
పిల్లలు ఇంటికే పరిమితమై దాదాపు ఏడాదైంది. స్కూలు రోజులకు, సెలవు రోజులకు మధ్య తేడా లేకుండా పోయింది. ఆన్‌లైన్ క్లాసులు నడుస్తూనే ఉన్నాయి. హోంవర్కులు సాగుతూనే ఉన్నాయి. ఈ కొత్త వరవడికి అలవాటు పడడం ఇంకా కొత్తగానే ఉంది. ప్రస్తుతం వేసవి సెలవులే అయినా ఆ సందడి ఎక్కడా కనపడడం లేదు. వరుసగా రెండో ఏడాది పిల్లల ఆటవిడుపును కోవిడ్ హరించివేసింది. మరి పిల్లలను ఇంటి పరిధిలోనే, ఉన్న పరిమితుల్లోనే సంతోషపెట్టాలి. ఎంతో కొంత పిల్లల ప్రపంచాన్ని ప్రత్యేకంగా, ప్రయత్నపూర్వకంగా సృష్టించాలి.

ఎప్పటిలాగానే ఇప్పుడూ వేసవి సెలవులు అయితే, ఏ అడ్డంకీ లేకుండా ఉంటే - ఈపాటికి ఏం చేస్తూ ఉంటారు మీరు? ఒక్కో కుటుంబానికి ఒక్కో ప్రణాళిక ఉంటుంది. విహారయాత్రలకు వెళ్లటం, బంధుమిత్రుల ఊళ్లను, ఇళ్ళను సందర్శించటం, పెళ్లిళ్లకు హాజరు కావడం, అమ్మమ్మ నాన్నమ్మ ఊళ్లకు పిల్లలను తీసుకెళ్లటం వగైరా వగైరా ఉంటాయి. ఇంకా సమ్మర్ క్యాంపుల్లో చేర్చడాలూ, ఆసక్తి ఉన్న ఆటలూ పాటలూ చిత్రలేఖనాలు లాంటివి నేర్పించటాలూ ఉంటాయి. థియేటర్లో సినిమాలూ, ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్ రైడింగులూ ఉండనే ఉంటాయి. కోవిడ్ కారణంగా ఇప్పుడు అవేమీ లేవు. మరి ఉన్న పరిస్థితుల్లో అలాంటి సందడినే సృష్టించటం ఎలా? పిల్లల మనసున ఆనంద హరివిల్లులు వెల్లివిరియటం ఎలా ?
వాతావరణం సెలవుల మాదిరిగా ఉండడం వల్ల ఇప్పుడు చాలా ఇళ్లల్లో దినచర్య ఆలస్యంగా మొదలవుతుంది. స్నానపానాలు లేకుండానే పిల్లలు ఆన్‌లైన్ క్లాసుల ముందు కూచుంటున్నారు. తిండివేళలు తప్పిపోతున్నాయి. ఇది మంచిది కాదు. ఈ అలవాటుకు వెంటనే చెల్లుచీటీ రాయాలి. స్కూలు, కాలేజీ రోజుల మాదిరిగానే రోజు ప్రారంభం కావాలి. అవసరమైతే ఇంకా ముందుగానే లేవాలి. పిల్లలను తీసుకొని మనుషుల రద్దీ లేని బహిరంగ ప్రదేశాలకు వెళ్లాలి. షటిలో, సైక్లిలింగో, రన్నింగో, మరొకటో అలవాటుగా పెట్టుకోవాలి. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే ... ఏదొక రూపాన వ్యాయామం సాగించాలి. అప్పుడు రోజు చురుగ్గా మొదలవుతుంది. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
సినిమాలూ ... యూట్యూబ్ పాఠాలూ ...

