ప్రజాశక్తి - బట్టిప్రోలు
స్థానిక ఎనిమిదవ వార్డులో మురుగు నీరు బయటికి వెళ్లే మార్గం లేదు. గృహాలను మురుగు నీరు చుట్టుముట్టటంతో ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యను గ్రామస్తులు గడప గడపకు పర్యటిస్తున్న మంత్రి నాగార్జున దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, రేపల్లె ఆర్డిఓ జగన్నాథం పార్థసారధి విడివిడిగా సమస్యను పరిశీలించారు. గృహాలను చుట్టుముట్టిన మురుగునీటిని చూశారు. వీటిని బయటకు తరలించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి తగిన చర్యలు చేపట్టాలని మండల అధికారులకు సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు మురుగునీరు గృహాలను చుట్టుముట్టడంతో కొంతమంది ఇళ్లకు తాళాలు వేసి బయట అద్దెకు వెళ్లిన వైనం కూడా వెలుగు చూసింది. ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా డ్రైన్ నిర్మాణం చేపట్టేందుకు మండలానికి రూ.60లక్షలు నిధులు మంజూరు చేసిందని, వాటితో మురుగు నీటిని బయటికి మళ్ళించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలతో పాటు పక్కనే ఉన్న వెల్లటూరు ఛానల్ కాలువ కూడా ఉదృతంగా ప్రవహిస్తుండడంతో కాలనీకి ఊట నీరు దిగి ముంపుకు కారణమవుతుందని అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా గృహాలను చుట్టుముట్టిన వర్షపు నీటితో దోమలు వృద్ది చెంది చిన్నారులకు విష జ్వరాలు సంక్రమిస్తున్నాయని గ్రామస్తులు వాపోయారు. ప్రస్తుతం నీటి నిల్వ లేకుండా తక్షణ చర్యలు చేపడతామని గ్రామస్తులకు అధికారులు హామీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దారా రవికిరణ్మయి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ వేణుగోపాల్, పిఆర్ ఏఈ రామచంద్రరావు, తహశీల్దారు డి వెంకటేశ్వరరావు, ఎంపీడీవో గుమ్మ చంద్రశేఖర్, ఈవో పిఆర్ డి ఊహారాణి, కార్యదర్శి కోట శ్రీనివాసరావు, నాయకులు చెన్నయ్య, భూషణరావు ఉన్నారు.










