Sep 05,2023 23:21

తుళ్లూరు సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న నెక్కల్లు గ్రామస్తులు

ప్రజాశక్తి - తుళ్లూరు : ప్రభుత్వ చెరువు పోరంబోకు స్థలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని, వాటిని స్వచ్ఛందంగా తొలగించకుంటే మేమే తొలగిస్తామని రాజధాని ప్రాంతం, నెక్కల్లుకు చెందిన కొంతమందికి సిఆర్‌డిఎ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో నోటీసులు అందుకున్న వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంగళవారం తుళ్లూరు సిఆర్‌డిఎ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందేళ్ల నుంచి నాలుగు తరాల వాళ్ళం చెరువు స్థలంలో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నాంమని, గేదెలు, మేకలు, గొర్రెలు పెంచుకుంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. తమతోపాటు బిసి, ఎస్‌టి, ముస్లిమ్‌ మైనారిటీలు కూడా ఇళ్లు నిర్మించుకొని ఇక్కడే ఉంటున్నారని చెప్పారు. గ్రామ పంచాయతీకి అన్ని రకాల పన్నులు కడుతున్నామని, ఇప్పుడు ఆక్రమణలు అంటూ ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని సర్వే నెంబర్‌ 88 లో 23 ఎకరాల 74 సెంట్లు విస్తీర్ణంలో 60 కుటుంబాలు ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. గ్రామపంచాయతీకి ఇంటి, కుళాయి పన్నులు కడుతున్నారు. కరెంట్‌ బిల్లులు చెల్లిస్తున్నారు. ఇక్కడ 2018లో సిఆర్‌డిఎ నిధులతో రోడ్లు, డ్రెయినేజీ కూడా నిర్మించారు. ఇప్పుడు హఠాత్తుగా ప్రభుత్వానికి చెందిన చెరువు పోరంబోకు స్థలంలో అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారంటూ సిఆర్‌డిఎ అధికారులు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని వారు మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఏడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొనడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందీ లేదని భావించి రాజధానిలో నిర్మించిన టిడ్కో గృహాలకు కూడా దరఖాస్తు చేసుకోలేదని, ఏళ్ల తరబడి ఉంటున్న తమకు అన్యాయం చేయవద్దని వేడుకున్నారు. ఈ మేరకు సిఆర్‌డిఎ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.