Aug 03,2022 00:05

తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న రైతులు, సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - ఆరిలోవ : చినగదిలి మండల పరిధి కొమ్మాది, రేవళ్లపాలెం, బక్కన్నపాలెం గ్రామాల్లో భూములు కోల్పోయిన రైతులకు ఆ భూముల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు చినగదిలి మండల రూరల్‌ తహశీల్దారు కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన బాధిత రైతుల కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ధర్నా చేశారు. తమకు వెంటనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధిత కుటుంబీకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆరిలోవ, పిఎంపాలెం పోలీస్టేషన్‌ పరిధి సిఐలు ఇమ్మాన్యుయేల్‌ రాజు, గొలగాని అప్పారావు భారీగా పోలీసులతో అక్కడకు చేరుకొని తహశీల్దారు కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డగించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, డి.అప్పలరాజు మాట్లాడుతూ, కొమ్మాది, బక్కన్నపాలెం, రేవళ్లపాలెం గ్రామాల్లో సర్వే నెంబర్లు 94 నుంచి 102 వరకు 86 మంది పేద, దళిత, వెనుబడిన తరగతులకు చెందిన రైతులకు 44 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం కుటుంబానికి ఎకరం చొప్పున ఇచ్చిందన్నారు. అప్పట్లో రైతులు ఆ భూముల్లో సాగుచేసుకోవడంతో పాటు ఆవులు, గేదెలు పెంచుకుంటూ జీవనోపాధి సాగించేవారన్నారు. ఆ రైతులకు ఎటువంటి నష్ణపరిహారమూ ఇవ్వకుండా బలవంతంగా భూమిని ప్రభుత్వం లాగేసుకుందని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు ఇళ్లు మంజూరుచేయాలని రాష్ట్ర హైకోర్టు చెప్పినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదన్నారు. తక్షణమే భూముల కోల్పోయిన రైతులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దారుకు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు రాజ్‌కుమార్‌, ఎస్‌.పైడితల్లి, వి.నరేంద్రకుమార్‌, బి.భారతి, డి.కొండమ్మ పాల్గొన్నారు.