Oct 21,2023 20:43

మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్షి ్మ

ప్రజాశక్తి-విజయనగరం : మంజూరైన ఇళ్లు కట్టుకోకపోతే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. అవసరమైతే పట్టాలను కూడా రద్దు చేస్తామని అన్నారు. కొంతమంది లబ్ధిదారులు పునాదులు వేసి వదిలేశారని, పని ఆపేస్తే అది ఏ స్టేజ్‌లో ఉన్నా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రద్దు చేసిన ఇళ్లను అర్హులకు అందజేయాలని సూచించారు. ఎంపిడిఒలు, ఎంఇలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీలతో శనివారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జగనన్న ఇళ్ల నిర్మాణం, ప్రాధాన్యతా భవనాలు, జనగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలపై కలెక్టర్‌ సమీక్షించారు. ఆయా మండలాల ప్రగతిపై ప్రశ్నించారు. నవంబరు నాటికి మంజూరైన ఇళ్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణానికి ముందుకు రాని లబ్దిదారుల ఇళ్లను, ఇళ్ల పట్టాలను కూడా రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, వార్డు ఎమినిటీ సెక్రటరీలు ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించి, ప్రతిరోజూ ప్రగతిని నమోదు చేయాలని సూచించారు. జగనన్న కాలనీల్లో విద్యుత్‌, తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని అన్నారు.
ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల గురించి వలంటీర్లు, ఇతర సిబ్బంది ద్వారా ఇంటింటికీ విస్తత ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రతీ సురక్ష శిబిరంలో ఇద్దరు పిహెచ్‌సి డాక్టర్లు, ఇద్దరు స్సెషలిస్టు వైద్యులు, ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేసిన రోగులను పర్యవేక్షించి, వారికి నవంబరు 15 లోగా తదుపరి వైద్య చికిత్సను అందించాలన్నారు. ఆరోగ్య శ్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటు, తమ పేర్లను యాప్‌లో రిజిష్టర్‌ చేసుకొనేవిధంగా చూడాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్‌పి సిఇఒ కె.రాజ్‌కుమార్‌, డిపిఒ నిర్మలాదేవి, హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.