Feb 27,2023 21:54

లబ్ధిదారులపై తీవ్రమైన ఒత్తిడి
ప్రభుత్వ సాయం కేవలం రూ.లక్షా 80 వేలే
ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.8 లక్షలుపైనే
అధికారుల ఒత్తిడితో ఆందోళనలో లబ్ధిదారులు
ప్రభుత్వ తీరుపై జనంలో తీవ్ర ఆగ్రహం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఇళ్ల స్థలాల లబ్ధిదారులపై అధికారులు తీవ్రమైన ఒత్తిడికి దిగారు. ఇల్లు కట్టకుంటే పట్టా రద్దు చేస్తామంటూ బెదిరింపులపర్వానికి దిగడంతోపాటు పలుచోట్ల నోటీసులు సైతం జారీ చేస్తున్నారు. దీంతో అప్పు చేసి ఇల్లు కట్టలేక, ఉన్న స్థలం పోతుందనే భయం లబ్ధిదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆర్థిక స్తోమత గురించి ఆలోచించకుండా ఇల్లు కట్టాలంటూ ఒత్తిడి తేవడంపై లబ్ధిదారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1800 లేఅవుట్‌లలో 2.50 లక్షల ఇళ్ల పట్టాలను ప్రభుత్వం మంజూరు చేసింది. తొలివిడతగా 1,109 లేఅవుట్లలో 1.42 లక్షల ఇళ్లు నిర్మించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. జిల్లాల విభజన జరిగిన తర్వాత ఏలూరు జిల్లాలో తొలివిడతగా 1.03 లక్షల ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో ఇక్కడి అధికారులు ముందుకు సాగుతున్నారు. పశ్చిమగోదారి జిల్లాలోనూ తొలివిడతగా దాదాపు 72 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రూపొందించారు. ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకూ 14 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు లెక్కలు చెబుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇళ్ల నిర్మాణం లక్ష్యం మేరకు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. వచ్చే ఉగాది నాటికి పెద్దఎత్తున గృహప్రవేశాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇళ్ల నిర్మాణంపై అధికారులు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. ఇంటి నిర్మాణం చేయకుంటే పట్టా రద్దు చేస్తామంటూ బెదిరింపులపై లబ్ధిదారుల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. దీనికి కారణం ఇల్లు నిర్మించుకునే పరిస్థితుల్లో లబ్ధిదారులు లేకపోవడమే. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు భరించగలిగే స్థితి 90 శాతానికిపైగా లబ్ధిదారులకు లేదు. దీంతో ఇంటి నిర్మాణం పేరు చెబితే భయపడే పరిస్థితి నెలకొంది. నిర్మాణానికి అయ్యే ఖర్చుకు, ప్రభుత్వం ఇచ్చే సాయానికి పొంతన లేకుండాపోయింది. దీంతో ఏ విధంగా ఇల్లు నిర్మించాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
పునాదులకే చాలని ప్రభుత్వ సాయం
ఇంటి నిర్మాణం చేయాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువగా లెక్కించినా రూ.ఎనిమిది లక్షలుపైనే ఖర్చవుతోంది. అయితే ప్రభుత్వం ఇచ్చే రుణం సాయం కేవలం రూ.లక్షా 80 వేలు మాత్రమే. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము పునాదుల దశకు కూడా చాలడం లేదు. ఇంకా దాదాపు రూ.ఆరు లక్షలు అప్పు చేస్తే తప్ప ఇల్లు పూర్తికాని పరిస్థితి ఉంది. ఇళ్ల స్థలాల లబ్దిదారులకు అంత పెద్దమొత్తంలో అప్పు పుట్టే పరిస్థితి లేదు. దీంతో ఇళ్ల నిర్మాణానికి పెద్దగా ముందుకు రావడం లేదు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ నామమాత్రంగానే నిర్మాణాలు జరగడమే దీనికి నిదర్శనం. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ఇనుము ఖర్చు రూ.లక్ష వరకూ అవుతోంది. తాపీ పని వారికి, కూలీలకు రూ.లక్షా 80 వేలు, దాదాపు 200 సిమెంట్‌ బస్తాలకు రూ.80 వేలు, ఇసుక 40 టన్నులకు రూ.65 వేలు, ఇటుకకు రూ.90 వేలు, మెటల్‌కు రూ.35 వేలు, సెంట్రింగ్‌కు రూ.22 వేలు, విద్యుత్‌, ప్లంబింగ్‌ పనులకు రూ.50 వేలు, టైల్స్‌, గుమ్మాలు, కిటికీలు వంటి ఖర్చులకు రూ.లక్షపైనే అవుతోంది. ఇంకా ఇతర ఖర్చులు ఉంటాయి. ఇంత పెద్దమొత్తంలో ఖర్చు చేసే స్తోమత లబ్ధిదారులకు లేకపోవడంతో ఇంటి నిర్మాణానికి జంకుతున్నారు. అధికారులు తీవ్రమైన ఒత్తిడి తెస్తుండటంతో లబ్ధిదారులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో నోటీసులిచ్చినా, పట్టాలు తీసుకున్నా ఇంటి నిర్మాణం చేయలేమని పలుచోట్ల లబ్ధిదారులు ఖరాఖండిగా చెబుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం అందించే సాయం పెంచితే ఇంటి నిర్మాణాలపై లబ్ధిదారులు ముందుకొచ్చే పరిస్థితి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.