Sep 15,2023 22:42

ప్రజాశక్తి-గుడివాడ : గుడివాడ పట్నంలోని ఇందిరా నగర్‌ కాలనీలో అభివృద్ధి పనులు కుంటుపడిన పరిస్థితి ఉందని, వెంటనే కాలనీని అభివద్ధి చేయా లని సిపిఎం పట్టణ కార్యదర్శి ఆర్‌ సి పి రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం గుడివాడ ఇందిరానగర్‌ కాలనీలో సిపిఎం పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్‌సిపి రెడ్డి మాట్లాడుతూ ఈ కాలనీ ఇచ్చి సుమారు సంవత్సరాలు పైన అయిం దని, ఈ మధ్యకాలంలో గత సంవత్సరంలో గడపగ డపకూ వైఎస్‌ఆర్సిపి అని తిరిగిన సందర్భంలో అక్కడ ప్రజలకి డ్రైనేజీ రోడ్లు వాగ్దానం చేశారన్నారు. కానీ డ్రైనేజీ మాత్రం మూడు బజారులకే నిర్మించారన్నారు. పాతిక సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు కూడా రోడ్లు కూడా అభివద్ధి చేయలేని పరిస్థితిలో ఇవ్వాళ గుడివాడ మున్సిపాలిటీ ఉందన్నారు. మంత్రి ఇచ్చిన వాగ్దానం కూడా నిలబెట్టుకోకుండా ఇంతవరకు ఆ రోడ్లు నిర్మాణం చేయలేదని వాళ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణం ఆ రోడ్డు నిర్మాణం చేయాలన్నారు. తాము పర్యటించే వార్డులో చూస్తే డ్రైన్‌ లో నీళ్లు బయటకు కదలక ఇళ్లల్లో వాడుకున్న నీళ్లే డ్రైన్లోకి వస్తున్న డ్రైన్లో నీళ్లు రోడ్లమీదకి వచ్చి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్నారు. తక్షణమే రోడ్లకి నిధులు కేటాయించి రోడ్లు పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి పి రజిని తదితరులు పాల్గొన్నారు.