
ప్రజాశక్తి- చిలమత్తూరు : ప్రభుత్వం అర్హులకు 4 ఏళ్లుగా ఇళ్లపట్టాలు ఇవ్వక పోవడంతో జగనన్న లే అవుట్‌లో పేదలు వేసుకున్న గుడిసెలకు నిప్పుపెట్టి పైశాచిక ఆనందం పొందడం దారుణమని ఒపిడిఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పేదలు సర్వేనెంబర్ 805 లో వేసుకున్న గుడిసెలను తహశీల్దార్ ఆదేశాల మేరకు జెసిబిలతో తొగిలించి ఆ తర్వత వాటిని నిప్పు పెట్టిన నేపథ్యంలో నాయకులు సోమవారం ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఈ మేరకు ఒపిడిఆర్ శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా నాయకులు సిద్దారెడ్డి, కార్మిక సంఘం నాయకులు రవి, జమల్ తదితరులు మాట్లాడుతూ తహశీల్దార్ తీరును తప్పుపట్టారు. ఒక వేళ ప్రభుత్వభూమిలో పేదలు గుడిసెలు వేసుకున్నారంటే తీసెయ్యమని కోరుతూ ముందస్తు నోటీసులు ఇవ్వాలన్నారు. చట్ట ప్రకారం వారు తీసెయ్యకపోతే రెవెన్యూ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయబద్దంగా అర్హులుగా ప్రభుత్వం గుర్తించిన పేదలే ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న లే అవుట్‌లో గుడిసెలు వేసుకుంటే ఇంత పైశాచికంగా ప్రవర్తించడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. పేదలు గుడిసెలు వేసుకున్న 805 సర్వే నెంబర్ జగనన్న లేఅవుట్ లోనే పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం జిల్లా అధ్యక్షుడు ఫిరంగి ప్రవీణ్‌కుమార్, రామచంద్ర, లక్ష్మి నారాయణ, ఇళ్ల స్థలాల పోరాట కమిటీ సభ్యులు చందు, సాదాశివరెడ్డి, రహమతుల్లా, నరసింహ, మణి స్వామి, వేణు రాయల్, నాగరాజు, యస్మిన్ తాజ్, అలివేలమ్మ, తదితరులు పాల్గొన్నారు.