Jun 07,2023 23:23

ప్రజాశక్తి-కాకినాడ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మహిళలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు అందించి వారికి ధైర్యం, శక్తి, గౌరవం కల్పించారని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. బుధవారం కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన దాదాపు 5,380 మందికి చొల్లంగి గ్రామ పరిధిలోని లే అవుట్‌లో ఇళ్ల స్థలాల అప్పగింత కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా, కాకినాడ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దంపతులు, రాష్ట్ర రైస్‌ మిల్లర్ల సంఘం అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కుడా ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ మహేష్‌ కుమార్‌ రావిరాల, మాజీ మేయర్‌ సుంకర శివప్రసన్న, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పేదవానికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో 33 లక్షలకు పైగా ఇళ్ల స్థలాల పట్టాలను ముఖ్యమంత్రి అందించారని మహిళలను లక్షాధికారులను చేశారని పేర్కొన్నారు. ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎన్నికలకు ముందు పది వేల మందికి సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పుడు అంతకుమించి దాదాపు 33 వేల మందికి ఇళ్ల కల సాకారం చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ ఎంత ఖర్చయినా ఫర్వాలేదు పేదలకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ సంకల్పం మేరకు ఎకరా రూ.70 లక్షలకు ప్రైవేటు భూమి కొనుగోలు చేసి 116 ఎకరాల్లో మంచి లే అవుట్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. రెండు నెలల పాటు అధికారులు శ్రమించి స్టోన్‌ ప్లాంటేషన్‌ చేసినట్లు వెల్లడించారు. భారీ అవుట్‌లో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతు న్నాయని పేర్కొన్నారు. రహదారులు, విద్యుత్‌, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సిహెచ్‌.నాగనరసింహారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.