పిల్లలకు ఇష్టమైన సినిమాలు ఏమిటో వాళ్లనే అడగండి. ఒక లిస్టు రాయమనండి. మీరు వారికి పరిచయం చేయాలనుకుంటున్న సినిమాలు ఏమన్నా ఉంటే- వాటిని జోడించండి. వారానికి ఒకటో, రెండో వీలును బట్టి ఆ సినిమాలు చూడండి. పిల్లల లిస్టుతోనే ముందు ప్రారంభించండి. సినిమా పూర్తయ్యాక దాని గురించి చర్చించండి. ఎక్కడ ఏ పాత్ర ఏ సంఘటన ఎందుకు నచ్చిందో, ఎందుకు నచ్చలేదో మాట్లాడనీయండి. మనం బయట పరిచయం చేయలేని ప్రవర్తనలూ, ఉద్వేగాలూ సినిమా పాత్రల్లో తారసపడతాయి. అవి మంచివి కావొచ్చు. చెడ్డవి కావొచ్చు. పిల్లలకు తెలియనీయండి. వాటిని ఎలా అర్థం చేసుకున్నారో చెప్పనీయండి. తరువాత మీ జాబితాలోని సినిమా గురించి చెప్పండి. చూపించండి. మళ్లీ మాట్లాడనీయండి. కొన్ని ఉత్తమ అభిరుచులను పరిచయం చేయటానికి, కళాత్మక, సృజనాత్మక విలువల గురించి వివరించటానికి సినిమా ఒక గొప్ప సాధనం. అవకాశం.
అలాగే యూట్యూట్ ఛానెళ్లలో ఇప్పుడు బోలెడు మంచి సమాచారం లభిస్తుంది. ఎంతోమంది విజేతల, గొప్పవాళ్ల ఇంటర్వ్యూలు దొరుకుతున్నాయి. వారి మాటల్లోనే నేరుగా వినొచ్చు. గతంలో లేని అవకాశం. ఇప్పుడు సదావకాశం. వారి మాటలను పరిచయం చేయండి. కష్టపడి ఎదిగినవాళ్లు, తమకు తాముగా ఉన్నతమైన బాటను నిర్మించుకున్నవాళ్లు, కష్టాలను ఎదురొడ్డి ఇష్టాలను సాధించుకున్నవాళ్లు, ఆత్మవిశ్వాసంతో ఆటుపోట్లను అధిగమించినవాళ్లు .. ఎంతోమంది మామూలు మనుషులు మహాశక్తులుగా ఎదిగిన వాళ్లు ఉన్నారు. సమాజం గురించి ఆలోచించినవాళ్లు, సామాజిక మార్పు కోసం ప్రయత్నించినవాళ్లూ ఉన్నారు. వారిని పరిచయం చేయండి. మనం చెప్పని విషయాలు అనేకం తెలుస్తాయి. మనసుకు బలంగా తాకుతాయి. స్ఫూర్తిపాఠాలుగా దోహదపడతాయి.
పిల్లలు ప్రతిరోజూ ఏమైనా కొత్త విషయాలు తెలుసుకునేలా చేయొచ్చు. ఏదొక కొత్త భాష నేర్చుకోవడం, బొమ్మలు గీయడం, కథలు రాయడం, సంగీతం నేర్చుకోవడం, మొక్కలు నాటి వాటిని సంరక్షించటం .. ఇలా పిల్లల ఆసక్తిని బట్టి ఎంచుకోనీయండి. వాటిని సాధించేందుకు, సాధన చేసేందుకు అవసరమైన సహకారం అందించండి.
వంట .. ఓ ప్రయోగం !

