Dec 05,2022 23:56

మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ప్రజాశక్తి-యంత్రాంగం
జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ ఆధ్వర్యాన పలుచోట్ల సోమవారం నిరసన తెలిపారు.
పెందుర్తి: టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఎప్పుడు ఇస్తారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. జివిఎంసి జోన్‌ -8 కార్యాలయం వద్ద సోమవారం టిడ్కో లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై జోనల్‌ కమిషనర్‌ మల్లయ్య నాయుడుకు వినతిపత్రం సమర్పించారు. పెందుర్తి ప్రాంతంలోని టిడ్కో ఇళ్ల పరిస్థితుల గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్‌రెడ్డి టిడ్కో ఇళ్లను మరింత నాణ్యతతో నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మూడున్నరేళ్లు అయినా నేటికీ లబ్ధిదారులకు అందించలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను కూడా అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. సిపిఐ ఆందోళన చేపట్టాక వాలంటీర్లను లబ్ధిదారుల ఇళ్లకు పంపించి మభ్య పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ డొల్లతనాన్ని, మోసకారితనాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్‌.శ్రీనివాసరావు, సమితి సభ్యులు వై.రాంబాబు, పార్టీ నాయకులు రాము, రమణ, మల్లేష్‌, రజిని, అన్నపూర్ణ, జగన్‌ పాల్గొన్నారు.
పిఎం.పాలెం: జివిఎంసి మధురవాడ జోనల్‌ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ఎస్‌కె.రెహమాన్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో 34 లక్షలు మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన జగనన్న కాలనీల్లో ఇప్పటికీ చాలా చోట్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదని తెలిపారు. ఇంటి నిర్మాణ ఖర్చులు బాగా పెరగడం, ప్రభుత్వం ఇస్తున్న 250 కేజీల ఉక్కు, 90 బస్తాలు సిమెంట్‌, ఇటుక సరిపోవని, కనీసం 1500 కేజీల ఉక్కు, 300 సిమెంట్‌, నాలుగు వేలు ఇటుకు అవసరం అవుతుందని తెలిపారు. నిపుణుల అంచనా ప్రకారం ఇంటి నిర్మాణానికి రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.80 లక్షలు చాలక నిర్మాణాలు ప్రారంభం కాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క లబ్ధిదారునికి రూ.5 లక్షలు ఉచితంగా సహాయం చెయ్యాలని, ఇప్పటికే పూర్తి చేసిన టిడ్కో ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు స్వాధీనం చెయ్యాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వి.సత్యనారాయణ, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎ.దేవుడమ్మ, కె.లక్ష్మణరావు, సిహెచ్‌.కాసుబాబు, ఇ.అప్పలరాజు, ఎస్‌కె.మస్తాన్‌బి తదితరులు పాల్గొన్నారు.
గాజువాక : గాజువాక జోనల్‌ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ కార్పొరేటర్‌ స్టాలిన్‌ మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు టిడ్కో ఇళ్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. ధర్నా అనంతరం గాజువాక జోనల్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.
భీమునిపట్నం : వైసిపి ప్రభుత్వం ప్రారంభించిన అందరికీ ఇళ్లు పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి రూ.5 లక్షలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ భీమిలి ఏరియా సమితి ఆధ్వర్యాన సోమవారం జివిఎంసి ఒకటో జోన్‌ కమిషనర్‌ ఎస్‌.వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఇంటి నిర్మాణ వ్యయం పెరగడం వల్ల ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలు చాలదని పేర్కొన్నారు. టిడ్కో గృహాలను సత్వరమే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సిపిఐ నాయకులు కానూరి రాంబాబు, టి.సోమరాజు, నూలు ఆదినారాయణ, శ్యామ్‌ సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.