Nov 01,2023 22:28

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌

ప్రజాశక్తి - చిలమత్తూరు : చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ పరిధిలోని 805 సర్వే నెంబర్‌ జగనన్న లే అవుట్‌ లో ఇల్లు లేని నిరుపేదలు వేసుకున్న గుడిసెలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 44 రోజులుగా ఇల్లు లేని నిరుపేదలు ఆందోళన చేస్తున్నా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిసెలు వేసుకున్న వారందరూ పేదవాళ్లని ఈ విషయాన్ని ప్రభుత్వమే గుర్తించిందని చెప్పారు. దీనిని అధికారులు విస్మరిస్తున్నారని విమర్శించారు. న్యాయంగా అయితే లబ్ధిదారులుగా గుర్తించిన వారికి 90 రోజులలో పట్టాలు ఇవ్వాలని అయితే ఉద్దేశ్య పూర్వకంగానే వివాదాస్పన స్థలంలో ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నారని అన్నారు. గత మూడున్నర సంవత్సరాలుగా ఆ భూమి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా మరోచోట పట్టాలు ఇవ్వాల్సిన అధికారులు భూమి లేదని కాలక్షేపం చేశారని అన్నారు ఎలాంటి వివాదం లేని 805 సర్వే నెంబర్‌లోని జగన్న లేఅవుట్‌లో స్థలాన్ని గుర్తిస్తే పట్టాలు ఇవ్వడానికి తహశీల్దార్‌కు చేతులు రావడం లేదని అన్నారు. తక్షణమే నివాసయోగ్యమైన భూమిలో గుడిసెలు వేసుకున్న చోట పట్టాలు మంజూరు చేసి గృహాలు కట్టించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇఎస్‌ . వెంకటేష్‌, ప్రవీణ్‌ కుమార్‌ వెంకటేష్‌, లక్ష్మీనారాయణ, రామచంద్ర, ఇళ్ల స్థలాల పోరాట కమిటీ నాయకులు చందు, సదాశివరెడ్డి, రహంతుల్లా, రియాజ్‌, చరణ్‌, మనిస్వామి, నరసింహప్ప తదితరులు పాల్గొన్నారు.