
మహిళలను మానసిక ఆరోగ్య సమస్యల నుంచి, నిరాశ నిస్పృహల నుంచి కోలుకునేలా చేయడం. ముందుగా ప్రభుత్వం మానసిక సమస్యలను నివారించే దిశగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే సమస్యను ఎంతో కొంత నివారించవచ్చు. అయితే సమస్యే ఉత్పన్నం కాకూడదంటే... మూల కారణాలను వెతికి పట్టుకొని నివారణ మార్గాలను అన్వేషించాలి. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఇవ్వడం ద్వారా కూడా సమస్యను కొంతమేర పరిష్కరించుకునే అవకాశముంది. దీని కోసం మహిళల ఉపాధిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
వరకట్నం.. వేధింపులు.. కుటుంబ, వివాహ సమస్యలు.. గృహ హింస.. కారణం ఏదైనా ఇల్లాలు ఆత్మస్థైర్యం కోల్పోతోంది. బలవన్మరణాన్ని ఆశ్రయిస్తోంది. ప్రతి 25 నిమిషాలకు ఒక గృహిణి ఆత్మహత్య చేసుకుంటోంది. ఇది సమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) విడుదల చేసిన గణాంకాలు చూస్తే పరిస్థితి తీవ్రత మనకు అర్థమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడే మహిళల్లో దాదాపు 40 శాతం మంది భారతీయులే. ఇటీవల ప్రచురించిన లాన్సెట్ అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. గృహిణుల ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకుంటూనే... ప్రస్తుతం వాటి నివారణకు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
రోజుకు 61 మంది...
ఎన్.సి.ఆర్.బి రికార్డుల ప్రకారం భారతదేశంలో 2020 సంవత్సరంలో మొత్తం 1,53,052 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 50 శాతం కంటే ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే...వీరిలో 14.6 శాతం మంది అంటే 22,372 మంది గృహిణులే. ఈ లెక్కన చూసుకుంటే సగటున రోజుకు 61 మంది గృహిణులు ఆత్మహత్య చేసుకుంటుంటే, ప్రతి 25 నిమిషాలకు ఒక ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. 1997 నుంచి ప్రతి ఏటా 20 వేల మంది గృహిణులు ఆత్మహత్యలు చేసుకుంటుండగా, 2009 నుంచి ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య 25 వేలకు పెరిగింది.
ప్రధాన కారణాలు మూడు
సాధారణంగా ఆత్మహత్యలకు అనేక కారణాలు ఉన్నా గృహిణుల ఆత్మహత్యలకు ప్రధానంగా మూడే కారణాలు మనకు కనిపిస్తాయి. మొదటిది గృహ హింస. 30 శాతం మంది మహిళలు గృహ హింసకు గురవుతున్నారని, పెళ్లి తర్వాత రోజువారీ ఇంటి చాకిరీ, అణచివేతకు గురవుతూ అత్తవారింట ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు ఒక ప్రభుత్వ సర్వేలో తేలింది. గృహ హింస వల్ల మహిళల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. వీరిలో ఆత్మహత్య ఆలోచనలు మూడు రెట్లు అధికంగా ఉంటాయని 2012లో నిర్వహించిన ఓ పరిశోధన తేల్చింది. కోవిడ్ సమయంలో గృహ హింస కేసులు మరింత ఎక్కువైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్న మహిళల్లో మూడు వంతుల మంది గృహ హింసకు గురైనట్లు ఒక స్వతంత్ర సంస్థ నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది.
రెండో ప్రధాన కారణం వరకట్నం. గృహిణుల ఆత్మహత్యల్లో సగానికి పైగా వరకట్న వేధింపులతోనే జరుగుతున్నాయని తెలుస్తోంది. 1930 కంటే ముందు దేశంలో జరిగిన వివాహాల్లో కేవలం 40 శాతం వివాహాల్లో మాత్రమే వరకట్న వ్యవహారాలు ఉండగా, 2000 తర్వాత ఈ సంఖ్య 90 శాతానికి చేరుకుంది. వరకట్న వేధింపులతో మహిళలు తిరిగి పుట్టింటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. సమాజ కట్టుబాట్లు అంటూ మళ్లీ వారిని అత్తారింట్లోనే ఉండాలని బలవంతం చేయడంతో ఆత్మహత్య ఆలోచనలు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది.
మూడో ప్రధాన కారణం ఆర్థికంగా పూర్తి స్థాయిలో భర్తలపై ఆధారపడి ఉండడం. దీని వల్ల నిరాశ, నిస్సహాయత, డిప్రెషన్ పెరిగిపోతుంది. దీనితోపాటు ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన కూడా పెరిగిపోతుంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువ. అంతేకాకుండా ప్రతి ఏడాది ఇది ఇంకా తగ్గుతూనే ఉంది. 'ఇంటి పనుల్లో బిజీగా ఉండడం వల్ల బయట ఇతర పనులు చేయలేం. ఇంటి పనులు చేయడానికి ఇతరులు ఎవరూ సిద్ధంగా కూడా ఉండరు' అంటూ ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో 64 శాతం మహిళలు అభిప్రాయపడ్డారు. అంటే శ్రామికశక్తిలో వారి భాగస్వామ్యం ఎందుకు తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెల్లింపులే లేని ఇంటి పని కోసం ప్రతి మహిళ ప్రతి రోజు ఐదు గంటలు తన సమయాన్ని కేటాయిస్తుంది. ఇంకా ప్రతి రోజు రెండున్నర గంటలు పిల్లలు, భర్త సంరక్షణ సేవలకు సమయాన్ని ఇస్తుంది.
మహిళలతో పోల్చుకుంటే మగవాళ్లు వీటికి కేటాయించే సమయం గంటన్నర మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు సొంత సంపాదన లేకపోవడంతో సొంతగా నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గిపోతుంది. అంతేకాకుండా వాళ్లు తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకోలేకపోతున్నారు. మహిళలు ఆర్థికంగా ఇతరులపై ఆధారపడడం వలన వారు ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడానికి, వివిధ మానసిక, ఆరోగ్య సమస్యలకు చికిత్స తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. దీనివల్ల కూడా ఆత్మహత్యల శాతం పెరిగిపోతున్నట్లు సైకియాట్రిస్టులు చెబుతున్నారు.
గృహిణుల ఆత్మహత్యలను తగ్గించడానికి ప్రధానంగా రెండు రకాల నివారణ మార్గాలపై దృష్టి సారించవచ్చు. మొదటిది, మహిళలను మానసిక ఆరోగ్య సమస్యల నుంచి, నిరాశ నిస్పృహల నుంచి కోలుకునేలా చేయడం. ముందుగా ప్రభుత్వం మానసిక సమస్యలను నివారించే దిశగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే సమస్యను ఎంతో కొంత నివారించవచ్చు. అయితే సమస్యే ఉత్పన్నం కాకూడదంటే... మూల కారణాలను వెతికి పట్టుకొని నివారణ మార్గాలను అన్వేషించాలి. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఇవ్వడం ద్వారా కూడా సమస్యను కొంతమేర పరిష్కరించుకునే అవకాశముంది. దీని కోసం మహిళల ఉపాధిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా పురుషులు, మహిళలు ఇద్దరి మనస్తత్వాలు, ఆలోచన విధానాల్లో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరముంది. ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు చేపడితే మేలు.
ఫిరోజ్ ఖాన్
/ వ్యాసకర్త సెల్ : 9640466464 /