లో ఎలాంటి వసతులు లేకపోయినప్పటికి అక్కడే నివాసం వుంటున్నారు. రోడ్లు లేవు, కాలువలు లేవు, కనీసం విద్యుత్‌ సౌకర్యం సైతం లేకపోయినప్పటికి నివాసం ఎలా వుండాలి అంటూ ఆ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలంలో అయితే ఈ ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా వుంటుంది. రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో వర్షపు నీరంతా రోడ్లపై నిలుస్తుంది. ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి మొక్కలు పెరిగాయి. దీంతో దోమలు విపరీతంగా పెరిగి ఈ ప్రాంత ప్రజలు అంటు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇది చాలదన్నట్లు విష కీటకాల కాటుకు బలి అవుతున్నారు. కాలనీలో విద్యుత్‌ సౌకర్యం లేక పోవడంతో రోడ్డులో ఉన్నా విద్యుత్‌ స్తంబాల నుంచి కర్రలను ఏర్పాటు చేసుకుని ఇండ్లకు విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకున్నారు. వీధి దీపాలు లేక పోవడంతో విష కీటకాలు ఎప్పుడు ఎవరిని కరుస్తాయోనన్న భయందోళనతో ఆ ప్రాంత ప్రజలు జీవనం చేయాల్సిన దుస్థితి దాపురించింది.
సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు
గ్రామ సర్పంచుగా ఎంపిక అయినప్పటి నుంచి ఇందిరమ్మ కాలనీలో ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలను కల్పించాలని ప్రతి మండల సమావేశంలోను అధికారులకు, పాలకులకు వివరిస్తున్నా. అయితే ఏ ఒక్కరు పట్టించు కోవడం లేదు. ఇప్పటి వరకు ఆరు సమావేశాలు జరిగాయి. మొదటి సమావేశం నుంచి సమస్యను సభ దృష్టికి తీసుకువస్తున్నా ఇప్పటికి పరిష్కరించలేదు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు, ఇతర నిధులు అయిన పంచాయితీలకు వస్తే వాటి ద్వారా సౌకర్యాలు కల్పించడానికి సాధ్యం అవుతుంది. ఆ నిధులు సైతం రాలేదు. పంచాయతీ సాధారణ నిధుల్లో నుంచి సుమారు రూ.2.50లక్షలు వెచ్చించి నీటి సౌకర్యాన్ని కల్పించా. జగనన్న లే అవుట్‌లో నివాసాలు లేక పోయినప్పటికి ప్రతి 10 అడుగులకు ఒక విద్యుత్‌స్తంభం ఏర్పాటు చేశారు. అయితే నివాసాలు ఉన్న ఇందిరమ్మ కాలనీలో ఇప్పటికి కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మంజునాథ్‌.
గ్రామ సర్పంచు
సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నాం
ఇందిరమ్మ కాలనీలో కనీస సౌకర్యాలు లేక పోయినప్పటికి, అద్దెలు చెల్లించే స్థోమత లేక ఇక్కడే నివాసం ఉంటున్నాం. విద్యుత్‌ సౌకర్యం లేక పోవడంతో ప్రధాన రహదారి నుంచి తమ నివాసానికి దాదాపు రూ.6వేలు ఖర్చు చేసి కర్రల సహాయంతో వైరు వేసుకుని కరెంటు తీసుకున్నాము.
అంజినమ్మ,
కాలనీవాసి
నివాసం ఉండలేక పోతున్నాం
కాలనీలో రోడ్డు, మురుగు కాలువలతో పాటు కనీస సౌకర్యం లేక పోవడంతో నివాసం ఉండలేక పోతున్నాం. అయితే ఒక్కరి సంపాదనపై అందరు జీవనం చేయాలి. అద్దెలు చూస్తే విపరీతంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అప్పులు చేసి నివాసం ఏర్పాటు చేసుకున్నాము.
రేష్మా,
కాలనీవాసి
సౌకర్యాల కల్పనకు తగిన చర్యలు
పూలకుంట గ్రామ పంచాయతీ పరధిలోని ఇందిరమ్మ కాలనీలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి తగిన చర్యలు తీసుకుంటాం. సమస్యను గ్రామ సర్పంచి తమ దృష్టికి తీసుకువచ్చారు. న్ని శాఖ అధికారులతో చర్చించి సౌకర్యాలు కల్పిస్తాం.
నరేంద్ర కుమార్‌,
ఎంపిడిఒ