
ప్రజాశక్తి - మంగళగిరి : రత్నాల చెరువులోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లేసుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు డిమాండ్ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య పాదయా మంగళవారం పట్టణంలో పర్యటించింది. రత్నాల చెరువులోని సింహాద్రి శివారెడ్డి భవనం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. పాత మంగళగిరి, దిగుడుబావి సెంటర్, ఎన్‌సిసి రోడ్డు పలు ప్రాంతాల్లో పాదయాత్రకు స్థానికులు స్వాగతం పలికి తమ సమస్యలపై వినతి పత్రాలిచ్చారు.
నాయీబ్రాహ్మణ్ భవనాన్ని నిర్మించాలని, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌కు నిధులు కేటాయించడంతోపాటు అన్ని సొసైటీలకు రుణాలివ్వాలని విన్నవించారు. వృత్తిదారులకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇస్తున్న సాయాన్ని బార్బర్ షాపులు యజమానులకే కాకుండా షాపుల్లో పనిచేసే వారికీ వర్తింపజేయాలన్నారు. 21వ వార్డు సూర్యనారాయణ నగర్ ఏర్పడి 40 ఏళ్లయినా ఇప్పటికీ ఇళ్ల పట్టాలు లేవని పలువురు పాదయాత్ర బృందానికి అర్జీలిచ్చారు. తమకు ఎస్సీ కుల ధ్రువపత్రం ఇవ్వడం లేదని మాస్టిన్ సామాజిక తరగతి వారు వాపోయారు. 21వ వార్డు కట్ట పక్కన ఉన్న పెద్ద కాల్వ పారుదలు లేక మురుగు పేరుకుపోయిందని, వానొస్తే ఎస్టీ కాలనీ, ఇతర ప్రాంతాలు ముంపునకు గురువుతున్నాయని, డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని కోరారు. శ్రామిక నగర్‌లో ఇళ్లేసుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇవ్వాలన్నారు. 21వ వార్డు సూర్యనారాయణ నగర్‌లో ఎస్టీ యానాదుల కట్టపైన 50 ఏళ్లుగా నివాసం ఉంటున్నా మౌలిక వసతులు లేవని చెప్పారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. రోడ్డు విస్తరణ పేరుతో 150 కుటుంబాల ఇళ్లను తొలగించాలని అధికారులు హెచ్చరిస్తున్నారని వాపోయారు. తమకు ప్రత్యామ్నాయంగా ఉన్నచోటే ఇళ్లు, పట్టాలు ఇవ్వాలని కోరారు. ఎస్టీలకు శ్మశాన స్థలం కేటాయించాలన్నారు. పాత మంగళగిరి 23వ వార్డులో దళితులు శ్మశాన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ అన్ని అంశాలపై పాదయాత్ర బృందానికి ప్రజలు వినతిపత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా బృందం చేనేత మగ్గాల షెడ్లను సందర్శించింది. చాలీసాలను వేతనాలతో జీవన పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని అక్కడివారు తెలిపారు. టిడ్కో గృహ సముదాయంలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేదని, తాగునీరు కూడా కొనుక్కుని తాగాల్సి రావడంతో అవస్థ పడుతున్నారని స్థానికులు వినతిపత్రం ఇచ్చారు. రాజీవ్ గృహకల్పలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మురుగునీరు పారుదల లేదని చెప్పారు. దోమలు పెరిగి అనారోగ్యానికి గురవుతున్నామని అర్జీనిచ్చారు. ఇళ్ల పట్టాల కోసం పావురాలు కాలనీ ప్రజలు వినతి పత్రం ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలేసి నివాళులర్పించారు.
రెండు ఫ్యాన్లు, రెండు లైట్లు - బిల్లు రూ.2657
తమకు కరెంటు బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయని 21వ వార్డు ప్రజలు పాదయాత్ర బృందం ఎదుట వాపోయారు. తమకు రెండు ఫ్యాన్లు, రెండు లైట్లే ఉన్నా బిల్లు మాత్రం రూ.2,657 వచ్చిందంటూ బిల్లులు చూపారు. ఎస్సీ సామాజిక తరగతికి చెందిన సిద్ధయ్య గత నెలలో 205 యూనిట్ల విద్యుత్ వాడినట్లు చూపి రూ.1283 బిల్లు, ఇతర ఛార్జీలు రూ.1374 కలిపి మొత్తం రూ.2,657 చెల్లించాలన్నారని, చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేస్తామనడంతో చెల్లించానని వివరించారు. తమ ఇంట్లో అద్దెకుంటే వారికి రూ.2022 బిల్లు వచ్చినట్లు మరొకరు చూపారు.
ఈ సంద్భంగా రామారావు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ఈనెల 16న స్థానిక కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగే మహాధర్నాకు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. విద్యుత్ బిల్లుల అంశాన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు, ఎం.రవి, ఎస్‌ఎస్ చెంగయ్య, పట్టణ కార్యదర్శి వై.కమలాకర్, సీనియర్ నాయకులు జెవి రాఘవులు, జొన్న శివశంకరరావు, నాయకులు బి.శ్రీనివాసరావు, ఎం.పకీరయ్య, పి.బాలకృష్ణ, డి.వెంకటరెడ్డి, బి.వెంకటేశ్వరరావు, జె.బాలరాజు, ఎం.భాగ్యరాజు, వి.వెంకటేశ్వరరావు, బి.కోటేశ్వరి, మేరమ్మ, ఎం.బాలాజీ, ఎం.చలపతిరావు, జె.శివభావన్నారాయాణ, టి.శ్రీరాములు, కె.ఏడుకొండలు, ఇ.కాటమరాజు, జి.దుర్గాప్రసాద్, ఎస్.కోటేశ్వరరావు, కె.ప్రకాశరావు, జి.నాగేశ్వరరావు, ఎం.రాజముని, ప్రజానాట్య మండలి కళాకారులు డి.శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.