ఉదయం శరీర శ్రమ ముగిశాక, స్నానమయ్యాక ఆన్‌లైన్ క్లాసులు ఉంటే పిల్లలు హాజరవ్వొచ్చు. లేకుంటే ఇంటి పనుల్లో సహాయపడేలా చేయొచ్చు. పిల్లల వయసును బట్టి పనిని కేటాయించొచ్చు. కూరగాయలు సిద్ధం చేయడం, కోయడం; జ్యూస్ తీయడం, టిఫిన్ల తయారీలో సహకారం ... ఇలా ఏమైనా చేయొచ్చు. ''ప్రపంచంలో ఇప్పటివరకూ జరిగిన వాటిలో అత్యద్భుత ఆవిష్కరణ .. వంట'' అన్నాడు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్. ఆయన గొప్ప కుక్ కూడా! నిజమే కదా? రుచికరమైన తిండి తరువాతనే, మిగిలిన ఏ సౌకర్యమైనా. ''కూటికోసమే కోటిపాట్లు'' అన్న పెద్దవాళ్ల మాటలోని ఆంతర్యం కూడా ఇదే! కాబట్టి- అబ్బాయి అయినా, అమ్మాయి అయినా కచ్చితంగా వంట చేయడం నేర్చుకోవాలి. సులభంగా చేసుకునే వంటలు ముందు నేర్పించవొచ్చు. వండినవారికి ఆహారం విలువ బాగా తెలుస్తుంది. దానిలోని కష్టమూ, ఇష్టమూ అనుభవంలోకి వస్తాయి. అలాంటప్పుడు ఆహారాన్ని ఆస్వాదించే పద్ధతిలోనూ మార్పు రావొచ్చు.
కొత్త కొత్త వంటల గురించి చాలా వివరమైన సమాచారం యూట్యూటుల్లో బోలెడంత దొరుకుతుంది. ఇప్పుడు అప్పుడప్పుడైనా బయటకెళ్లి తినటం అనే అలవాటుకు బ్రేకు పడింది కాబట్టి- బయట తినే ఆహారాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవటానికి శ్రీకారం చుట్టేయొచ్చు. అయితే, ఆ పనిని అమ్మో, నాన్నో గట్టుగా చేసి, చక్కా వండించేయడం కాక- ఇంటిల్లిపాదీ ఉమ్మడి ప్రయోగంగా మార్చేయండి! పిల్లలు చదివేది ఏ సబ్జెక్టు అయినా- వంటిల్లు ఓ అద్భుతమైన ప్రయోగశాల అని వాళ్లు వంట చేస్తేనే తెలుస్తుంది. ఏఏ దినుసులు కలిస్తే ఏఏ రుచి వస్తుందో, ఎంతెంత మోతాదులో వేస్తే ఇంతింత రుచి వస్తుందో ప్రాక్టికల్‌గా తెలుస్తుంది.
పిల్లల ఆసక్తి ఏమిటో స్వయంగా వాళ్లనే అడిగి, వాళ్లనే నేరుగా తయారీలోకి దించండి. ''సొంత వంటను మించిన మహా వంట ప్రపంచంలో మరొకటి లేద''న్నాడు ఓ పాక ప్రవీణుడు. అంచేత పిల్లలను వంటింటి ప్రవీణులను చేయటానికి ఏమాత్రం వెనకంజ వేయకండి. తాము కష్టపడి చేసిన వంటను ప్రతి ఒక్కరూ ఇష్టపడి తినాలని ప్రతి కుక్కూ భావిస్తారు. పిల్లలు చేసిన వంటను మరీ మరీ మెచ్చుకుంటూ తినండి. బాగుంటే మహా బాగా మెచ్చండి. ఎక్కడైనా ఏదైనా కొరత అనిపిస్తే - ఆ మాటను స్వీకరించేలాగ స్వీటుగా చెప్పండి.
పత్రికలూ పుస్తకాలూ ...

