Jan 31,2021 12:52

రంగురంగుల కలువల నెలవును కనుల నిండుగా చూడాలంటే.. ఏ చెరువు గట్టుకో, సరస్సు ఒడ్డుకో, నదీ తీరానికో వెళ్ళాలి. ఇకపై ఆ అవసరం లేదు. ఇంటి ముంగిట కాస్తంత స్థలం ఉంటే చాలు.. ఇక కలువల కల సాకారమైనట్టే. ఎందుకంటే చక్కగా కుండీల్లో తామర తుండులు, కలువ కొలనులను పెంచుకునేందుకు వీలుగా ఉండేలా నర్సరీ రైతులు అందుబాట్లోకి తెచ్చారు. వర్ణ వయ్యారాల నక్షత్ర తళుకులీనే పంకజాలు (కమలాలు) మనసుకి ఎంతో తుళ్ళింత.. హృదయాలకి ఎంతో పులకింత. ఇంకెందుకాలస్యం మీరూ కలువల కొలనును పెంచేయండి.
    తామరలు ఉదయం పూసి రాత్రివేళల్లో ముడుచుకుంటాయి. కలువలు రాత్రి విచ్చుకుని పగలు మూసుకుపోతాయి. కలువ, తామర సంకరీకరణం ద్వారా తయారుచేసిన వాటర్‌లిల్లీ పువ్వులు రేయింబవళ్లు విచ్చుకునే ఉంటాయి. పైగా ఇవి చిన్న పువ్వులు, చిన్న ఆకులతో ఎంతో రమణీయంగా ఉంటాయి. ఇంకా దట్టమైన సువాసనలూ గుప్పిస్తున్నాయి.. ఈ అధునాతన వాటర్‌లిల్లీలు. వీటికోసం ప్రత్యేకమైన కుండీలూ మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. వాటర్‌లిల్లీ దుంపలు నీటి కుండీల్లో వేస్తే చాలు.. మూడు నెలల్లో వాటి పువ్వులు రంగుల రేఖలతో పలుకరిస్తాయి.
    ఈ సరికొత్త వాటర్‌లిల్లీలు సుగంధ పరిమళాలు గుప్పిస్తూ.. రంగుల్లో నాజూగ్గా కొలువుతీరి, నిత్యం పువ్వులు పూస్తూ అబ్బురపరుస్తున్నాయి. నర్సరీల్లో ఇలాంటి దుంపలు తయారుచేసి, రూ.150 నుంచి రూ.200 వరకూ అమ్ముతున్నారు నిర్వాహకులు. కుండీల్లో రకరకాల దుంపలు వేస్తే అన్నిరకాల వాటర్‌లిల్లీలు చక్కగా విచ్చుకుని, మనోహరంగా అలరిస్తాయి. ఇటీవల కాలంలో ఇంట్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకుని, అందులో ఈ వాటర్‌లిల్లీలను పెంచుకోవడం ఒక పోకడిగా వస్తోంది. ఒకసారి తొడిగిన మొగ్గ వారం రోజుల వరకూ విచ్చుకుని ఉంటుంది. ప్రస్తుతం ఈ కుండీల్లో పూలతోబాటు ఆర్నమెంటల్‌ చేపపిల్లల్ని కూడా కలిపి పెంచడం సంప్రదాయంగా మారింది. దుంపలు అప్పుడప్పుడూ పురుగు పట్టి కుళ్ళిపోతుంటాయి. అలాంటప్పుడు పురుగుల్ని చేపలు తినేస్తాయి. కాబట్టి ప్రతీ రెండు నెలలకోసారి కుండీల్లో నీరు మార్చడం శ్రేయస్కరం. దుంప నుంచి కొత్త పిలకలు వచ్చి పువ్వులు పూస్తుంటాయి. వీటికి సీజన్‌ అంటూ ఏమీ ఉండదు. సంవత్సరం పొడుగునా పువ్వులు పూస్తూనే ఉంటాయి. దుంపలు కాకుండా మార్కెట్లో వీటి విత్తనాలూ అందుబాటులోకి వచ్చాయి. వాటి నుంచి మొలకలు రప్పించడం అనుభవం, శ్రమతో కూడిన పని. రెడీమేడ్‌ దుంపలతోనే వాటర్‌లిల్లీలు బాగా పుష్పిస్తాయి.

kaluva
  •  తామర, కలువల మధ్య తేడా ఏంటి ?

   తామర, కలువలను గుర్తుపట్టడంలో చాలామంది పొరబాటు పడుతుంటారు. తామరాకు దళసరిగా పెద్దదిగా ఉంటుంది. దీనిమీద నీటిబొట్లు పడితే అంటుకోకుండా జారిపోతాయి. పువ్వు పెద్దగా, అందంగా ఉంటుంది. కాడకు చిన్నచిన్న ముళ్ళు ఉంటాయి. కలువలు నీటి మీద తేలినట్టు పూస్తాయి. సువాసనలను వెదజల్లుతాయి. ఇది మన జాతీయపుష్ప చిహ్నం. ఈ మొక్క చాలా కాయలు కాస్తుంది. పగలు ఎక్కువగా వికసిస్తుంది. కలువ మాత్రం కాస్త చిన్నగా ఉండే పువ్వులు పూస్తుంది. కలువ పువ్వు ఆకుల మధ్యలో కట్‌ ఉండి, తేలిగ్గా నీటిలో తడుస్తాయి. కాడలు సున్నితంగా ఉంటాయి. నీటి ఉపరితలం కంటే కాడ కాస్త పైకొచ్చి, కలువ పువ్వులు వికసిస్తాయి. ఒక్కో మొక్కకు ఒక్కో కాయ మాత్రమే కాస్తుంది. కలువ పువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రీయ పుష్పం. ఎక్కువగా రాత్రిపూట పువ్వులు పూస్తాయి.

kaluva.
  • బురద నీటిని శుభ్రపరుస్తాయి

    ఇవి బురదలో పుట్టడం వల్ల పంకజాలని పిలుస్తారు. బురద నీటిని పరిశుభ్రంగా మారుస్తాయి. తామర గింజలను పూల్‌మకాన్‌ పేరుతో ఇటీవల కూరగా వినియోగం పెరిగింది. పల్లెల్లో పూర్వం నుంచీ తామరాకులను మాంసాహారాన్ని పొట్లాలు కట్టడానికి ఉపయోగించేవారు. కలువల ఆకుల రసాన్ని నరాల రోగాలు, అజీర్తికి, విరేచనాలు ఉపశమనానికి తయారుచేసే మందుల్లో వాడతారు. ఇంకా వీటి పూలను అలంకరణకు, పూజలకు వాడుతుంటారు.

kaluva..
  • అలరిస్తున్న పాండ్లు

   సిమెంటు కుండీల మాదిరి నర్సరీ రైతులు తయారుచేస్తున్న చిన్న కలువకొలను (పాండు) ఎంతో ఆకర్షణీయంగా ఉంటోంది. తామరలు, కలువలు, వాటర్‌లిల్లీల మిశ్రమంలో దీన్ని తయారుచేస్తున్నారు. వీటిలో కొన్ని పగలు, మరికొన్ని రాత్రులు, ఇంకొన్ని నిత్యం రంగుల పువ్వులు పూస్తూ సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

- చిలుకూరి శ్రీనివాసరావు
8985945506