Nov 19,2023 21:06

ఫొటో : ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

ఇందిరాగాంధీకి ఘన నివాళులు
ప్రజాశక్తి-సీతారామపురం : తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని బసినేనిపల్లి గ్రామంలో ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి దుద్దుకూరి రమేష్‌ నాయుడు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రమేష్‌ నాయుడు మాట్లాడుతూ భారతదేశానికి తొలి ప్రధానిగా మూడు పర్యాయాలు ఎన్నికవడం, బ్యాంకులను జాతీయం చేయడం, పేదలకు కూడు, గుడ్డ, గూడు కల్పించిన ఘనత ఇందిరా గాంధీకే దక్కుతుందన్నారు. భారతదేశంలో అభివృద్ధి ఇందిరా గాంధీ హయాంలోనే ప్రారంభమైందన్నారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్‌ నుండి ఎంపిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి ఆంధ్రప్రదేశ్‌ను అన్నివిధాల అభివృద్ధి పరిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని సంగారెడ్డి, మేడ్చల్‌ ప్రాంతాలలో ఇండిస్టియల్‌ను తీసుకువచ్చి అభివృద్ధి చేసిన ఘనత ఇందిరా గాంధీకే దక్కుతుందని కొనియాడారు.
రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలలో ఆమె మనవడు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక ఫలితాలను పునరావృతం చేస్తుందన్నారు. ప్రతిరైతు కుటుంబానికి రూ.5లక్షలను ఇచ్చి రూ.2లక్షల మేర రుణాలను మాఫీ చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సీతారామపురంలోని ఘటిక సిద్ధేశ్వరానికి రహదారి నిర్మాణ పనులకు అటవీ శాఖ నుండి అనుమతులు తీసుకొచ్చి రహదారిని ఏర్పాటు చేస్తామన్నారు. నందిపాడు నుండి నందవరం వరకు రోడ్డు అధ్వానంగా ఉందని, ఉదయగిరి జిల్లా అయితే ఉదయగిరి ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు. ఉదయగిరి నుండి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే సుమారు వంద కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉందని తద్వారా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. అదే ఉదయగిరిని జిల్లాగా మారిస్తే ఇక్కడి ప్రాంతం అభివద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఉదయగిరి మాజీ ఎంపిపి బాలయ్య, సీతారామపురం కాంగ్రెస్‌ అధ్యక్షులు కానాల హజరత్తయ్య, సీనియర్‌ నాయకుడు కాణాల ఖాజవలి, తదితరులు పాల్గొన్నారు.