పత్రికను చదవడం అలవాటు చేయండి. ప్రపంచం తెలుస్తుంది. పరిసరాలు తెలుస్తాయి. పరిణామాలు అర్థమవుతాయి. ఏ పరిణామం ఎందుకు జరిగింది? దాని వెనక ఏముంది? దాని పర్యవసానం ఏముంటుంది? మాటల్లో మాటగా చర్చకు పెట్టండి. పిల్లలు చెప్పేది పూర్తిగా వినండి. ఆమేరకు మెచ్చుకుంటూనే మీరు చెప్పాల్సింది చెప్పండి. దేశం, పరిపాలన, పార్లమెంటు, అసెంబ్లీ, ప్రధాని, ముఖ్యమంత్రి, ధరలు, కారణాలు, పంటలు, రైతులు, వానలు, వరదలు, కష్టాలూ నష్టాలూ ... ఇలా అన్నీ తెలియనివ్వండి. వరసపెట్టి చెప్పేయకండి. వార్తల్లో వచ్చిందే చెప్పండి. చెప్పటం కన్నా చర్చించండి. వార్తాపత్రిక అంటే జరుగుతున్న చరిత్రకు అద్దం. ప్రతి ఒక్కరికీ చరిత్ర తెలియాలి. ప్రతి ఘటనకు వెనకా ముందూ ఉన్న చరిత్ర తెలియాలి. పిల్లలు మెడిసిన్ చదూతున్నారనో, ఇంజినీరింగ్‌లోకి వెళతారనో రోజువారీ పరిణామాలను వదిలేయకండి. ఏం చదివినా, ఎలా స్థిరపడ్డా వర్తమానంలోనే బతకాలి. వార్తల చుట్టూ ఉన్న వాస్తవంలోనే బతకాలి. కాబట్టి- మన రాజ్యాంగం గురించి తెలియాలి. పాలనావ్యవస్థ గురించి తెలియాలి. చట్టసభలు, అధికార యంత్రాంగం, కోర్టులు, ప్రచార సాధనాలూ ... ఇలా అన్నిటి గురించి అవగాహన ఏర్పడాలి. పిల్లలుగా ఉన్నప్పుడే పునాది వేయండి. దానికి ఈ కరోనా కాలం ఒక మంచి అవకాశం.
అలాగే పాఠ్యేతర పుస్తకాలను పరిచయం చేయండి. కథలూ, కబుర్లూ, విజ్ఞాన సంగతులూ, జీవిత చరిత్రలూ ... చదవనీయండి. కొంత చదివాక, కొన్నాళ్లు చదివాక వారి వారి ఆసక్తిని బట్టి అభిరుచి రూపుదిద్దుకుంటుంది. ఏ అంశంపై ఆసక్తి ఉంటే ఆ పుస్తకాలు చదవనీయండి. చర్చించండి. అర్థమైన విషయాలను తమ్ముడికో చెల్లికో చెప్పమనండి. సంక్షిప్తంగా రాయమనండి. దీనివల్ల చదవడంలో, చెప్పటంలో, రాయడంలో నైపుణ్యం వస్తుంది. అవగాహన పెరుగుతుంది.
పలకరింపులూ పరామర్శలూ ...

లాక్‌డౌన్,కోవిడ్ జాగ్రత్తల కారణంగా ఇప్పుడు బంధుమిత్రులు కలిసే అవకాశం లేదు. కాబట్టి మనం ఫోను ద్వారా వారితో మాట్లాడుతూ ఉంటాం. అలాగే పిల్లల స్నేహితులతో వారిని మాట్లాడనీయండి. పలకరింపులు, పరామర్శలూ మానవ సంబంధాలను బలోపేతం చేస్తాయి. స్నేహితులతో మాట్లాడుతున్నారని విసుక్కోవొద్దు. ఫోను అసలు తీయనే తీయొద్దని తీవ్ర ఆంక్షలు విధించొద్దు. సమయం దుర్వినియోగం అవుతుంది అనుకుంటే జోక్యం చేసుకొండి. మీ పర్యవేక్షణలో మాట్లాడేలా జాగ్రత్త వహించండి.
