Jan 21,2023 22:24
ఇళ్లు.. ఏళ్లు..!

ముందుకు సాగని ఇళ్ల నిర్మాణం
తొలివిడతగా ఏలూరు జిల్లాలో లక్షా 3 వేలు ఇళ్ల నిర్మాణం లక్ష్యం
ఇప్పటి వరకూ 14 వేలు పూర్తి
ఉగాదినాటికి మరో 12 వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంతో ముందుకు
ఆర్థిక భారంతోనే ముందుకు రాని లబ్ధిదారులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి అనే చందంగా మారింది. తొలివిడతగా ఇళ్ల నిర్మాణానికి నిర్ధేశించుకున్న లక్ష్యానికి.. పూర్తయిన ఇళ్లకు ఏమాత్రం పొంతన లేకుండాపోయింది. ఇదేవిధంగా కొనసాగితే ఇళ్ల నిర్మాణ ప్రక్రియ పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుందోననే చర్చ నడుస్తోంది. ఏలూరు జిల్లాలో తొలివిడతగా 1,03,077 ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్ధేశించింది. ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలై దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇప్పటి వరకూ పూర్తయిన ఇళ్ల నిర్మాణం కేవలం 14 వేలు మాత్రమే. అంటే తొలి విడత ఇళ్ల నిర్మాణ లక్ష్యంలో ఒకటో వంతు కూడా పూర్తికాని పరిస్థితి నెలకొంది. వచ్చే ఉగాది నాటికి మరో 12 వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా తీసుకున్నట్లు ఇటీవల జిల్లాలో పర్యటించిన గృహ నిర్మాణ రాష్ట్రస్థాయి అధికారులు తెలిపారు. దాదాపు రెండేళ్లలో 14 వేలు ఇళ్ల నిర్మాణం పూర్తవగా రెండు నెలల్లో 12 వేల ఇళ్ల నిర్మాణం పూర్తవడం ఎంతవరకూ సాధ్యమో అధికారులు చెప్పాల్సి ఉంది. ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ఏలూరు జిల్లాతోపాటు పశ్చిమగోదావరి జిల్లాలోనూ నత్తనడకన సాగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. జగనన్న లేఅవుట్లలో రోడ్లు, నీరు, విద్యుత్‌, డ్రెయినేజీ వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అంతేకాకుండా చాలాచోట్ల జగనన్న కాలనీలు ఊరికి దూరంగా ఉండటంతోపాటు ఇళ్ల నిర్మాణాలకు అనుకూలంగా లేని పరిస్థితి ఉంది. దీంతో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారులు పెద్దగా ముందుకురాని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఒకవైపు అయితే, ఆర్థిక భారం మరో ప్రధాన సమస్యగా లబ్ధిదారులకు మారింది.
ప్రభుత్వ సాయం గోరంత.. నిర్మాణ ఖర్చు కొండంత
ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న సాయం కేవలం రూ.లక్షా 80 వేలు మాత్రమే. ఇసుక, సిమెంట్‌, ఐరన్‌, కంకర, నిర్మాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. రెండు గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే తక్కువగా లెక్కించినా రూ.ఆరు లక్షలకుపైగా ఖర్చవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము పునాదుల వరకూ కూడా రావడం లేదు. ఇచ్చే సొమ్ము విడతలవారీగా ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి. ఇళ్ల నిర్మాణం చేపడితే ప్రభుత్వం ఇచ్చే సొమ్ముకాకుండా అదనంగా రూ.నాలుగు నుంచి రూ.ఐదు లక్షల సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోంది. అప్పు చేసి ఇళ్ల నిర్మాణం చేపడితే తీర్చే పరిస్థితి లేకపోవడంతో లబ్దిదారులు ముందుకు రావడం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా సాయం పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అప్పు చేసి ఇల్లు కడితే వడ్డీభారం మోయలేమని, అప్పుడు కట్టిన ఇల్లు సైతం అమ్ముకోవాల్సి వస్తుందని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇళ్ల నిర్మాణం చేపట్టకపోతే పట్టా రద్దు చేస్తామని అనేకచోట్ల లబ్ధిదారులను హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుంటున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. అయినప్పటికీ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఉత్సాహం చూపడం లేదు. తొలివిడతగా నిర్ధేశించుకున్న లక్షకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తవ్వాలంటే ఇప్పట్లో అయ్యే పరిస్థితి కన్పించడం లేదు. ప్రభుత్వం సాయం పెంచడంతోపాటు జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తే కొంతలో కొంత లబ్ధిదారులు ముందుకొచ్చే పరిస్థితి ఉంటుంది.