- ఇరిగేషన్ ఎస్‌ఇకి సిపిఎం జిల్లా నాయకులు కాశీనాథ్ విజ్ఞప్తి
ప్రజాశక్తి-విజయవాడ: రణదివే నగర్లో రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఇళ్లు తొలగించకుండా అలైన్‌మెంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నగరంలోని ఇరిగేషన్ శాఖ ఎస్‌ఇని ఆయన కార్యాలయంలో సిపిఎం నేతలు కలిశారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ రిటైనింగ్ వాల్, అలైన్‌మెంట్‌పై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా గోడ నిర్మాణం కోసం ప్రజలు పోరాడారని, తీరా దాని నిర్మాణం జరిగే సమయంలో ఇళ్లు తొలగిస్తామని అధికారులు చెబుతున్నారని అన్నారు. వరద నుండి ఇళ్లను రక్షించుకోవడానికి గోడ నిర్మించాలని పోరాడితే...ఇప్పుడు ఇళ్లే తొలగిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అధికారులు కూడా ప్రజల వద్దకు వచ్చి వాస్తవ పరిస్థితులను వివరించి అవగాహన కలిగించాలన్నారు. దీనిపై ఎస్‌ఇ స్పందిస్తూ 95 శాతం ఇళ్లు తొలగించకుండా గోడ నిర్మాణం చేపడతామన్నారు. గోడ నిర్మాణంలో అడ్డంకిగా ఉండే 5 శాతం ఇళ్లను తొలగించినా వాటికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపుతుందన్నారు. ఇరిగేషన్ ఎస్‌ఇని కలిసిన వారిలో సిపిఎం తూర్పు నగర కార్యదర్శివర్గ సభ్యులు పుప్పాల కష్ణ, స్థానిక నాయకులు శివాజీ, లక్ష్మీనారాయణ, పి.శ్రీరాములు, లక్ష్మణ కుమార్ ఉన్నారు.