అలాగే దూరంలో ఉన్న బంధువులతో, కుటుంబ సభ్యులతో పిల్లలను మాట్లాడేలా ప్రోత్సహించండి. కరోనా కట్టడి మధ్య ఉండిపోయామన్న బాధ, భావన ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు. యోగక్షేమాలు తెలుసుకోవటానికి, పంచుకోవటానికి వీలైన బలమైన కమ్యూనికేషన్ల వ్యవస్థ ఉంది నేడు. అందరం అందుబాట్లో కలిసి మెలసి ఉన్నామనే భావన ఉండనీయండి. నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి, పలకరించుకోవటానికి మొబైల్ ఫోను ఒక అద్భుత సాధనం. దానిని వాడనీయండి. మెదడుకు పదును పెట్టే ఆటలు, అభిరుచులూ ఎప్పుడూ మేలు చేస్తాయి. చదరంగం, పజిల్స్, మాటకట్టు, సుడోకు వంటివి పిల్లలను చురుగ్గా ఉంచుతాయి. వాటిని పరిచయం చేయండి. ప్రోత్సహించండి. కోవిడ్ కాలంలో ఆన్‌లైన్ లావాదేవీలు బాగా పెరిగాయి. ఈ- చెల్లింపుల గురించి పిల్లలకు చెప్పాలి. ఆన్‌లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి. వాటి పట్లా అప్రమత్తులను చేయాలి. పిల్లలకు ఏ విషయం చెప్పాలన్నా- పత్రికల్లో వచ్చే వార్తలను, సినిమాల్లోని సన్నివేశాలను ఆలంబనగా చేసుకొని చెబితే సులభంగా స్వీకరిస్తారు. అర్థం చేసుకుంటారు.
కోవిడ్ కాలం మనకు చాలా కష్టనష్టాలను తెచ్చిపెట్టింది. ఎంతోమంది ఆత్మీయులను దూరం చేసింది. భయాందోళనలను సృష్టించి, కొనసాగిస్తోంది. దాని పరిధిలోనే, పరిమితుల్లోనే మనం మనలా జీవించాలి. మున్ముందుకు సాగిపోవాలి. ఈ ఆపద కాలంలో తెచ్చిన అప్రమత్తతని, ఆరోగ్య దక్షతనీ కొనసాగించాలి. క్లిష్ట సమయాలు నేర్పే పాఠాలను, పంచే బాధ్యతలను మనం అంది పుచ్చుకోవాలి. మన పిల్లలకూ అందివ్వాలి. ప్రతి ప్రతికూల పరిస్థితిని మానవాళి తరతరాలుగా అధిగమిస్తూనే ఉంది. ఈ వైరస్ కాలం కూడా అంతే! ఈకాలంలో నేర్చుకున్న నైపుణ్యాలే పిల్లలకు గుర్తుండాలి. మీ ఇల్లే ఒక కార్యశాలై ... మీరంతా కార్యశూరులై అనుభవాలతో, ఆనందాలతో వికసించాలి !
మార్కెట్ పాఠం !

అప్పుడప్పుడైనా పిల్లలను మార్కెట్టుకు తీసుకెళ్లండి. దానికి ముందు ఇంటికి, వంటింటికి ఏఏ సరుకులు కావాలో పిల్లల చేతనే లిస్టు రాయించండి. షాపులో ఎలా ఎంచుకోవాలో, నాణ్యతను, ధరను ఎలా లెక్కేయాలో మీ ద్వారా తెలుసుకుంటారు. మీ మటుకు మీరు ఎంచేయకండి. పిల్లలను పాత్రధారులను చేయండి. వాళ్ల అభిప్రాయం కనుక్కొండి. తమకు ఇష్టమైన లేదా అవసరమైన ఏదొక వస్తువును చేతిలోకి తీసుకొని, ధర ఎక్కువగా ఉందనో; నాణ్యత తక్కువగా ఉందనో పిల్లలే దానిని మళ్లీ పక్కకు తీసేశారంటే- వాళ్లకు మన ఇంటి బడ్జెట్, ఆర్థిక సూత్రం అర్థమైనట్టే లెక్క. మామూలుగా చెప్పలేని ఆర్థిక సూత్రాలను మార్కెట్లో చెప్పొచ్చు మరి! రైతు బజారు, సూపరు మార్కెట్టు, మన వీధి చివరి దుకాణం, ఆన్‌లైన్ షాపింగు ... అన్నీ వాళ్లకు తెలియాల్సిందే! జీవితంలో వాళ్లు ఎలా స్థిరపడ్డా ఈ కొనుగోలు బంధం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి- అన్నిటినీ పిల్లల దృష్టి పథంలోకి తీసుకెళ్లండి. ఏది ఎలా మేలో, ఏది ఎలా కాదో ఆచరణలో నేర్చుకుంటారు.
