
నోటీసులతో లబ్ధిదారుల ఆందోళన
ప్రజాశక్తి - వీరవాసరం
ప్రభుత్వం కేటాయిం చిన జగనన్న లేఅవుట్‌లో లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలో ఇళ్లు నిర్మించుకోకపోతే ఇంటి పట్టా రద్దు చేస్తామంటూ ఆర్‌డిఒ పేరున వచ్చిన నోటీసుల పట్ల లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనువుకాని చోట ఇంటి స్థలాన్ని కేటాయించి ఇళ్లు కట్టుకోమంటే ఎలా అంటూ వారు వాపోతున్నారు. ఈ మేరకు మంగళవారం లబ్ధిదారులు అందుకున్న నోటీసులతో తహశీల్దార్ ఎం.సుందరాజును కలిశారు. వీరవాసరానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలేపల్లికి కిలోమీటరు దూరంలో వ్యవసాయ ప్రాంతంలో వీరవాసరం, మెంటేపూడి, దూసనపూడి గ్రామానికి చెందిన కొంతమంది లబ్ధిదారులకు జగనన్న లేఅవుట్ వద్ద ఇంటి స్థలాన్ని కేటాయించారు. అయితే ఆ ప్రాంతంలో ఇంటిని నిర్మించుకుంటే బతుకుతెరువుకు ఇబ్బందవుతుందంటూ లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకు రాని పరిస్థితి. కొద్ది నెలల క్రితం కలెక్టర్ ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. అయితే లబ్ధిదారుల అభిప్రాయాన్ని పరిణలోకి తీసుకోకుండా తాజాగా అధికారులు ఇంటిని నిర్మించుకోకపోతే రద్దు చేస్తామంటూ నోటీసులు ఇవ్వడంతో సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కొంతమంది అధికారుల నిర్వాకం వల్ల గ్రామానికి దూరంగా ప్రభుత్వం ఇంటి స్థలాలను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆ ప్రాంతానికి వెళ్లేందుకు అవసరమైన రోడ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలంటే కొన్ని లక్షల రుపాయలు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత ఖర్చు చేసే బదులు స్థలం ఖరీదు ఎక్కువైనా లబ్ధిదారులకు అనువుగా ఉండే ప్రాంతంలో ఎందుకు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయలేదన్న ప్రశ్నకు అధికారులే జవాబు చెప్పాల్సి ఉంటుంది. తమ ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని అనువైన చోట ఇళ్ల స్థలాలు కేటాయించాలని మణికుమారి, సుజాత, జ్యోతి, కుమారి కోరుతున్నారు.