Oct 16,2023 21:58

జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న అంగన్‌వాడీలు

           ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌    ప్రభుత్వం తమకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు కడుతుంటే కొందరు అడ్డుపడుతన్నారని, పరిశీలించి చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్‌సెల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు లలితమ్మ, నక్షత్ర, జమున తదితరులు మాట్లాడుతూ తామంతా అంగన్‌వాడీ కార్యకర్తలుగా పని చేస్తున్నామని తెలిపారు. 2004 నుంచి బిఎల్‌ఓలుగా పని చేశామన్నారు. 2011లో అప్పటి ఆర్‌డిఓ, ఇప్పటి కలెక్టర్‌ ఎం.గౌతమి, తహశీల్దార్‌ రామకృష్ణారెడ్డి స్పందించి 69 మందికి ఉప్పరపల్లి గ్రామ పంచాయతీ, 107-1 నుంచి 7 వరకూ ఉన్న పొలంలోని ప్రభుత్వ భూమిలో ఒక్కొక్కరికి సెంటున్నర చొప్పున ఇళ్ళ పట్టాలు ఇచ్చారని తెలిపారు. అనంతపురం మండల సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రతాప్‌రెడ్డి మాకు లేఅవుట్‌లు వేసి హద్దులు చూపించారని తెలిపారు. అప్పటి నుంచి ఆ స్థలాల్లో బండలు నాటడానికి వెళ్లినప్పుడల్లా ఎవరో ఒకరూ ఆ స్థలం మాదంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. పునాదులు, వేసిన, బండలు నాటిన తొలగిస్తున్నారని తెలిపారు. ఈ మధ్య ఆ స్థలం రిజస్ట్రేషన్‌ చేయించుకున్నామంటూ ఆందోళనలకు గురి చేస్తున్నారని తెలిపారు. బంగి భాస్కర్‌, రమేష్‌, మహేష్‌ బంజారా అనే వారు ఈ మధ్య వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. అప్పట్లో అంగన్‌వాడీలుగా పని చేసిన వారిలో అధిక మంది పదవి విరమణ పొందారని తెలిపారు. తామంతా కలిసి ఇళ్లు కట్టుకోవాలని సిద్ధమయ్యామని, బెదిరిస్తున్న వారి నుంచి తమ స్థలాలు కాపాడి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన జేసీ పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.