Oct 29,2023 21:44

పేదల గుడిసెల వద్ద మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - చిలమత్తూరు : మండలంలోని 805 సర్వేనెంబర్‌ జగనన్న లే అవుట్‌ లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరుకు పోరాటం కొనసాగుతుందని సిఐటియు జిల్లా నాయకులు రమేష్‌ డిమాండ్‌ చేశారు. పేదలు గుడిసెలు వేసుకొని ఆదివారానికి 41 రోజులు అయిన సందర్బంగా నాయకులు గుడిసెలను సందర్శించారు. పేదలు ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చిన్నపాటి ఇళ్లలో రెండు మూడు కుటుంబాలు ఉంటాయన్నారు. అలాగే అద్దె ఇళ్లలో ఉంటూ బాడుగలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం లబ్దిదారులను గుర్తించి పట్టాలు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవాడం దారుణమన్నారు. వివాదస్పద భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం వెనుక అంతర్యం ఏమిటో అంతుపట్టడం లేదన్నారు. ఎలాంటి వివాదం లేకుండా పేదలకు ఇంటి నిర్మాణం కు అనువైన 805 సర్వే నెంబర్‌లోనే కలెక్టర్‌ ఇచ్చిన హామీని అమలు చేసి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమం లో సిపిఎం నాయకులు వెంకటేష్‌, లక్ష్మినారాయణ, రామచంద్ర, సదాశివరెడ్డి, రహమతుల్లా, శివ, యుఎల్‌ నరసింహ, వేణు పాల్గొన్నారు.