Feb 15,2023 16:26
  • స్కాడ్ డిఎఫ్ఓ  త్రిమూర్తుల రెడ్డి 

ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరి) : రక్షిత అటవీ ప్రాంతం నుండి అక్రమ కలప రవాణా అరికట్టేందుకు  కట్టుదిట్ట చర్యలు చేపట్టినట్లు స్కాడ్ డిఎఫ్ఓ  త్రిమూర్తులు రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్థానిక రేంజ్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు, రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా  ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తూర్పు  రక్షిత అటవీ ప్రాంతంలో అడవి జంతువులను వేటాడితే అటువంటి వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు, రానున్న వేసవి దృష్ట్యా అటవీ ప్రాంత గ్రామ సమీపాలలో గల మంచినీటి చెరువుల వద్దకు అడవి జంతువులు త్రాగునీటి కోసం తరుచూ వస్తూ ఉంటాయని వాటిని వేటగాళ్లు వేటాడితే వారిపై కఠిన చర్యలు చేపట్టడంతో వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం  కేసులు నమోదు చేస్తామని డిఎఫ్ఓ  హెచ్చరించారు. తూర్పు  అటవీ ప్రాంతంలో తమ సర్కిల్ పరిధిలో 200 హెక్టార్లలో టేకు, మారిజాతి కలపను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే వేసవిలో అడవులలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు  చేపడుతున్నామన్నారు. అడవుల్లో అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే తమకు సాటిలైట్ ద్వారా ఆయా ప్రాంతాల ఫారెస్ట్ సిబ్బంది మెసేజ్ పెడుతుందని తక్షణం ఆ ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడం జరుగుతుందన్నారు. అలాగే ఎక్కడైనా అడవి జంతువులను వేటాడినట్టు సమాచారం ఉంటే తక్షణం తమకు తెలియజేయాలని ఆయన తెలిపారు. అనంతరం ఆయన రాజవొమ్మంగి రేంజ్ పరిధిలోని ఉర్లాకులపాడు ప్లాంటేషన్ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట సబ్ డిఎఫ్ ఓ సోమరాజు, రాజవొమ్మంగి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎం అబ్బాయి దొర, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.