సామాజిక బాధ్యత

కార్పొరేటు స్కూళ్లు, కాలేజీల ఆధిపత్యం మొదలయ్యాక- చదువుల్లో నిలకడ తగ్గి పోటాపోటీ ఆరంభమయ్యాక - పిల్లలకు ప్రాపంచిక పరిజ్ఞానం, సామాజిక చింతన బాగా తగ్గిపోయాయనే విమర్శ ఉంది. పెరుగుతున్న దశలో పిల్లలు సహజంగానే చుట్టూ ఉన్న సమాజం గురించి ఆసక్తికరంగా గమనించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, అలా ఆగి, చూసి, ఆలోచించే వ్యవధే పిల్లలకు లేకుండా పోయింది! సమాజం గురించి తెలియని పిల్లలు సామాజిక సవాళ్లను అర్థం చేసుకోలేరు. వాటిని ఎదుర్కోలేరు. తరచూ మనకు ఆ విషయం అర్థమవుతూనే ఉంటుంది. అందుకనే - పిల్లలకు సామాజిక చింతన అలవాటు చేయండి. సమాజంలోని వ్యత్యాసాల గురించి ఆలోచించనీయండి. సమస్యలన్నీ మీరే ఎదుర్కొని, అవి తెలియని అద్భుత జీవితం పిల్లలకు ఇచ్చేద్దాం అని కలలు కనకండి.
లోటుపాట్లన్నీ తెలియాలి. అప్పుడే ఎదుర్కొనే బలం వస్తుంది. గతేడాది కేరళలో తొమ్మిదో తరగతి చదూతున్న అబ్బాయి - మహిళలు ఎన్ని విధాలుగా శ్రమ పడతారో ఓ బొమ్మ గీశాడు. అది ఆ రాష్ట్ర బడ్జెట్ పుస్తకం కవరు పేజీగా వచ్చింది. ఆ జీవితాన్ని తను తన తల్లి దగ్గర చూశాడు. చుట్టూ ఉన్న మహిళల దినచర్యలో చూశాడు. ఓ పల్లెటూళ్లో తన తండ్రి కష్టాన్ని కళ్లారా చూసిన ఓ రైతు బిడ్డ- ఇంటినుంచే వ్యవసాయ మోటారును ఆన్ చేసే, ఆఫ్ చేసే యంత్రాన్ని కనిపెట్టాడు. రాత్రివేళల్లో పొలాలకు వెళ్లి పాముకాట్లకు బలైన దారుణ విషాదాలు ఆ అబ్బాయిని ఆ ఆవిష్కరణకు ప్రేరేపించాయి. యర్రాప్రగడ సుబ్బారావు అనే శాస్త్రవేత్త చిన్నప్పుడు తన తల్లి చిన్నపాటి అస్వస్థతకు గురై మందులేని కారణంగా మరణిస్తే, తల్లడిల్లాడు. పెద్దయ్యాక అలాంటి మరణాలు లేకుండా మందును కనిపెట్టాడు. ఇలా ఎన్నో !
కష్టకాలంలో తోటివారికి తోడ్పడే ఆలోచన పిల్లల్లో ఏది కలిగినా ప్రోత్సహించండి. వీలైతే సేవకు ప్రోత్సహించండి. అన్యాయం అనుకున్న విషయం మీద ఆవేశం, ఆవేదన కలిగితే కలగనీయండి. మనకెందుకులే అని నీరుగార్చకండి. నిలదీసేలా గొంతు మోగితే మోగనీయండి. పిడికిలి బిగిస్తే బిగనీయండి. అలాంటి సహజ స్పందన చూపేవాళ్లు భవిష్యత్తులో ఆ సమస్యకొక పరిష్కారం కనుక్కోవొచ్చునేమో!
- శాంతిమిత్ర