రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం మన శరీరానికి చాలా అవసరం. కరోనా విస్తరిస్తున్న ఈ తరుణంలో దీని ప్రాధాన్యం మరింత పెరిగింది. ఏఏ పదార్థాల్లో ఇమ్యూనిటీని పెంచే గుణం ఉందో ముందే తెలుసుకొని... వాటితో రుచికరమైన వంటలు చేసుకోవాలి.
ఈవారం రుచిలో అలాంటి వంటల గురించే తెలుసుకుందాం.. మరి !
బీన్స్ కర్రీ
కావాల్సిన పదార్థాలు : బీన్స్-2 కప్పులు, పెసరపప్పు- 2 టీస్పూన్లు, అల్లం- అర టీస్పూన్ (ఇది ఆప్షనల్), టమాటా-ఒకటి (సన్నగా తరిగినది), కొత్తిమీర - కొద్దిగా (కట్ చేసింది), పసుపు- చిటికెడు, ఉప్పు- రుచికి సరిపడా, కారం- పావు టీస్పూన్ కంటే కాస్త ఎక్కువగా, కరివేపాకు- ఒక రెబ్బ, జీలకర్ర- అర టీస్పూన్, ఆవాలు - కొద్దిగా, నూనె- తగినంత, ఇంగువ- చిటికెడు.
తయారీ విధానం : ముందుగా పెసరపప్పును కడిగి.. ఓ గిన్నెలో వేసి.. నీరు పొసుకోవాలి. నీటిలో పప్పు పూర్తిగా మునగాలి. అరగంట తర్వాత కుక్కర్‌లో వేసి నీరు పోసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్‌ను వేసి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి.
ఇప్పుడు పాన్ వేడిచేసి.. అందులో నూనె వేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీర, కరివేపాకు వేసి వేగనివ్వాలి. వెంటనే ఇంగువ, అల్లం వేసి అటూ ఇటూ కదపాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాట ముక్కల్ని వెయ్యాలి. ఇందులో కొద్దిగా రుచికి ఉప్పు, పసుపు వేయాలి. టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకూ ఉంచి తర్వాత అటూ ఇటూ కదుపుతూనే మరో 2 నిమిషాలు ఫ్రై చెయ్యాలి. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు వెసి, ఉడికిన బీన్స్ వేసి, కారం వెయ్యాలి.
బాగా కదుపుతూ.. 3 నిమిషాలు ఫ్రై చెయ్యాలి. బీన్స్ కలర్ మారుతూ.. కర్రీ మొత్తం బాగా కలిసే వరకూ వేపాలి. దించేసే ముందు..కొత్తిమీర వెయ్యాలి. అవసరమైతే ఎండుకొబ్బరి వేసుకోవచ్చు. ఈ కర్రీని రైస్ లేదా చపాతీలతో కలిపి వడ్డించారంటే.. ఇక అంతే..
వెల్లుల్లి, చింతపండు రసం
కావాల్సిన పదార్థాలు : చింతపండు రసం-టీస్పూన్, టమాట-ఒకటి (చిన్నగా తరిగినది), కరివేపాకులు-రెండు రెబ్బలు, నల్ల మిరియాలు-2 టీస్పూన్లు, వెల్లుల్లి-5 రెబ్బలు, పసుపు-అర టీస్పూన్, ఎండుమిర్చి- రెండు, ఉప్పు- తగినంత, జీలకర్ర-టీస్పూన్, ఇంగువ-అర టీస్పూన్, కొత్తిమీర-టీస్పూన్, నూనె-టీస్పూన్, ఆవాలు-టీస్పూన్.
తయారీ విధానం : ముందుగా పాన్‌లో ఎండు మిర్చిని కొద్దిగా ఫ్రై చేసి, తర్వాత వాటిని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. వాటితోపాట నల్ల మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకులు వేసి... గ్రైండ్ చెయ్యాలి. వచ్చిన పొడిని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్లీ పాన్ తీసుకొని నూనె వేసి.. వేడిచేసుకోవాలి. టమాటా ముక్కలు వేసి, మిగిలిన కరివేపాకులు వెసుకోవాలి. పసుపు, ఉప్పు వేసి 4 నిమిషాలు మీడియం మంటపై వేపుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసిన పొడిని వేసుకోవాలి. ఇందులో చింతపండు గుజ్జు పోసుకోవాలి. దీంతో పాటు 2 కప్పుల నీరు పొయ్యాలి. చిన్న మంట పెట్టి.. మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి.
మరో ప్యాన్‌లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువ వేసి అటూ ఇటూ కదుపుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించిన రసం వెయ్యాలి. పది నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి, రసంలో కొత్తమీర వేసి కలపాలి. కావాలంటే కాస్తంత నల్ల మిరియాల పొడి కూడా చల్లుకోవచ్చు. ఈ రసాన్ని డైరెక్టుగా తాగవచ్చు లేదా... రైస్‌లో కలుపుకొని తినవచ్చు.
పాలకూర దోఖ్లా..
కావాల్సిన పదార్థాలు : పాలకూర-2 కట్టలు, శనగపిండి-200 గ్రాములు, ఆవాలు-2 టీస్పూన్లు, అల్లం-కొద్దిగా, కొత్తిమీర-ఒక కట్ట, పచ్చిమిర్చి-నాలుగు, కొబ్బరి తరుము - కొద్దిగా.
తయారీ విధానం : పాలకూర ఆకులు, అల్లం, పచ్చిమిర్చి మిశ్రమంలో కొద్దిగా నీరు, ఉప్పు వేసి... మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో శనగపిండి వేసి... కొద్దిగా నీరు పొసుకోవాలి. మరీ పలుచగా కాకుండా స్మూత్‌గా ఉండేలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమంపై కొద్దిగా ఫ్రూట్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దాన్ని స్టీమర్‌లో లేదా దోఖ్లా మేకర్‌లో ఉంచాలి. దోఖ్లా తయారవ్వగానే దాన్ని బయటకు తీసి.. ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలపైన షుగర్ సిరప్ వేసుకోవాలి. తర్వాత నూనెలో ఆవాలు వేయించి వాటిని నూనెతో సహా.. దోఖ్లా ముక్కలపైన పోసుకోవాలి. కొబ్బరి తురుము, కొత్తిమీర ఆకులు వేసి.. పుదీనా చట్నీతో సెర్వ్ చేసుకోవచ్చు.
పోషకాలు : పాలకూరలో ఎక్కువ పోషకాలుంటాయి. ముఖ్యంగా పాలకూరలో ఉండే ఐరన్ మనకు శక్తిని ఇస్తుంది. ఇంకా విటమిన్ ఎ,సి,కె ఉంటాయి. మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి.